
నాగ్, వెంకీలే నాకు ప్రేరణ
ఓ పక్క ఉన్నత విద్య చదువుతూనే, మరో పక్క నటునిగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు రోహిత్ మడుపు. ఆ మధ్య విడుదలైన ‘దిల్ దీవానా’తో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రోహిత్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో అతని అంతరంగం.
నేను నటన నేర్చుకుంది అక్కడే..
చిన్నప్పటి నుంచీ నటనంటే ఇష్టం. అందుకే... సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థలో షూటింగులు ఏమైనా జరుగుతుంటే వెళ్లి కూర్చునేవాణ్ణి. నేను నటన నేర్చుకుంది అక్కడే. ఎక్కడా యాక్టింగ్ నేర్చుకోలేదు. మా నాన్నగారు న్యాయవాది, వ్యాపారవేత్త. ఆయన నా అభిరుచి గమనించి, సినిమాలు చేయమని ప్రోత్సహిస్తున్నారు.
వారే నాకు ప్రేరణ
నేను నటుణ్ణి అవడం కూడా యాదృచ్ఛికంగానే జరిగింది. ‘దిల్ దీవానా’ దర్శక, నిర్మాతలు కొత్త హీరో కోసం అన్వేషిస్తున్నారని నా మిత్రుల ద్వారా తెలిసింది. వెంటనే నా ఫొటోలు పంపించాను. ఎంపికైపోయాను. నా నటనకు పరిశ్రమ నుంచి కూడా ప్రశంసలు లభించాయి. వ్యక్తిగా రామానాయుడుగారు, నటునిగా నాగార్జున, వెంకటేశ్‌లు నాకు ప్రేరణ. గొప్ప స్టార్‌గా ఎదగాలని నాకు లేదు. మంచి నటునిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు. త్వరలోనే నేను హీరోగా ఓ చిత్రం మొదలు కానుంది. ఆ వివరాలు త్వరలో చెబుతా.