టాంటెక్స్ ఆధ్వర్యంలో మరో అష్టావధానం | Ashtavadhanam held by Dr Pudur Jagadeeswaran in Dallas | Sakshi
Sakshi News home page

టాంటెక్స్ ఆధ్వర్యంలో మరో అష్టావధానం

Published Tue, Dec 18 2018 4:31 PM | Last Updated on Tue, Dec 18 2018 4:50 PM

Ashtavadhanam held by Dr Pudur Jagadeeswaran in Dallas - Sakshi

డల్లాస్‌ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 137వ సాహిత్య సదస్సు వీర్నపు చినసత్యం ఆధ్వర్యంలో డల్లాస్‌లో ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 137 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డల్లాస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ముందుగా స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం అయిన లాస్య కండేపి, సహస్ర కాసం, సాన్విక కాసం, మనోజ్ఞ బొమ్మదేవర, ప్రితిక పలనిసేల్వం, దీప్తి గాలి, దర్శిత రాకం, శ్రీఆద్య ఊర, శ్రీనిధి తటవర్తి ప్రార్ధనా గీతం ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాల సింహావలోకనం జరిగింది. నెలల వారిగా వచ్చిన అతిథుల, వారు ప్రసంగించిన అంశాల మీద చర్చ జరిగింది.

అవధానంకు ప్రారంభ సూచకంగా మంజు తెలిదేవర శిష్య బృందం అయిన అనిక మల్లెల, అరుణ గోపాలన్, ద్రువ్ చిట్టిప్రోలు, సుమిత్ చిట్టిమల్ల, భవాని, ఈషాని గీతం ఆలపించారు. తరువాత సాహితి వేముల, సింధూర వేముల, సమన్విత మాడ గరుడ గమన గీతం ఆలపించారు. అమెరికాలో స్థిరనివాసం ఉంటున్న డా. పుదూర్ జగదీశ్వరన్ అవధానిగా ఎదిగి ఇటు ఇంటా అటు బయటా దిగ్విజయంగా అవధాన జైత్రయాత్ర చేయడం అందరినీ అబ్బురపరచే విషయం. అందరిలో ఉత్కంఠను రేపిన ఈ అవధాన కార్యక్రమానికి జువ్వాడి రమణ సంధాతగా, డా. తోటకూర ప్రసాద్ వ్యస్తాక్షరి, కాజ సురేష్ నిషిధ్ధాక్షరి, భాస్కర్ రాయవరం సమస్య, డా. సుధ కలవగుంట న్యస్తాక్షరి, డా. ఊరిమిండి నరసింహారెడ్డి దత్తపది, వేముల లెనిన్ వర్ణన, వీర్నపు చినసత్యం ఘంటాగణనం, దయాకర్ మాడ అప్రస్తుత ప్రసంగం అంశాలకు పృచ్చకులుగా వ్యవహరించారు. లేఖకులుగా బాసబత్తిన, రమణ దొడ్ల, కృష్ణ కోడూరి బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసి అమెరికా అవధానిగా పేరుగాంచిన డా. పుదూర్ జగదీశ్వరన్ గురు వందనంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆద్యంతం ఎలాంటి తొట్రుపాటు లేకుండా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ సమస్యలను పూరిస్తూ అందరినీ అలరింపచేశాడు. 'వాజియు నెక్కెను పఠాని ప్రాకట ఫణితిన్' అన్న సమస్యని శివాజీకి వర్తింప చేస్తూ గడుసుగా పూరించారు. పెరుగు, అరుగు, మరుగు, తరుగు పదాలను ఉపయోగిస్తూ మానవ సమతుల్య జీవనానికి సూత్రాలను దత్తపదిలో పూరించారు. వరూధినీ సౌందర్యాన్ని నిషిద్దాక్షరిలో లాఘవంగా పూరించారు. 20 అక్షరాల ఉత్పలమాల పాదాన్ని వ్యస్తాక్షరిలో ఛేదించారు. ఆద్యంతమూ అప్రస్తుత ప్రసంగం సభికులను నవ్వుల్లో ముంచెత్తింది. అవధాని కూడా చిలిపి ప్రశ్నలకు గడుసు సమాధానాలు ఇచ్చారు. అప్పుడే కార్యక్రమం ముగిసిందా అనిపిస్తూ అవధాని చివరగా అన్ని పద్యాలను అవలీలగా ధారణ చేయడంతో అవధానం దిగ్విజయంగా ముగిసింది. సభికుల హర్షద్వానాల మధ్య ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం , ఉత్తరాధ్యక్షులు  చినసత్యం వీర్నపు , ఉపాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, కోశాధికారి పాలేటి లక్ష్మి ఇతర కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక కమిటి సభ్యులు డా. పుదూర్ జగదీశ్వరన్ ‌ను జ్ఞాపిక , దుశ్శలువాతో సన్మానించి, “అవధాన విరించి”బిరుదుతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో సుబ్బు జొన్నలగడ్డ, ఆనంద్ మూర్తి కూచిభోట్ల, జగదీశ్వర్ రావు, పులిగండ్ల విశ్వనాధ్, డా. ప్రసాద్ తోటకూర, సీ.ఆర్‌. రావు, రామకృష్ణ రోడ్ద ప్రముఖులు పాల్గొన్నారు.  సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.  







 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement