ఆ మధ్య మా అబ్బాయి ఒకానొక బ్యాంకుకి ‘అప్పు’కి దరఖాస్తు పెట్టు కున్నాడు. ఏకంగా ఆరు గురు అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి ఇంటికి వచ్చారు. ఎవరీ ఆరుగురు? బ్యాంకు మేనేజరు, అకౌం టెంట్, క్రెడిట్ మేనేజరు, రీజనల్ మేనేజర్, అసలు ఈ అప్పు తీసుకోవడానికి ఇతనికి అర్హత ఉన్నదో లేదో నిర్ణయించే ఉద్యోగి (అదేమిటి? ఈ నలుగురూ నిర్ణయించరా)– వీరంతా కాక– చర్చల్లో పాల్గొనకుండా– కాస్త దూరంగా కూర్చున్న మరొక ఉద్యోగి. ఈయనెవరు? మా అబ్బాయి చెప్తున్న సమాధానాలను బట్టి, వారి ప్రశ్నలకు మా అబ్బాయి స్పందనను బట్టి – ఇతను ‘అప్పు తీసుకోవడానికి నిజమైన యోగ్యుడా కాడా అని ‘బాడీ లాంగ్వేజ్’ని కనిపెట్టే ఓ ఉద్యోగి. చాలా ముచ్చటైన, ఏ లోపమూలేని బృందమిది.
నాకు ఆ క్షణంలో రెండే రెండు పేర్లు గుర్తుకు వచ్చాయి. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ. మాల్యా బ్యాంకుల నుంచి కేవలం 9,000 కోట్లు మాత్రమే అప్పు చేశాడు. మరి ఆయన చుట్టూ ఇలాంటి నిఘా వర్గం పనిచెయ్యదా? చెయ్యదు బాబూ చెయ్యదు. మాల్యా గారిని పలకరించే దమ్ము ఏ బ్యాంకు మేనే జర్‌కి ఉంటుంది? ఏ రాత్రో, పనివేళో ఢిల్లీలో పే...ద్ద వర్గాల నుంచి – బ్యాంకు మేనేజింగ్ డైరెక్టరు గారి ఫోన్ మోగుతుంది. రాత్రిళ్లు సీసాలు చప్పుడవు తాయి, కొండొకచో గాజుల చప్పుళ్లూ అవుతాయి. కోట్ల రూపాయలు అడ్రసు మార్చుకుంటాయి. తర్వాత– ఆ గొంతు ఎవరిదో ఈ ఎమ్‌డీ గారు చచ్చినా ఎవరిముందూ చెప్పలేరు. చెప్పరు.
సరే. మాల్యాగారు ఓ మంచి రోజు ఇంగ్లండులో ప్రత్యక్షమయ్యారు. వారిని మన దేశం తీసుకు రావ డానికి కేసు అక్కడ జరుగుతోంది. కేసు ఓ దారికి వచ్చింది. ఏతావాతా, ఇంగ్లండు జడ్జిగారు మాల్యా గారు ఇండియా వెళ్లాల్సిందే అంటే? ఇప్పుడు వ్యవ హారం జపం విడిచి లొట్టల్లో పడింది. ‘తీరా వెళ్లవలసి వస్తే నేను వెళ్తాను. కానీ నన్ను అరెస్టు చేసి ఉంచే ముంబై ఆర్దర్ జైల్లో ఏ గదిలోనూ సరైన సూర్యరశ్మి రాద’ని మాల్యాగారు వాపోయారు. జడ్జిగారికీ ఈ మాట నచ్చింది. నేరస్తులు ఉండే జైలు గదుల్లో చక్కగా సూర్యరశ్మి అయినా ఉండకపోతే ఎలాగ? అక్కడ మన తరఫున వాదించే లాయరు గారిని అడిగారు.
‘అయ్యో, ఆర్దర్ జైలు నిండా బోలెడంత వెలుగు ఉన్నదండీ’ అన్నారాయన. ఆ ‘వెలుగు’ సూర్యరశ్మి కాదని పట్టుబట్టారు మాల్యాగారి లాయర్లు. అక్కడికీ గవర్నమెంటు తరఫు లాయరు గారు చాలా హామీలు ఇచ్చారు. ‘అయ్యా, మాల్యా గారికి మంచి దుప్పట్లు, పరుపులు, తలగడలు, రంగుల రంగుల గలీబులూ ఏర్పాట్లు చేస్తామండీ. వారికి ఏ లోపమూ రానివ్వం’ అని మొర పెట్టుకు న్నారు. ఇదంతా మన దేశంలో ప్రజల సొమ్ముని దోచుకున్న ఓ నేరస్తుడికిచ్చే సుఖాలు. ఇంగ్లండు కోర్టు తప్పనిసరిగా ఏర్పాటు చెయ్యాలని నిర్దేశించే ‘లొట్టలు’.
ఆర్దర్ జైలు ఫొటోలు జడ్జిగారికి తృప్తినివ్వలేదు. జైలు అంతా స్టీలు బోనులాగా కనిపిస్తోందని జడ్జి గారు బాధపడ్డారు. 12 బారక్స్‌లో కేవలం ఆరుగురు పెద్ద మనుషులు (నేరస్తులు) మాత్రం ఉండే ఏర్పాటు ఉన్నదనీ, ఇక్కడ ఎక్కువ మందిని ఉంచే అవకాశం లేదని మన లాయరు గారు– నేరస్తుడి జైలు సౌకర్యాల గురించి కోర్టుకి విన్నవించుకున్నారు. అయినా జడ్జిగారికి నమ్మకం కుదరలేదు. మాల్యా గారికి ఈ జైలు నచ్చలేదు. ఈ బారక్స్‌లో ఎక్కడ కిటికీలు ఉన్నాయి? రోజులో ఏయే సమయాల్లో ఎంతెంత సూర్యరశ్మి వస్తుంది? ఆర్దర్ జైలు వీడియో తీసి మూడు వారాల్లోగా పట్టుకురండి– అని ఆదేశిం చారు జడ్జిగారు. అలాగే మాల్యాగారి అవసరాలకు సరిపోయే నీటి సౌకర్యం, మరుగుదొడ్డి సౌకర్యం ఉన్నదా? ఇవన్నీ తెలియాలి– అన్నారు.
మన జైళ్లలో– నిజంగా నేరం చెయ్యనివారూ, చేశారో లేదో నిర్ధారణ కాని వారిని కూరేస్తున్నారని మనం వింటుంటాం. కానీ అలాంటి అసౌకర్యం 9 వేల కోట్లు స్వాహా చేసిన మాల్యా గారికి కానీ, నీరవ్ మోదీ గారికి కానీ ఉండదు. వారి సౌకర్యాలను– వారు పారిపోయి తలదాచుకున్న దేశాల న్యాయస్థా నాలే సాధికారికంగా ఏర్పాటయేటట్టు చూస్తాయి.
ఏతావాతా, ఈ దేశంలో బ్యాంకు మర్యాదలు–
నువ్వు వెయ్యి రూపాయలు అప్పు చేసి తీర్చలేక పోతే జైలుకి వెళ్తావు.
10 వేల కోట్లు అప్పు చేసి తీర్చలేకపోతే లండన్‌లో ప్రత్యక్షమవుతావు. పెళ్లికొడుకులాగా అప్పుడప్పుడూ టీవీల్లో కనిపిస్తున్నా– నిన్ను గవ ర్నమెంటు, బ్యాంకులేమీ చెయ్యలేవు.
నువ్వు 9 వేల కోట్లు అప్పు చేసి పరారీ అయితే– జైలు గదిలో సూర్యరశ్మి ఉండాలా, పావురాలు ఎగ రాలా? చిలకలు పలకరించాలా? గళ్ల దుప్పట్లు, ముఖమల్ పరుపులు ఉండాలా– నువ్వే నిర్ణయి స్తావు. ఇండియా అధికారులు చచ్చినట్టు అన్నీ ఏర్పాటు చేస్తారు.
ఇంతకీ 9 వేల కోట్లు? ఎవడడిగాడు?
వ్యాసకర్త: గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment