మనసులు గెలిచిన మావటి
ఏనుగుల ముందు నడుస్తూ, వాటిని నడిపిస్తూ, వాటి అల్లరిని నియంత్రిస్తూ సాగుతుండే మావటి మనకు కొత్తేమీ కాదు. అయితే మావటి అనగానే మనకు పురుషులే కళ్లముందు కనిపిస్తారు. ఎందుకంటే మహిళలెవరూ మావటులుగా ఉండరు కాబట్టి. కానీ ఈ సంప్రదాయాన్ని మార్చి పారేసింది పర్బతీ బరువా. మగాళ్లు చేయగలిగిన ఈ పనిని నేను మాత్రం ఎందుకు చేయలేను అంటూ మావటి అవతారమెత్తింది. ప్రపంచపు మొట్టమొదటి మహిళా మావటిగా ఖ్యాతి గడించింది!
అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ తదితర రాష్ట్రాల్లో ఉన్న దట్టమైన అడవుల్లో అప్పుడప్పుడూ ఒక అద్భుతమైన దృశ్యం కనిపిస్తూ ఉంటుంది. మదమెక్కిన ఏనుగులు రభస చేస్తుంటే, వాటిని ఓ ఆడమనిషి అదుపు చేస్తూ ఉంటుంది. అదిలించో బెదిరించో, లాలించో మచ్చిక చేసుకునో... ఎలాగైతేనేం, వాటి ని దారిలోకి తెస్తుంది. మగాళ్లకే ఎంతో కష్టమైన ఈ పనిని ఆమె చాలా తేలికగా, నేర్పుగా చేసేస్తూ ఉంటుంది. ఆమె పేరు పర్బతీ బరువా. ప్రపంచంలోనే ఏకైక మహిళా మావటి!
నాన్నతోనే మొదలు...
పర్బతీ తండ్రి అస్సాంలో ఓ పెద్ద జమిందారు. ఆయనకు కొత్త కొత్త ప్రదేశాలు చూడటం ఎంతో ఇష్టం. అందుకే సంవత్సరంలో పది నెలలకు పైగా ప్రయాణాల్లోనే గడిపేవాడు. పైగా నలుగురు భార్యలు, పిల్లలు, డెబ్భైమంది పనివాళ్లు, ఓ వైద్యుడు, క్షురకుడు, దర్జీ, పిల్లలకు చదువు చెప్పడానికి ఓ మాస్టార్ని తీసుకుని మరీ విహారం సాగించే వారాయన. ఆయనకు ఏనుగులంటే విపరీతమైన ఇష్టం. అవి నివసించే ప్రదేశాలకు వెళ్తుండేవాడు. వాటిని స్వయంగా శుభ్రం చేస్తూ, తిండి తినిపిస్తూ సంబర పడేవాడు. వాటిని మచ్చిక చేసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. చిన్ననాటి నుంచీ తండ్రిని నిశితంగా పరిశీలించిన పర్బతిలో కూడా ఏనుగుల పట్ల ఆసక్తి మొదలైంది. వాటి మీద ప్రేమ కలిగింది. దాంతో తనూ వాటికి చేరువయ్యింది. వాటిని మచ్చిక చేసుకోవడం, మదపుటేనుగుల మదాన్ని అణచడం పద్నాలుగేళ్లకే నేర్చుకుంది. వయసు పెరిగేకొద్దీ ఏనుగులే తన ప్రపంచం అనిపించడంతో తన జీవితాన్ని వాటికే అంకితం చేసింది పర్బతి. అలా అని పర్బతికి అడవులు, ఏనుగులు తప్ప మరేవీ తెలియవనుకుంటే పొరపాటు.
గౌహతి యూనివర్శిటీ నుంచి పాలిటిక్స్‌లో డిగ్రీ తీసుకుంది. ఆమె అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములంతా వేర్వేరు వృత్తులను ఎంచుకుంటే... పర్బతి మాత్రం ఎలిఫెంట్ ట్రెయినర్‌గా మారింది. ఏనుగులకు ఎలాంటి విద్యనైనా తేలికగా నేర్పించేయగలదామె. ఊరి మీద, పొలాల మీద పడి అల్లరి చేసే తుంటరి ఏనుగుల ఆట కట్టించడంలో నేర్పరి. అందుకే అస్సాం, ఆ చుట్టుపక్కల రాష్ట్రాల అధికారులు ఏనుగులకు ట్రెయినింగ్ ఇవ్వాలన్నా, వాటి వల్ల ఏదయినా ఇబ్బంది ఎదురైనా పర్బతికే కబురు చేస్తారు. అస్సాం అటవీ శాఖ అయితే, ఆమెను చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్‌గా నియమించుకుంది. అంతగా వారి మనసుల్ని గెల్చుకుందామె!
పర్బతి కుటుంబంలో చాలామంది ఇప్పటికీ జమీందారులుగా వెలుగుతున్నారు. కోట్లకు పడగలెత్తారు. అలనాటి హిందీ ‘దేవదాసు’లో నటించిన ప్రమతేష్ బారువా పర్బతికి చిన్నాన్న అవుతారు. అయితే పర్బతి మాత్రం పాపులారిటీ, రిచ్ లైఫ్‌ని ఇష్టపడరు. మావటి అన్న మాటలో ఉన్న ఆనందం జమీందారిణి అన్న మాటలో లేదంటా రామె. ఎప్పటికీ మావటిగానే ఉంటాను, మావటిగానే మరణిస్తాను అని ఒక్కమాటలో తేల్చి చెప్పేస్తారు!
మన దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు, అటవీ శాఖ వారికి కూడా పర్బతి పేరు బాగా తెలుసు. విదేశీయుల మనసుల్ని సైతం గెల్చుకుందామె. బీబీసీవారు ‘క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్’ అనే డాక్యుమెంటరీ తీయడంతో పర్బతి పేరు ప్రపంచమంతా మారుమోగింది. ఎన్నో సన్మానాలు, సత్కారాలు, అవార్డులు ఆమెను వరించాయి.