నేర వార్తల ప్రేరణతో
నేర వార్తల ప్రేరణతో
Published Wed, Apr 26 2017 11:17 PM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM
రెండేళ్లలో 115 చైన్ స్నాచింగ్‌లు
రెండు కేజీల బంగారు నగల స్వాధీనం
కేసు ఛేదించిన పోలీసులకు రివార్డులు
రాజమహేంద్రవరం క్రైం (రాజమహేంద్రవరం సిటీ) : రెండేళ్ల కాలంలో 115 చైన్ స్నాచింగ్‌లు చేసి రెండు కేజీలకు పైబడిన బంగారు నగలు చోరీ చేసిన నిందితుడిని రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ జె.కులశేఖర్ పర్యవేక్షణలో త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శ్రీరామకోటేశ్వరరావు, క్రైం పార్టీ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలసి నిందితుడిని క్వారీ మార్కెట్ సెంటర్‌లో మంగళవారం సాయంత్రం అరెస్ట్ చేశామని అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. అతని వద్ద నుంచి 2 కేజీల 069 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటి విలువ రూ.60 లక్షలు ఉంటుందని అన్నారు. వీఆర్వో సమక్షంలో బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. స్థానిక పోలీస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం విలేకరులకు ఆమె వెల్లడించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
ఉభయ గోదావరి జిల్లాలలో...
నిందితుడు భాస్కరరావు చేసిన మొత్తం 115 చైన్ స్నాచింగ్ కేసులు స్టేషన్ల వారీగా ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం వన్‌టౌన్ పరిధిలో 23, టూ టౌన్ పరిధిలో ఆరు, త్రీటౌన్ పరిధిలో 33, ప్రకాష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 37, కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు స్టేషన్ పరిధిలో 10, సమిశ్రగూడెంలో ఒకటి, చాగల్లు స్టేషన్ పరిధిలో ఒకటి ఉన్నాయి. మోటారు సైకిల్ మీద తిరుగుతూ ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళల మెడలో బంగారు నగలు తెంపుకుని పరారయ్యేవాడు.
వ్యవసాయ కుటుంబంలో పుట్టినా...
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నిందితుడు రెండు ఎకరాల పొలం అమ్ముకొని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు రావడంతో రూ.30 లక్షల వరకూ అప్పులపాలయ్యాడు. మద్యం, జూదానికి బానిస అయ్యాడు. రాజమహేంద్రవరం రూరల్ తొర్రేడు గ్రామానికి చెందిన మల్లిన భాస్కరరావు (బాసి) రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్లపై వెళ్లే మహిళల మెడలోంచి బంగారు నగలను చోరీలు చేసేవాడు.
నేర వార్తల ప్రేరణతో
టీవీలలో వచ్చే క్రైం న్యూస్‌పై వచ్చే కథనాల ప్రేరణతో చోరీలకు పాల్పడ్డాడు. రియల్ ఎస్టేట్‌లో నష్టం వచ్చి అప్పులపాలైన భాస్కరరావుకు ఇంట్లో చిల్లిగవ్వ కూడా ఇచ్చేవారు కాదు. దీంతో జల్సాలకు డబ్బులు సంపాదించేందుకు చైన్ స్నేచింగ్‌ను సులువైన మార్గంగా ఎన్నుకున్నాడు. 2015 నుంచి 2016 వరకూ, 2017 ఈ నెల 3న ఇతడు ఆఖరిసారిగా చైన్ స్నాచింగ్ చోరీ చేశాడు.
చిక్కింది ఇలా...
నగరంలో చైన్ స్నాచింగ్స్ జోరుగా సాగుతుండడంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. త్రీటౌన్ కానిస్టేబుల్ పి. వెంకటేశ్వరావుకు ఒక రోజు నిందితుడు ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి సమీపంలోని ఒక వీధిలో తిరుగుతూ కనిపించాడు. అనుమానంతో నిందితుడిని ప్రశ్నిస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పేర్కొంటూ కొన్ని డాక్యుమెంట్లు చూపించాడు. తెల్లటి దుస్తులతో దర్జాగా ఉండడంతో వదిలివేశారు. అయితే ఇతని స్వగ్రామంలో స్థితిగతులపై విచారణ చేస్తే పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. భర్తను వదిలి వేసిన ఒక మహిళతో ఇతడు వివాహేతర సంబంధం కొనసాగించడం, పేదరాలైన ఆమె తరచూ బంగారు నగలు ఎక్కువగా పెట్టుకొని తిరగ డంపై గ్రామస్తులకు అనుమానాలు వచ్చాయి. నిఘా పెట్టిన చైన్ స్నాచింగ్స్ ప్రాంతాలలో నిందితుడు మోటారుసైకిల్‌పై కనిపించడంతో అతడిపై పోలీసుల కన్ను పడింది. అతడి కాల్ డేటా ఆధారంగా నేరం జరిగిన ప్రదేశాలలో నిందితుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ టవర్ లోకేషన్‌కు సరిపోలడంతో నిందితుడిగా గుర్తించారు. నేరాలు ఎక్కువగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల లోపు మాత్రమే చేసి, 9 గంటల కల్లా ఇంటికి వెళ్లిపోయే ప్రణాళికతో నిందితుడు చోరీలకు పాల్పడేవాడు.
పోలీసులకు రివార్డు
ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన క్రైం పార్టీ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ పి.వెంకటేశ్వరరావు వి.శ్రీనివాస్, కేఎస్ శ్రీనివాస్, ఎ.రాంబాబులను ఎస్పీ అభినందించారు. వీరికి ప్రభుత్వం తరఫున రూ.10 వేల రివార్డును అర్బన్ ఎస్పీ రాజకుమారి అందజేశారు. ఇదిలా ఉండగా... ఈ కేసులో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో బంగారు నగలు రికవరీ చేసినా కేవలం 2 కేజీలకు పైబడిన నగలనే పోలీసులు చూపించారన్న ఆరోపణలు వస్తున్నాయి. బంగారు నగలు కొనుగోలు చేసిన బంగారం షాపు వారిపై కేసులు నమోదు చేయలేదని, ఈ కేసులో కొంతమందిని తప్పించారని తెలుస్తోంది.
Advertisement