బాలింతల కోసం యాప్స్ | Maternal For Baby Sleep Instant App | Sakshi
Sakshi News home page

బాలింతల కోసం యాప్స్

Published Mon, Sep 19 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

బాలింతల కోసం యాప్స్

బాలింతల కోసం యాప్స్

కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్లు  - జీవితంలో ఒక భాగమైపోయిన రోజులివి. సినిమా టికెట్ నుంచి బయటకు వెళ్ళడానికి కారు బుక్ చేసుకోవడం దాకా అన్నీ స్మార్ట్‌ఫోన్లు, వాటిలోని రకరకాల అప్లికేషన్స్ (యాప్స్)తో జరిగిపోతున్నాయి. ఇంటా, బయటా చేతి నిండా పనులతో ఆకాశంలో సగంగా మారిన ఆడవారికి ఉపయోగంగా ఉండడం కోసం చాలా యాప్స్ వచ్చాయి. ముఖ్యంగా, ఒకవైపు ఇంటి పని, మరోవైపు పసిపాప పని చూసుకోవాల్సిన చంటిపిల్లల తల్లులను దృష్టిలో పెట్టుకొని, ప్రత్యేక యాప్స్ కూడా తయారయ్యాయి. అలాంటి వాటిలో కొన్నిటి గురించి...
 
బేబీ ట్రాకర్: క్షణం తీరిక లేకుండా గడిపే బిజీ బిజీ తల్లితండ్రులు తమ కోసం తాము తయారుచేసుకున్న యాప్ - ‘బేబీ ట్రాకర్’. ఈ యాప్ వల్ల చంటిపాప రోజువారీ అలవాట్లు, ఆరోగ్యం, మొదటిసారిగా పాపాయి బోర్లాపడిన సంగతులు అన్నీ నమోదు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఈ యాప్‌లో పాపకు పాలు పట్టిన వేళలు, పొత్తిగుడ్డలు మార్చిన సమయం, నిద్ర అలవాట్ల లాంటివన్నీ నమోదు చేస్తూ, ఫోటోలు కూడా చేర్చడం వల్ల ఉపయోగాలున్నాయి. డాక్టర్ల దగ్గరకు వెళ్ళినప్పుడు, లేదంటే ఆఫీసు వేళల్లో శిశు సంరక్షకుల దగ్గర బిడ్డను కొద్దిగంటలు వదిలివెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ యాప్‌లో నమోదు చేసిన సంగతులన్నీ టైమ్‌కి పనికొస్తాయి. అలాగే, చంటిపాపకు సంబంధించిన ఆ తొలినాళ్ళ తీపి జ్ఞాపకాలన్నీ చుట్టాలకూ పక్కాలకూ చూపించి, ఆనందించవచ్చు. అలాగే, ఈ యాప్‌లో పెట్టుకున్న సమాచారం ద్వారా పసిబిడ్డ అలవాట్లు ఏ వారానికి ఆ వారం, ఏ నెలకు ఆ నెల ఎలా మారుతున్నాయో బాలింతరాలైన అమ్మకు ఇట్టే అర్థమవుతుంది.
 
పెప్పెర్ ట్యాప్: ఇంట్లో చంటిపాపను చూసుకోవాలి, బజారు నుంచి ఇంటికి సామాన్లూ తెచ్చుకోవాలి. ఇంట్లో హెల్ప్ చేసేవాళ్ళు లేక ఇబ్బందిపడుతున్నారా? మీ ఇబ్బంది ఇప్పుడు మటుమాయం. ఈ సరికొత్త యాప్ ద్వారా మీకు కావాల్సిన పచారీ కొట్టు సామాన్లన్నీ తెప్పించుకోవచ్చు. మీకు కావాల్సిన టైమ్‌కి, కావాల్సిన చోటుకు సరుకులు వచ్చేలా చూసుకోవచ్చు.
 
ప్లస్స్: ఈ యాప్ సర్వీస్ ద్వారా కావాల్సిన మందులు, పర్సనల్ కేర్ వస్తువులు, బేబీ కేర్ ప్రొడక్ట్‌లు, పెంపుడు జంతువులకు కావాల్సినవి - అన్నీ ఇంటికే తెప్పించుకోవచ్చు. మందుల ప్రిస్క్రిప్షన్‌ను ముందుగా ఈ యాప్ ద్వారా ఫోటో తీసి, ఆర్డర్ చేస్తే చాలు. కావాల్సిన మందులన్నీ ఇంటి ముంగిటకే వచ్చేస్తాయి.
 
మై బేబీ టుడే: చంటిపిల్లలున్న తల్లితండ్రుల కోసం రూపొందించిన ఇన్ఫర్మేటివ్ గైడ్ లాంటిది ఈ ‘మై బేబీ టుడే’ యాప్. శిశువుల పెంపకం, సంరక్షణకు సంబంధించిన సమాచారం ఇందులో ఇస్తారు. చంటిపాపకు చనుబాలు ఇవ్వడం ఎలా, పోతపాలు పట్టడం ఎలా, నిద్రపుచ్చడం ఎలా వగైరా అన్నీ చెబుతారు. అలాగే, చంటిపిల్లల ఫీడింగ్ గైడ్, ఫోటో ఆల్బమ్, చెక్‌లిస్ట్‌లు, గుర్తుపెట్టుకొని వేయించాల్సిన టీకాల గురించి ఇందులో వివరంగా చూపిస్తారు.
 
బేబీ స్లీప్ ఇన్‌స్టంట్ యాప్: పాలు పట్టడం అయిపోతుంది. పొత్తి గుడ్డలు శుభ్రంగానే ఉంటాయి. కానీ, పాప నిద్రపోకుండా ఏడుస్తుంటుంది. ఇలా చాలాసార్లు జరుగుతుంటుంది. అలాంటి సమయంలో జోలపాడి, నిద్రపుచ్చడానికి ‘బేబీ స్లీప్ ఇన్‌స్టంట్’ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో తరతరాలుగా మన ముత్తవ్వలు, నాయనమ్మలు పాడుతూ, పసిపాపల్ని నిద్రపుచ్చిన లాలి పాటలు, జోలపాటలు ఉంటాయి. కావాలంటే, మన సొంత జోల పాటలు కూడా ఇందులో రికార్డు చేసుకోవచ్చు. పిల్లల్ని హాయిగా నిద్ర పుచ్చే ఈ లాలిపాటలతో పిల్లల తల్లులకు భలే ఉపయోగం.
 
క్వికీ: ఇంట్లో కొత్త మెంబర్‌గా పసిపాప పుట్టినప్పుడు, ఇవాళ్టి స్మార్ట్‌ఫోన్ యుగంలో ఆ బిడ్డ ఎదిగే ప్రతి క్షణాన్నీ ఫోటో తీయడం చేతిలో పని. మరి బోలెడన్ని ఫోటోలు తరచూ తీస్తూ వెళుతుంటే, వాటిని క్రమపద్ధతిలో పెట్టుకొనేదెలా? ఈ ‘క్వికీ’ యాప్ పెట్టుకొంటే, మంచి ఫోటోల్ని అదే ఎంచుకొని, వాటిని షార్ట్ ఫిల్మ్స్‌గా మార్చుకోవచ్చు. అలాగే, ‘డే వన్ 2’ అనే మరో యాప్ కూడా ఉంది. దాని ద్వారా మీ చిన్నారి జీవితంలోని ఆనంద క్షణాల్ని ఎప్పుడూ మీ గుప్పెట్లోని ఫోన్‌లో పెట్టుకోవచ్చు. బంధు మిత్రులు చంటిబిడ్డ గురించి ఎప్పుడు అడిగినా, అవి చూపించవచ్చు. ఫోటోలతో పాటు సమయం, సందర్భాలను వివరించే వ్యాఖ్యలు జోడించవచ్చు. కావాల్సిన ఫోటోను వెతుక్కోవడానికి వీలుగా ట్యాగ్‌లు, కీ వర్డ్స్ కూడా వాటికి చేర్చవచ్చు. ఆ తరువాత ఈ ఎంట్రీలన్నిటినీ పి.డి.ఎఫ్.గా మార్చి, అవసరమైతే పుస్తకంగా కూడా ప్రింట్ చేసి, ఆ తీపి జ్ఞాపకాల్ని అందరితో పంచుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement