♦ జీవన కాలమ్
కీర్తి హెచ్చరిక. కీర్తి భయంకరమైన బాధ్యత. 24 గంటలూ కంటిమీద కునుకు లేకుండా కాపాడు కోవలసిన, దుర్మార్గమైన ఆస్తి. సజ్జనుడికి అది అలవోక. వ్యసనపరుడి మనసు ఏ మాత్రం బెసికినా– ఆమూ లాగ్రం కబళించే వికృత శక్తి.
పుష్య బహుళ పంచమి. త్యాగరాజస్వామి నిర్యాణం. త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రారంభం. త్యాగరాజు ఒక అపూర్వమైన పంచరత్న కీర్త నని రచించారు–గౌళ రాగంలో –‘దుడుకుగల నన్నే దొరకొ డుకు బ్రోచురా’ అంటూ. భక్తి పారవశ్యంతో దాదాపు 200 సంవత్సరాలు ప్రాణం పోసుకు నిలిచిన అపూర్వ సంగీత రత్నాలను సృష్టించిన వాగ్గేయకారుడు తనది ‘దుడుకుగల’ జీవనం అని చెప్పుకున్నాడు. దుడుకుతనా నికి తననే ప్రధాన పాత్రని చేసుకుని– ఇవ్వాళ్టికీ కని పించే దుడుకుతనానికి ప్రాణం పోశాడు. ఇదేమిటి? ఈ ‘దొరకొడుకు’ ఎవరు? అనిపించేది కీర్తన విన్నప్పుడల్లా. కల్లూరి వీరభద్ర శాస్త్రిగారు సమాధానం చెప్పారు. కోపంతోనో, నిస్పృహతోనో మాట్లాడినప్పుడు– ‘నీ తాత కొడుకు ఎవడు తీరుస్తాడురా నీ ఇక్కట్లు’ అనడం గ్రామీణ ప్రజల నానుడి.
సరే. ఈ ‘దుడుకు’ ఏమిటి? పరధన పరకాంతా చింతనతో పొద్దుపుచ్చుతూ చపలచిత్తుడై బతికాడట. ‘సతులకు కొన్నాళ్లాస్తికై సుతులకు కొన్నాళ్లు ధన తతులకై’ తిరిగాడట. తమిళంలో ఒక సామెత ఉంది: ‘ఆస్తికి ఒరుప య్యన్ అరిమికి ఒరు పొణ్ణు’ అని. ఆస్తిని కూడబెట్టి ఇవ్వ డానికి కొడుకు, ప్రేమని పంచుకోడానికి కూతురు. త్యాగ రాజు తిరువయ్యారులో రచన సాగించాడు కనుక తమిళ నానుడి వారి రచనలో తొంగి చూడటం ఆశ్చర్యం కాదు. దాదాపు 200 సంవత్సరాలు మానవ నైజంలో నిలదొక్కు కున్న జబ్బును– ఇవ్వాళ్టికి చెక్కు చెదరకుండా వర్తించే టట్టు ఆనాడే సూచించిన ద్రష్ట త్యాగబ్రహ్మం. ‘భక్తి’ ఆనాటి ఆలంబన.
సృష్టిలో, సమాజ పరిణామ శీలంలో విచిత్రం ఏమిటంటే త్యాగ రాజు వెళ్లిపోయిన (1847) మరు సటి సంవత్సరమే ఒకాయన పుట్టాడు. ఆయన కందుకూరి వీరేశ లింగం. మరో 14 ఏళ్లకి పుట్టిన మరో మహానుభావుడు గురజాడ. మరుసటి సంవత్సరమే మరో వ్యక్తి జన్మించాడు– గిడుగు రామమూర్తి. వీరు ముగ్గురూ భక్తికి దూరంగా జరిగి సమాజ హితానికి చెరగని ఉద్యమాలుగా నిలిచారు. గురజాడ ‘కన్యాశుల్కం’ ఇప్పటికీ సమాజ రుగ్మతకు అద్దం పట్టే కళాఖండంగా ప్రాణం పోసు కుంది. అటు త్యాగరాజూ చిరంజీవిగా ఈనాటికీ దక్షి ణాది సంగీత ప్రపంచంలో విశ్వరూపం దాల్చాడు.
వీటి జీవ లక్షణానికి పెట్టుబడి ‘సామాజికమైన రుగ్మత’ను ఎండగట్టడమే. ఒకాయన– త్యాగరాజు– ఆర్తిని కీర్తిని చేసుకున్నాడు. తర్వాతి తరంవారు మనిషి దుర్వ్యసనాలను ఎండగట్టడానికి అక్షర రూపం ఇచ్చారు.
అమెరికాలో ఒకావిడ కవితలు రాసింది. రాసిన ఏ కవితనూ ప్రచురించలేదు. ఆమె వెళ్లిపోయాక ఆమె సోదరి ఆ కవితల్ని చూసి ఆశ్చర్యపడి ప్రచురించింది. ఆ కవయిత్రి అమెరికాలో cult figure అయింది– ఎమిలీ డికిన్సన్. ఆమె కవిత – Fame is a bee / It has a song / It has a sting/ Ah, it has a wing! కీర్తి తేనెటీగ లాంటిది. అలరిస్తుంది. ఆదమరిస్తే కాటేస్తుంది. కాపాడుకోలేకపోతే రెక్కలు విదిలించి ఎగిరి పోతుంది.
దాదాపు 55 సంవత్సరాల కిందటి చిత్రం ‘ఎక్రాస్ ది బ్రిడ్జ్’. రాడ్ స్టీగర్ ముఖ్య పాత్ర. ఓ గొప్ప వ్యాపారి. ఓ గోడకి నిలువునా ఆయన చిత్రాన్ని పరిచయం చేశారు. ప్రజాధనాన్ని దోచుకున్నాడు. దేశం నుంచి పరారి అయ్యాడు. రైల్లో మరొకరి పాస్‌పోర్టుని దొంగి లించి, అతణ్ణి రైల్లోంచి తోసేశాడు. అతనికి ఓ కుక్క. రైలు ప్రయాణీకుడు నేరస్తుడు. ఒక దేశంలో మోసగాడు ఇప్పుడు ఈ దేశంలో నేరస్తుడ య్యాడు. కుక్కతోపాటు పుల్లి విస్తరా కుల్లో ఆహారం తిన్నాడు. కుక్కతో ఆత్మీయత పెరిగింది. ఇతన్ని పట్టుకో జూసిన తన దేశపు రక్షక భటులు– తమ దేశానికీ పొరుగు దేశానికీ మధ్య గల పొలిమేరకు కుక్కని దాటించే ప్రయత్నం చేశారు. కుక్క కోసం ఈ వ్యాపారి పరుగు తీశాడు. కుక్కతో పాటు స్వదేశపు పొలిమేర హద్దుమీద రక్షకభటుల కాల్పులకి ప్రాణం వది లాడు. డబ్బుమీద వ్యామోహం ఒక నాడు తరిమింది. కుక్కమీద వ్యామోహం ఈనాడు కట్టిపడేసింది. హద్దుమీద ‘కుక్కచావు’ చచ్చాడు.
ఒకదేశంలో కీర్తికీ పొరుగు దేశంలో తనది కాని కుక్కతో పుల్లి విస్తరాకుల్లో తిండి తినడానికీ– ఇంతకంటే మానవ పతనానికీ నిదర్శనం లేదనుకుంటాను. కీర్తి హెచ్చరిక. కీర్తి భయంకరమైన బాధ్యత. 24 గంటలూ కంటిమీద కునుకు లేకుండా కాపాడు కోవలసిన, దుర్మార్గమైన ఆస్తి. సజ్జనుడికి అది అలవోక. వ్యసనపరుడి మనసు ఏ మాత్రం బెసికినా– ఆమూ లాగ్రం కబళించే వికృత శక్తి. మరి మహాత్ముల, సత్పురుషుల మాట? కీర్తి వారి సత్ప్రవర్తన పరిమళం. దుర్వ్యసన పరుడి కీర్తి కేవలం జిడ్డు. దాన్ని చిన్న తప్పటడుగు అవలీలగా చెరిపేస్తుంది. వెనక్కి తిరిగి చూసుకునేలోగా అధఃపాతాళానికి తొక్కేస్తుంది. కీర్తి వరం– సత్పురుషులకి. కీర్తి కేవలం ఆర్జన– వ్యసనపరులకి.
గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment