ashtavadhanam
-
యూకేలో మొట్టమొదటిసారిగా అష్టావధానం
ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (UK)లో మొట్టమొదటిసారిగా అష్టావధానం నిర్వహించారు. ప్రణవ పీఠాధిపతి (ఏలూరు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచేతుల మీదుగా జులై 9న ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. తిరుపతి వలె ఏడుకొండలతో విరాజిల్లుతున్న ఎడింబరో నగరం ఈ కార్యక్రమానికి వేదికయ్యింది. వందలాది మంది తెలుగు ఎన్నారైలు ఈ వేడుకను తిలకించారు.స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ శ్రీమతి మైథిలి కెంబూరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయకుడు కుమార్ అనీష్ కందాడ ప్రార్థనా గీతం ఆలపించగా, పల్లవి మంగళంపల్లి తన మధురమైన గాత్రంతో అలరించింది. కార్యక్రమ అనంతరం అవధాని సతీసమేత వద్దిపర్తి పద్మాకర్‌ను పట్టుశాలువా, పూల మాలలు, సన్మాన పత్రంతో సత్కరించారు. -
కెనడాలో ఘనంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ 120వ అష్టావధానం
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం కెనడాలో ఘనంగా జరిగింది. తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్,తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో ఈ వేడుక జరిగింది. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ.. ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది. గత రెండునెలలుగా బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ అమెరికా, కెనడా దేశాలలో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ప్రవచానాలు, ఒక అష్టావధానము, ఒక శతావధానము కూడా నిర్వహించి ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఈ సాహితీసదస్సు తెలుగు భాషాప్రియులకు కన్నులపండుగ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా సంవత్సరాల తర్వాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకురాలు శ్రీమతి లక్ష్మి రాయవరపు మాట్లాడుతూ " ఏ దేశమేగినా ఎందు కాలిడినా చక్కటి తెలుగు మా ప్రాణ ప్రదం, తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుతనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా నెలకొల్పబడింది. తెలుగుతల్లి పత్రిక కెనడాలో ఉన్న తెలుగు ప్రతిభనంతా ఒక చోటికి చేర్చే వేదిక" అని పేర్కొన్నారు. -
విశేషంగా అలరించిన వద్దిపర్తి పద్మాకర్ అష్టావధానం
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" సింగపూర్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకల ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా తెలుగు సాహితీ సంస్కృతికి తలమానికమైన అవధాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. సింగపూర్ వేదికపై బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అష్టావధానం నిర్వహింపబడడం ఇదే తొలిసారి కాగా, ఇది వారు చేసిన 1240 అవధానం కావడం మరొక విశేషం. "తెలుగువారికి గర్వకారణమైన అవధాన ప్రక్రియకు పట్టంకడుతూ అన్ని దేశాలవారితో కలసి నిర్వహిస్తున్న అష్టావధాన కార్యక్రమ పరంపరలో భాగంగా ఈ కార్యక్రమాన్ని సింగపూరు తెలుగువారికి సంక్రాంతి కానుకగా అందించడానికి ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమాల్లో పృచ్ఛకులుగా సింగపూర్ నుంచి తమ సంస్థ సభ్యులే పాల్గొనడం మరింత ఆనందంగా ఉందని" సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. గౌరవ అతిథులుగా రాష్ట్ర శాసనసభ పూర్వ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు, డా. వంగూరి చిట్టెన్ రాజు, సంచాలకులుగా ఆస్ట్రేలియా నుండి అవధాన శారదామూర్తి, తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని సభకు మరింత శోభను చేకూర్చారు. చక్కటి చలోక్తులతో ఆసాంతం ఆసక్తికరంగా కొనసాగిన ఈ అవధానంలో "కృష్ణున్బొంది సుయోధనుండు మురిసెన్ గీతామృతాస్వాదియై" అనే శార్దూల వృత్తంలో సమస్యాపూరణం, దత్తపది అంశంలో "గురువు" అనే పదాన్ని నానార్థాలలో వాడుతూ చంపకమాల వృత్తం, ఆధునిక మహిళ విజయాలపై నిషిద్ధాక్షరి అంశం కొరకు కంద పద్యం, న్యస్తాక్షరి అంశం కొరకు "గాలిపటం" అనే పదంలోని అక్షరాలను వేర్వేరు పాదాలలో వచ్చేలా ఉత్పలమాల పద్యం, రాముని అందాన్ని చూసి మైమరచిన విశ్వామిత్రుని స్పందన వర్ణన అంశం పద్యం మొదలైన అధ్భుత పూరణలు అందరినీ అలరించాయి. పృచ్ఛకులుగా సమస్యాపూరణం - రాధిక మంగిపూడి; దత్తపది- రాధాకృష్ణ రేగళ్ల; నిషిద్ధాక్షరి - అపర్ణ గాడేపల్లి; న్యస్తాక్షరి - రోజారమణి ఓరుగంటి; వర్ణన - స్వాతి జంగా; ఆశువు - పాటూరి రాంబాబు; అప్రస్తుతం - శ్రీ రత్న కుమార్ కవుటూరు; పురాణపఠనం - శ్రీ రాజేంద్రబాబు గట్టు; పాల్గొని చక్కటి ప్రశ్నలతో సభను రక్తి కట్టించారు. సంస్థ కార్యవర్గ సభ్యులు చామిరాజు రామాంజనేయులు సభానిర్వహణ గావించగా భాస్కర్ ఊలపల్లి వందన సమర్పణ చేశారు, ధరణీప్రగడ వెంకటేశ్వరరావు, రమాసత్యవతి దంపతులు "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రతినిధులుగా పద్మాకర్ గురుదేవులను సత్కరించారు. గణేశ్న రాధాకృష్ణ సాంకేతిక నిర్వహణలో యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ నలుమూలల నుండి వేలాదిమంది తెలుగు సాహితీప్రియులు వీక్షించి హర్షించారు. -
సప్త ఖండాల్లో ‘వద్దిపర్తి’ అవధానం
సాక్షి, హైదరాబాద్: ‘త్రిభాషా మహా సహ స్రావధాని’ వద్దిపర్తి పద్మాకర్ ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తోన్న అష్టావధానం ఆసక్తికరంగా సాగుతోంది. ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’ పేర జరుగుతున్న ఈ అవధాన యజ్ఞంలో ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న తెలుగు సాహితీమూర్తులు, భాషాప్రియులు భాగస్వాములవుతున్నారు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల అవధానాన్ని పూర్తిచేసిన వద్దిపర్తి, తాజాగా ఆసియా ఖండావధానం నిర్వహించారు. ఈ అవధాన ప్రక్రియ ఏ ఖం డంలో కార్యక్రమం జరుగుతుంటే ఆ ఖండా నికి చెందిన తెలుగు కవి పండితులు పృచ్ఛకులుగా వ్యవహరిస్తుండటం విశేషం. ఆసియా ఖండ అవధానానికి ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్, కొప్పరపు కవుల మనుమడు మాశర్మ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ‘అమెరికా అవధాని’ పాలడుగు శ్రీచరణ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కవిపండితులు పృచ్ఛకులుగా పాల్గొన్నారు. చల్లా రామచంద్రమూర్తి (సమస్య, ఉత్తరప్రదేశ్), మాడభూషి సంపత్ కుమార్ (దత్తపది, తమిళనాడు), రాధిక మంగిపూడి (న్యస్తాక్షరి, మహారాష్ట్ర), రాళ్లపల్లి సుందరరావు (ఆశువు, పశ్చిమ బెంగాల్), లక్ష్మీ అయ్యర్ (పురాణ పఠనం, రాజస్తాన్) ఫణి రాజమౌళి (అప్రస్తుతం, కర్ణాటక), ముత్యంపేట గౌరీ శంకరశర్మ (నిషిద్ధాక్షరి, తెలంగాణ), నిష్ఠల సూర్యకాంతి (వర్ణన, ఆంధ్రప్రదేశ్)లు పృచ్ఛకులుగా వ్యవహరించారు. ఈ అవధాన ప్రక్రియలో భాగంగా ఆఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న అకృత్యాల మొదలు అనేక అంశాలపై ప్రాశ్నికులు సంధించారు. ‘రాముని పెండ్లియాడె నొక రక్కసి సీత సహాయమాయెగా’అనే సమస్య,‘ముక్కు–చెవి–కన్ను–నోరు’ పదాలతో ’దత్తపది’వంటి అంశాలను అవధాని వద్దిపర్తి పద్మాకర్ అలవోకగా ఎదుర్కొని పద్యరూపాత్మక సమాధానాలతో అబ్బురపరిచారు. -
టాంటెక్స్ ఆధ్వర్యంలో మరో అష్టావధానం
డల్లాస్ : ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” 137వ సాహిత్య సదస్సు వీర్నపు చినసత్యం ఆధ్వర్యంలో డల్లాస్‌లో ఘనంగా జరిగింది. ప్రవాసంలో నిరాటంకంగా 137 నెలలుగా సాహితీ వేత్తల నడుమ ఈ సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రవాస భారత సాంస్కృతిక రాజధాని డల్లాస్‌లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేశారు. ముందుగా స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం అయిన లాస్య కండేపి, సహస్ర కాసం, సాన్విక కాసం, మనోజ్ఞ బొమ్మదేవర, ప్రితిక పలనిసేల్వం, దీప్తి గాలి, దర్శిత రాకం, శ్రీఆద్య ఊర, శ్రీనిధి తటవర్తి ప్రార్ధనా గీతం ఆలపించారు. కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరంలో జరిగిన కార్యక్రమాల సింహావలోకనం జరిగింది. నెలల వారిగా వచ్చిన అతిథుల, వారు ప్రసంగించిన అంశాల మీద చర్చ జరిగింది. అవధానంకు ప్రారంభ సూచకంగా మంజు తెలిదేవర శిష్య బృందం అయిన అనిక మల్లెల, అరుణ గోపాలన్, ద్రువ్ చిట్టిప్రోలు, సుమిత్ చిట్టిమల్ల, భవాని, ఈషాని గీతం ఆలపించారు. తరువాత సాహితి వేముల, సింధూర వేముల, సమన్విత మాడ గరుడ గమన గీతం ఆలపించారు. అమెరికాలో స్థిరనివాసం ఉంటున్న డా. పుదూర్ జగదీశ్వరన్ అవధానిగా ఎదిగి ఇటు ఇంటా అటు బయటా దిగ్విజయంగా అవధాన జైత్రయాత్ర చేయడం అందరినీ అబ్బురపరచే విషయం. అందరిలో ఉత్కంఠను రేపిన ఈ అవధాన కార్యక్రమానికి జువ్వాడి రమణ సంధాతగా, డా. తోటకూర ప్రసాద్ వ్యస్తాక్షరి, కాజ సురేష్ నిషిధ్ధాక్షరి, భాస్కర్ రాయవరం సమస్య, డా. సుధ కలవగుంట న్యస్తాక్షరి, డా. ఊరిమిండి నరసింహారెడ్డి దత్తపది, వేముల లెనిన్ వర్ణన, వీర్నపు చినసత్యం ఘంటాగణనం, దయాకర్ మాడ అప్రస్తుత ప్రసంగం అంశాలకు పృచ్చకులుగా వ్యవహరించారు. లేఖకులుగా బాసబత్తిన, రమణ దొడ్ల, కృష్ణ కోడూరి బాధ్యతలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసి అమెరికా అవధానిగా పేరుగాంచిన డా. పుదూర్ జగదీశ్వరన్ గురు వందనంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆద్యంతం ఎలాంటి తొట్రుపాటు లేకుండా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ సమస్యలను పూరిస్తూ అందరినీ అలరింపచేశాడు. 'వాజియు నెక్కెను పఠాని ప్రాకట ఫణితిన్' అన్న సమస్యని శివాజీకి వర్తింప చేస్తూ గడుసుగా పూరించారు. పెరుగు, అరుగు, మరుగు, తరుగు పదాలను ఉపయోగిస్తూ మానవ సమతుల్య జీవనానికి సూత్రాలను దత్తపదిలో పూరించారు. వరూధినీ సౌందర్యాన్ని నిషిద్దాక్షరిలో లాఘవంగా పూరించారు. 20 అక్షరాల ఉత్పలమాల పాదాన్ని వ్యస్తాక్షరిలో ఛేదించారు. ఆద్యంతమూ అప్రస్తుత ప్రసంగం సభికులను నవ్వుల్లో ముంచెత్తింది. అవధాని కూడా చిలిపి ప్రశ్నలకు గడుసు సమాధానాలు ఇచ్చారు. అప్పుడే కార్యక్రమం ముగిసిందా అనిపిస్తూ అవధాని చివరగా అన్ని పద్యాలను అవలీలగా ధారణ చేయడంతో అవధానం దిగ్విజయంగా ముగిసింది. సభికుల హర్షద్వానాల మధ్య ఉత్తర టెక్సస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షురాలు కృష్ణవేణి శీలం , ఉత్తరాధ్యక్షులు చినసత్యం వీర్నపు , ఉపాధ్యక్షుడు కోడూరు కృష్ణారెడ్డి, సతీష్ బండారు, కోశాధికారి పాలేటి లక్ష్మి ఇతర కార్యవర్గ సభ్యులు, సాహిత్య వేదిక కమిటి సభ్యులు డా. పుదూర్ జగదీశ్వరన్ ను జ్ఞాపిక , దుశ్శలువాతో సన్మానించి, “అవధాన విరించి”బిరుదుతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బు జొన్నలగడ్డ, ఆనంద్ మూర్తి కూచిభోట్ల, జగదీశ్వర్ రావు, పులిగండ్ల విశ్వనాధ్, డా. ప్రసాద్ తోటకూర, సీ.ఆర్. రావు, రామకృష్ణ రోడ్ద ప్రముఖులు పాల్గొన్నారు. సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృభాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభిమానులకు, సాహితీప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. -
అలరించిన నరాల రామారెడ్డి అష్టవధానం
ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా సభల్లో నరాల రామారెడ్డి అష్టవధానం అందరిని ఆకట్టుకుంది. నాటా కన్వెన్షన్ 2018 లిటరరీ కమిటీ ఛైర్ జయదేవ్ మెట్టుపల్లి నరాల రామారెడ్డిని వేదికపైకి ఆహ్వానించగా, సభాధ్యక్షత వహించిన డా. వడ్డేపల్లి కృష్ణ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ నేత లక్ష్మీపార్వతి గౌరవఅతిథిగా హాజరయ్యారు. దత్త పదిగా తానా, ఆటా, నాటా, అమెరికా అను పదాలతో భారతార్థంలో గూడూరి శ్రీనివాస్ పృచ్ఛకునిగా శార్దూల వృత్తాన్ని కోరగా అవధాని చమత్కారంగా పూరించారు. 'రంగమ్మ నిను వీడ జాలనియోన్ రాముడు విభ్రాంతుండై' అన్న సమస్యను డా. పుట్టపర్తి నాగపద్మిని ఇవ్వగా 'సారంగమ్మా' అను సంభోధనతో అవధాని మాయలేడిని వర్ణిస్తూ సమస్యను పూరించి సభికుల్ని ఆనందంలో ముంచెత్తారు. మిగతా పృచ్ఛకులుగా వర్ణన- జయదేవ్, ఆశువు-డా. ఆడువాల సుజాత, న్యస్తాక్షరి- అశోక్, ఘంటసాల-ఆదినారాయణ, అప్రస్తుత ప్రసంగం- సదాశివ రాంపల్లి నిర్వహించారు. నాటా అధ్యక్షులు గంగసాని రాజేశ్వరరెడ్డి అవధాని డా. నరాల రామారెడ్డి, పృచ్ఛకులందరినీ శాలువాతో సన్మానించారు. -
నాటా ఉత్సవాల్లో నరాల రామారెడ్డి అష్టవధానం
వాషింగ్టన్ డీసీ : తన పదహారవఏటనే అవధానం ప్రారంభించిన నరాల రామారెడ్డి నాటా తెలుగు ఉత్సవాల్లో భాగంగా జులై 8వ తేది ఉదయం 9 గంటలకు అష్టవధానం చేయనున్నారు. నరాల రామారెడ్డి గత 52 ఏళ్లుగా దాదాపు వెయ్యి అవధానాలు చేశారు. అమెరికా తెలుగు సంఘాలైన ఆటా, నాటా, తానా ఆహ్వానాలను అందుకొని అమెరికాలో పలుమార్లు అవధానం చేసి మన్ననలందుకున్నారు. జూలై 6,7,8న ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా తెలుగు ఉత్సవాలలో నరాల రామారెడ్డి మరోసారి అష్టవధానం చేయనున్నారు. ఈ అవధాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు హాజరై విజయవంతం చేయాలని నాటా కన్వెన్షన్ 2018 లిటరరీ కమిటీ ఛైర్ జయదేవ్ మెట్టుపల్లి కోరారు. అవధాన చరిత్ర : తెలుగు సాహిత్యనందనోద్యానంలో విలక్షణంగా వికసించిన పుష్పం అవధానం. ఇది పద్యకవితా సుమగంధాలను విరజిమ్ముతుంది. చమత్కారమకరందాలను చిందిస్తుంది. భారతీయ భాషల్లో కేవలం తెలుగు బాషలోనే రూపుదిద్దుకున్న ప్రక్రియ అవధానం ఇది తెలుగువారి సొంతం. సంస్కృత భాష లో వున్న "సమస్యాపూరణం" అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని 1854 సంవత్సరంలో మహా పండితులు మాడభూషి వేంకటాచార్యులు “సమస్య” అనే అంశానికి "నిషిద్ధాక్షరి దత్తపది, వ్యస్తాక్షరి, మొదలైన అంశాలను జోడించి " "అష్టావధానం" అనే పక్రియను రూపకల్పన చేశారు. అవధాన ప్రాశస్త్యం : మాడభూషి వారి మార్గ దర్శకత్వంలో జంటకవులైన తిరుపతి వేంకట కవులు తెలుగు ప్రాంతమంతట జైత్రయాత్ర సాగించి అవధాన పక్రియను జన బాహుళ్యంలోకి తెచ్చారు. "అష్టావధాన కష్టాలంబనమన్న నల్లేరుపై బండిన డక మాకు శతావధాన విధాన సంవిదానంబన్న షడ్రసోపేత భోజనము మాకు" అని తిరుపతి కవులు అవధానరంగంలో సింహాల్లా విజృంభించారు. అష్టావధానంలొ ఎనిమిది అంశాలుంటాయి. సమస్యాపూరణం , దత్తపది అనే అంశాలు అవధాని చమత్కార ప్రతిభను పరీక్షిస్తాయి. నిషిద్దాక్షరి, వ్యస్తాక్షరి పాండిత్య పరీక్ష చేస్తాయి. ఘంటాగణనం, పురాణపఠనం అవధాని ఏకాగ్రతను పరీక్షిస్తాయి. వర్ణన ఆశుకవిత అవధాని కవితా కౌశల్యాన్ని పరీక్షిస్తాయి. అవధానం చేసే వ్యక్తికి ధార (Flow), ధారణ ( preservation ), ధిషణ (talent), ధోరణి (presence of mind), ధైర్యం (courage) అనే పంచధకారాలు ఉండాలని విజ్ఞులు చెప్పారు. -
అలరించిన అష్టావధానం
అవధాన కదనంలో అజేయుడు తాతా సందీప్ రాజమహేంద్రవరం కల్చరల్ : అడుగడుగునా నిషిద్ధాక్షరితో అడ్డుతగిలేవారు కొందరు, వ్యస్తాక్షరితో వెంటాడే వారు మరి కొందరు, సమస్యల చిక్కుముడులు వేసేది ఇంకొందరు.. అప్రస్తుత ప్రసంగాలతో దృష్టిని మరల్చేవారు మిగిలిన చతురులు..అందరినీ అలవోకగా పద్యాల అస్త్రశస్త్రాలతో ఎదుర్కొన్న నూనూగు మీసాల యువకుడు అవధాన అష్టాపద తాతా సందీపశర్మ. అవధాన కదనంలో, పద్యాల పద్మవ్యూహంలో అభిమన్యుడిగా కాక అజేయుడిగా నిలిచిన తాతా సందీపశర్మ సారస్వతాభిమానుల హృదయాలను ఈ అక్షరక్రీడలో గెలుచుకున్నాడు. ఛందస్సు ‘సర్ప పరిష్వంగం’ కాదని, సుమపారిజాతాల పరిష్వంగమేనని సందీప్ చెప్పకనే చెప్పాడు. ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం కళాశాలలో జరిగిన అవధాన ప్రక్రియలో అతిరథ మహారథులు పృచ్ఛకులుగా పాల్గొన్నారు. ధార, ధారణ అవధానానికి ప్రాణం అవధాన సంచాలకుడిగా వ్యవహరించిన ప్రజ్ఞారాజహంస చింతలపాటి శర్మ ముందుగా మాట్లాడుతూ మొక్కవోని కవితాధార, సునిశితమైన ధారణా శక్తి అవధానానికి ప్రాణమన్నారు. 23 వసంతాల ప్రాయంలో 23 అవధానాలు పూర్తి చేసుకుని 24వ అవధానానికి ముందుకు వచ్చిన తాతాసందీపశర్మ సహస్రావధానిగా ఎదగాలని నేటి తరానికిస్ఫూర్తి కావాలని ఆశీస్సులు అందజేశారు. దత్తపది ఇలా... ‘తల’, ‘వల’, ‘ఇల’, ‘కల’ పదాలతో ఆంజనేయస్వామిని వర్ణించమని పృచ్ఛకుడు కోరినదే తడువుగా, తాతా సందీప్ ఇలా పూరించారు.. ‘ఇల’లో చిం‘తల’ దీర్పగ–పలువురుకున్ తా‘వల’ మగు–పవనతనయుడే అలనాడు కోతిమూ‘కల’–కెలమిన్ దాటంగ జలధిని యిచ్చెను దారిన్’ ఒక శీలవతిని విప్రుడు గని ఛీఛీ అనియెన్– పై సమస్యను తాతా సందీపశర్మ ఇలా పూరించారు.. లీలగ నా ప్రవరాఖ్యు–డాలేపనమూని చేరె నద్రిని–తనపై వాలిన వరూధినిని, ఒక –శీలవతిన్ విప్రుడు గని ఛీఛీ అనియెన్’ పృచ్ఛకులుగా అతిరథ, మహారథులు.. ఈ కార్యక్రమానికి ఆంధ్రకేసరి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు వైఎస్ నరసింహారావు అ«ధ్యక్షత వహించారు. పద్యకవితిలక డాక్టర్ యస్వీ రాఘవేంద్రరావు నిషిద్ధాక్షరి, పద్యనాటక రచయిత వి.వి సుబ్రహ్మణ్యం సమస్య, శతకకర్త డీవీ హనుమంతరావు దత్తపది, విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ అద్దేపల్లి సుగుణ వర్ణన, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు పి.నరసింహారావు వ్యస్తాక్షరి, చిలకమర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ల రఘునాథ్ ఆశువు, భాషాప్రవీణ ఎం.వెంకట లక్ష్మి ఘంటావధానం, రామచంద్రుని మౌనిక అప్రస్తుత ప్రసంగాలను సమర్థంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ షేక్ అసదుల్లా అహ్మద్, చైర్పర్సన్ పి.సుభద్ర, ప్రిన్సిపాల్ సీహెచ్ జోగినాయుడు, కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్ బీవీఎస్ మూర్తి పాల్గొన్నారు. నవ్వులు పూయించిన అప్రస్తుత ప్రసంగం.. ‘రామాయణంలో పిడకల వేట అంటారు కదా! మరి భారతంలో?– ఇదీ ప్రశ్న. ‘గారెల వేట–ఇదీ అవధాని సమాధానం ‘అవధానిగారూ : ఇంటికి దీపం ఇల్లాలే అంటారు కదా: మీపేరులోనే సం‘దీప’శర్మ అని ఉండటంతో మీకు ఇల్లాలి అవసరం లేదేమో? ఇదీ ప్రశ్న. మా ఇంట్లో రెండు దీపాలు కావాలి–ఇదీ అవధాని సమాధానం. -
అలరించిన అతివల అక్షరక్రీడ
కురిసిన పద్యాల సుమవర్షం రాజమహేంద్రవరం కల్చరల్ : ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదె ముద్దార నేర్పించినన్’.. అన్న చిలకమర్తి పదాలను సత్యమని అతివలు మరోసారి నిరూపించారు. నన్నయవాఙ్ఞ్మయ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఆదిత్య డిగ్రీ కళాశాలలో అతివల అష్టావధానం రసవత్తరంగా జరిగింది. పాతిక వసంతాలు పైబడిన శతావధాని ఫుల్లాభట్ల నాగశాంతిస్వరూప అందరినీ దీటుగా ఎదుర్కొని అక్షరక్రీడలో, సాహితీసమరాంగణంలో విజేతగా నిలిచారు. అడుగడుగునా నిషిద్ధాక్షరి నిషేధాలను దాటుకుంటూ, సమస్యల చిక్కుముడులు విప్పుతూ, వ్యస్తాక్షరి నియమాలను పాటిస్తూ, ఛందోనియమాలను తప్పకుండా నాగశాంతిస్వరూప చేసిన అష్టావధానం రసజ్ఞులను అలరించింది. విశ్రాంత ఆంధ్రయువతీసంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవీఎస్ మహాలక్ష్మి అవధానానికి సంచాలకత్వం వహించారు. సమన్వయ శక్తి, ధారణ, సమయస్ఫూర్తి, భాషాపటిమ..అన్నీ కలిస్తేనే అవధానమని ఆమె పేర్కొన్నారు. అవధాని అని మగవారినీ, అవధానిని అని మహిళలను పేర్కొనవలసిన అవసరం లేదని, స్త్రీ,పురుషులిద్దరినీ అవధానిగా పేర్కొనడంలో వ్యాకరణరీత్యా అనౌచిత్యం లేదని ఆమె పేర్కొన్నారు. అవధాన కళాకాంతి నాగశాంతి ఫుల్లాభట్ల నాగశాంతిస్వరూప అవధానాన్ని ప్రారంభిస్తూ, తల్లి తండ్రులను, గరువులను స్మరిస్తూ పద్యాలను చెప్పారు. పృచ్ఛకులు సంధించిన అక్షరశస్త్రాలను సమర్థంగా ఎదుర్కొన్నారు. *‘తన సూనున్కొని తెచ్చి కూర్పుమనియెన్ తన్వంగి కామార్తౖయె..’ఇదీ శాంతిస్వరూపకు పృచ్ఛకురాలు ఇచ్చిన సమస్య..కామార్త అయిన తన్వంగి తన సూనుని(కుమారుడిని) తీసుకురమ్మందిట.. ఈ సమస్యను అవధాని ఇలా పూరించారు..‘ వినయంబే తన రూపమై తనరుచున్ విన్నాణిౖయె వెల్గుచున్ తన నాథున్గని జాలినొంది మదిలో దాంపత్యధర్మంబునన్ అనయంబున్ తన పోషణార్ధమునకై అర్ధించె నా తల్లి ‘వే తన సూనున్’ కొనితెచ్చి కూర్పుమనియెన్ తన్వంగి కామార్తౖయె.. కామము అనే పదానికి మనం సాధారణంగా ఉపయోగించే భావంలో కాకుండా కోరిక అన్న అర్థం ఉందని అవధాని వివరించారు. సూనున్ అన్న పదాన్ని ‘వేతన సూనున్’ అని అభివర్ణించారు. *పెళ్లి, ప్రేమ, పబ్బు, క్లబ్బు పదాలతో దత్తపది పై పదాలతో పద్యం చెప్పమని పృచ్ఛకురాలు కోరినప్పుడు, అవధాని ఇలా పూరించారు.. ‘పెళ్లి’ ఒక్కటే స్త్రీలకు వేడుకటర? ‘ప్రేమౖ’మెకాన పడెనిట్టు భామలెల్ల భళిర! ముందు చూ‘పబ్బు’రపరిచె నేడు వెలది! వి‘క్లబ’త్వంబది వీడవలయు.. అలరించిన ఘంటావధానం విశ్రాంత ఆచార్యుడు, ప్రవచన రాజహంస ప్రవేశపెట్టిన ఘంటావధాన ప్రక్రియను ఎం.వెంకటలక్ష్మి నిర్వహించారు. సభకు హాజరైన సాహితీప్రియులు కాగితంపై రాసిచ్చిన పదాలకు అనుగుణంగా వెంకట లక్ష్మి కంచంపై గరిటెతో ఘంట వాయిస్తారు. అవధాని ఆ ఘంటానాదం విని, కాగితంపై రాసిందేమిటో వివరించడంతో సభలో కరతాళధ్వనులు మోగాయి. ద్విశతావధాని ఆకెళ్ల బాలభాను నిషిద్ధాక్షరి, ఆదిత్య తెలుగు ఉపన్యాసకురాలు బీవీ రమాదేవి సమస్య, విశ్రాంత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అద్దేపల్లి సుగుణ దత్తపది, తెలుగు పండితురాలు డాక్టర్ సీఎస్వీ రమణీకుమారి వర్ణన, కవయిత్రి, గాయని డి.విజయలక్ష్మి వ్యస్తాక్షరి, ప్రభుత్వ అటానమస్ కళాశాల తెలుగు ఉపన్యాసకురాలు డాక్టర్ ఎం.సుధామయి ఆÔవవు, సదనం విద్యార్థిని ఎం.వెంకటలక్ష్మి ఘంటావధానం, రామచంద్రుని మౌనిక అప్రస్తుత ప్రసంగాలను నిర్వహించారు. డాక్టర్ మేజర్ చల్లా సత్యవాణి అధ్యక్షత వహించారు. ఆదిత్య విద్యాసంస్ధల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అవధానంలో పాల్గొన్న అతివలను సత్కరించారు.