సాక్షి, హైదరాబాద్: పట్టణాలు, నగరాల్లో అనధికార నిర్మాణాలకు పాల్పడినవారి నుంచి నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి ఆస్తిపన్ను వసూలు చేయడం లేదు. కానీ ఇకపై నిబంధనల ప్రకారం ఆస్తి పన్ను, అదనంగా భారీ మొత్తంలో జరిమానా వసూలు చేయనున్నాయి. ఈ వసూళ్లకు ప్రభుత్వం చట్టబద్దత కల్పించింది. ఈ మేరకు తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అనుమతి తీసుకున్న తరువాత నిర్మాణంలో ఉల్లంఘనల శాతం ఆధారంగా అదనపు పన్ను ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏకంగా వందశాతం అదనంగా ఆస్తిపన్ను విధించడానికి కూడా నగరపాలక, పురపాలక సంస్థలకు అధికారం కల్పించింది. భవన నిర్మాణానికి అనుమతించిన ప్రణాళిక (ప్లాన్)లో నాలుగువైపులా వదలాల్సిన స్థలంలో (సెట్‌బ్యాక్) పది శాతం ఉల్లంఘనతో నిర్మాణం జరిగితే ఆస్తిపన్నుతో పాటు అదనంగా 25 శాతం జరిమానా వసూలు చేస్తారు. పదిశాతం కంటే ఎక్కువ ఉల్లంఘన జరిగితే ఆస్తిపన్నుతో పాటు 50 శాతం జరిమానా, అనుమతికి మించి అదనపు అంతస్తులు నిర్మిస్తే వందశాతం జరిమానా, అలాగే పూర్తిగా అనుమతి లేని నిర్మాణానికి కూడా వందశాతం జరిమానా విధించడానికి అనుమతినిచ్చింది. ఆస్తిపన్ను వసూలు చేసినంత మాత్రాన ఆ ఇంటిని క్రమబద్ధం చేసినట్లు కాదని, ఇంటిని కూల్చే వరకు ఈ ఆస్తిపన్ను వసూలు చేస్తారని స్పష్టం చేసింది. దీంతో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసి భారీ మొత్తంలో ఆస్తిపన్ను, జరిమానాలు వసూలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లించేవారికి, చెల్లించని వారికి ఒకే తరహా సౌకర్యాలు అందుతున్నాయని, ఆస్తిపన్ను చెల్లించకున్నా అనధికార కట్టడాల యజమానులు అన్ని సౌకర్యాలూ పొందుతున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
ఆస్తిపన్ను చెల్లించేవారికి ప్రోత్సాహకాలు
ఆస్తిపన్ను క్రమం తప్పకుండా చెల్లించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎలాంటి నోటీసు లేకుండా ఆస్తిపన్ను మొత్తాన్ని ఏప్రిల్ 30వ తేదీలోపు చెల్లిస్తే.. వారికి ఆస్తిపన్నుపై ఐదుశాతం రాయితీ ఇవ్వనున్నారు. గడువు దాటి చెల్లిస్తే నెలకు రెండు శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు.
పనుల మంజూరు అధికారాల విస్తృతి
గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్‌కు ప్రస్తుతమున్న రూ.20 లక్షల విలువ చేసే పనుల మంజూరు అధికారాన్ని రూ.50 లక్షలకు, స్టాండింగ్ కమిటీకి ఇప్పుడున్న రూ.50 లక్షల మంజూరు అధికారాన్ని రూ.2 కోట్లకు, సర్వసభ్య సమావేశానికి ప్రస్తుతమున్న రూ.2 కోట్ల మంజూరు అధికారాన్ని రూ.5 కోట్లకు పొడిగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్ల కమిషనర్లు రూ.20 లక్షల వరకు, స్థాయీ సంఘం రూ.50 లక్షలు, సర్వసభ్య సమావేశం రూ.2 కోట్ల పనులు మంజూరు చేయవచ్చని, మిగిలిన కార్పొరేషన్లలో కమిషనర్లు రూ.10 లక్షలు, స్థాయీ సంఘం రూ.50 లక్షలు, సర్వసభ్య సమావేశం రూ.2 కోట్ల పనులు మంజూరు చేయవచ్చని పేర్కొంది.
అక్రమ నిర్మాణాలపై ఆస్తిపన్ను
Published Tue, Aug 27 2013 6:30 AM | Last Updated on Tue, Aug 21 2018 12:21 PM
Advertisement
Advertisement