‘ఫోకస్‌’ తప్పుతోంది  | Concentration decreases from children to adults | Sakshi
Sakshi News home page

‘ఫోకస్‌’ తప్పుతోంది 

Published Fri, Apr 7 2023 4:04 AM | Last Updated on Fri, Apr 7 2023 7:09 AM

Concentration decreases from children to adults - Sakshi

కంచర్ల యాదగిరిరెడ్డి : 
అర నిమిషం తీరిక లేదు... అర్ధరూపాయి సంపాదన లేదు.. ఈ సామెత వింటుంటే ఈ తరం బడిపిల్లలు గుర్తుకు వస్తున్నారు. ఎప్పుడు చూసినా పుస్తకాల్లో తలమునకలై ఉంటారు. బాగా చదువుతున్నారే అని మురిసిపోయినా.. పరీక్షల్లో వచ్చిన మార్కులు చూస్తే అత్తెసరు. ఈ తరం పిల్లల్లో ఎక్కువ మంది ఫోకస్డ్‌గా లేకపోవడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు. అసలు పెద్దవారి ఏకాగ్రత కూడా బాగా తగ్గిపోతోందని.. స్మార్ట్‌ఫోన్లు, ఇతర డిజిటల్‌ పరికరాలు, మాధ్యమాల వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నారు. 

దృష్టి మళ్లే దారులెన్నో.. 
మునుపటితో పోలిస్తే పిల్లల దృష్టి మళ్లేందుకు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, టీవీలు ఇలా ఎన్నో కారణమవుతున్నాయి. నిత్యం ఎవరో ఒకరి నుంచో, ఏదో వాట్సాప్‌ గ్రూపులోనో మెసేజీలు రావడం, ఫేస్‌బుక్‌ నోటిఫికేషన్లు, స్మార్ట్‌ వాచ్‌ మెసేజ్‌.. ఇలా తరచూ మన దృష్టిని తప్పిస్తున్నాయని, దీనివల్ల తదేకంగా ఒక పనిని శ్రద్ధగా చేసే శక్తిని కోల్పోతున్నామని నిపుణులు చెప్తున్నారు.

సెల్‌ఫోన్లు రాకముందు, సాంకేతిక విప్లవం లేనప్పుడు మనుషులు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా ఉన్నారన్నదానిపై అమెరికాలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్, అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌’ఇటీవల ఓ అధ్యయనం చేసింది. 1946–1975 మధ్య కాలంలో పుట్టి, రకరకాల రంగాల్లో పనిచేస్తున్న వారిని, 1976–2000 మధ్య పుట్టి పలు రంగాల్లో ఉన్న వారిని, ప్రైమరీ స్కూల్, హైసూ్కల్, కాలేజీ విద్యార్థులను ప్రశ్నించి.. ఐక్యూ టెస్ట్‌ పెట్టింది. ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ఈ అధ్యయనం సాగింది.

ఏ పనికైనా ఫోకస్‌ అవసరం! 
మనం ఏ పనిచేయాలన్నా ఫోకస్‌ అనేది చాలా అవసరం. లేకుంటే ఏ పని సరిగా, త్వరగా పూర్తి చేయలేం. తరాలు మారుతున్న కొద్దీ ఫోకస్‌ టైం మారుతూ వస్తోందని అధ్యయనంలో తేలింది. ఉదాహరణకు బేబీ బూమర్లు అంటే 1946–1964 మధ్య పుట్టినవాళ్లకు ఫోకస్‌ టైం ఇరవై నిమిషాలు ఉండేది. తర్వాతి తరం జనరేషన్‌ ఎక్స్‌ అంటే 1965–1980 మధ్య పుట్టినవారి ఏకాగ్రత 12 నిమిషాలకు చేరింది.

1981, ఆ తర్వాత పుట్టినవారికి ఇది కేవలం ఎనిమిది నుంచి 12 నిమిషాలే.. ఫోకస్‌ పెట్టలేక పోయినప్పుడు అరగంటలో చేయాలనుకున్న పని గంట, గంటన్నర పడుతుంది. పైగా చేసే పనిలో నాణ్యత ఉండదని.. యాంగ్జైటీ, డిప్రెషన్‌ వంటి సమస్యలూ వస్తాయని, మానసిక ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. నాలుగేళ్ల కితం జరిగిన ఒక పరిశోధన ప్రకారం.. ఇంటర్నెట్‌ వాడకం మన మెదడులోని పలు ప్రాంతాల్లో మార్పులకు కారణమవుతుందని తేలింది.

ఇలా మారిపోయే విషయాల్లో మన జ్ఞాపకాలూ ఉన్నాయని వెల్లడైంది. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్, అండ్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌’అధ్యయనం ప్రకారం కూడా.. నిద్రకు ఉపక్రమించే ముందు స్మార్ట్‌ఫోన్‌ లేదా ఇతర డిజిటల్‌ స్క్రీన్లను చూడటం వల్ల నిద్రకు చేటు కలుగుతుంది. అది కాస్తా వారి రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది.

వాటితో కేవలం పరధ్యానమే.. 
కంప్యూటర్ల వాడకంతో మనుషుల మానసిక స్థితిపై కలిగే ప్రభావంపై ఇంకో అధ్యయనం కూడా జరిగింది. ఆ్రస్టేలియాకు చెందిన డాక్టర్‌ షరోన్‌ హార్‌వుడ్‌ నిర్వహించిన ఆ అధ్యయనం ప్రకారం.. టెక్నాలజీ అనేది మన మేధో సామర్థ్యాన్ని వెంటనే మార్చేస్తుందనడం పూర్తిగా వాస్తవమేమీ కాదు. యుగాలుగా రకరకాల పరిస్థితు లను ఎదుర్కొని పరిణామం చెందిన మెదడు పనితీరు ఒక్క తరంలో మారిపోదని ఆమె చెప్తున్నా రు. కాకపోతే డిజిటల్‌ పరికరా­లు మన మనసును పరధ్యానంలో పడేస్తాయని స్పష్టం చేస్తున్నారు. 

పక్కన ఉన్నా ప్రభావమే.. 
మన పరిసరాల్లో స్మార్ట్‌ఫోన్, ఇతర డిజిటల్‌ స్క్రీన్‌ డివైజ్‌ ఉంటే చాలు మన ఏకాగ్రత స్థాయి గణనీయంగా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. ఆలోచించడం, గుర్తుంచుకోవడం, భావోద్వేగా­ల నియంత్రణకు కారణమైన విషయాలపై దృష్టిపెట్టడం వంటివాటిపై స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్ల వంటివి ప్రభా­వం చూపగలవని ఎన్నో అధ్యయనాల్లో తేలిందని స్పష్టం చేస్తున్నారు. చేతుల్లో, లేదా జేబులో, పక్కన టేబుల్‌పైనో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే.. మన మనసు చేసే పనిపై కాకుండా ఫోన్‌కు వచ్చే నో­టిఫికేషన్లు లేదా అది చేసే శబ్దాలపై పడుతుందని వెల్లడైందని వివరిస్తున్నారు.  

క్షణం విడిచి ఉండలేకుండా.. రోజులో గంటా రెండు గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో లేకపోయినా సరే నానా హైరానా పడే వారి సంఖ్య బాగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే పాశ్చాత్యదేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారని.. మన దేశంలోనూ ఆ పరిస్థితి వస్తోందని హెచ్చరిస్తున్నారు. తక్షణ తృప్తి (ఇన్‌స్టంట్‌ గ్రాటిఫికేషన్‌) కారణంగానే మనుషులు డిజిటల్‌ పరికరాలకు బానిసలవుతున్నట్టు వివరిస్తున్నారు. చాలా దేశాల్లో పిల్లలు నిపుణులు సూచించిన దాని కంటే ఎక్కువ సమయం డిజిటల్‌ తెరల ముందు గడుపుతుండటం ఆందోళనకరమని స్పష్టం చేస్తున్నారు.  

సమస్యను గుర్తించడం ఎలా?
చేపట్టిన పనిని పూర్తి చేసేందుకు  కష్టపడుతుంటే, కష్టం అనిపిస్తుంటే, అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతుంటే ఫోకస్‌ కోల్పోయామని అర్థం. 
 అకారణంగా చిరాకు అనిపిస్తున్నా, మన దృష్టి సులువుగా పక్కదారి పడుతున్నా, రెస్ట్‌లెస్‌గా అనిపిస్తున్నా.. ఫోకస్‌ కోల్పోయామని స్పష్టంగా తెలుస్తుంది.  
 ముఖ్యమైన అంశాలను అప్పటికప్పుడు మర్చిపోతుంటే ఫోకస్‌ పోతున్నట్టే. 

ఏమిటి పరిష్కారం? 
 ఫోకస్‌ పెంచుకునేందుకు సులువైన మార్గాలెన్నో ఉన్నాయి. మన ఏకాగ్రతను దెబ్బతీస్తున్న మొబైల్‌ ఫోన్‌ నోటిఫికేషన్, కంప్యూ­టర్‌ నోటిఫికేషన్‌ వంటివి ఆఫ్‌ చేయాలి లేదా అత్యవసరమైనవే వచ్చేలా సెట్‌ చేసుకోవాలి.  
 ♦ ఏ పని ముందు చేయాలి? ఏ పని తరువాత చేయాలి? దేనికి ప్రాధాన్యత ఎక్కువ? దేనిని నిర్ణీత సమయం (డెడ్‌లైన్‌)లోపు పూర్తి చేసుకోవాలన్న దానిపై కొంత వర్క్‌ చేసుకుని ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడం నేర్చుకుంటే ఫోకస్‌ పెరుగుతుంది. 
ప్రతిరోజు మైండ్‌ ఫుల్‌నెస్‌ ప్రాక్టీస్‌ చేయాలి. అంటే పూర్తిగా చేసే పనిపైనే ధ్యాస నిలిపాలి. ఉదాహరణకు.. ఉద­యం లేవగానే బ్రష్‌ చేసేటప్పుడు ఆ బ్రషింగ్‌పై మాత్రమే, కాఫీ తాగేటప్పు­డు దానిపై మాత్రమే ధ్యాస నిలి­పేందు­కు ప్రయత్నించాలి. ఇలా అన్ని పనుల­కూ వర్తింపజేయాలి. దీనిని రోజూ ప్రా­క్టీస్‌ చేయడం ద్వారా ఫోకస్‌ ఆటోమేటి­గ్గా పెరుగుతుంది.     
 –విశేష్ , సైకాలజిస్ట్‌  

ఇంటర్నెట్‌కు బానిసవుతున్న జనం
ప్రపంచవ్యాప్తంగా జనం ఇంటర్నెట్‌కు బానిసగా మారుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది. వాటి ప్రకారం.. రోజులో ఒక్కొక్కరూ కనీసం 149 నిమిషాల పాటు స్మార్ట్‌ఫోన్‌ను చూస్తూ గడుపుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు రాత్రిళ్లు నిద్రలేచి మరీ సోషల్‌ మీడియా పోస్టులు చూసుకుంటున్నారు. వీడియో గేమ్స్‌ ఆడే యువకులు వారంలో వాటిపై గడిపే సమయం 8 గంటలకు పైనే.. అమెరికాలో ట్రాఫిక్‌ ప్రమాదాల్లో 26శాతం స్మార్ట్‌ఫోన్‌ చూస్తూ డ్రైవింగ్‌ చేయడం వల్లనే జరుగుతున్నాయి! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement