అలరించిన అతివల అక్షరక్రీడ | ladies ashtavadhanam rajamahendravaram | Sakshi
Sakshi News home page

అలరించిన అతివల అక్షరక్రీడ

Published Tue, Apr 11 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

అలరించిన అతివల అక్షరక్రీడ

అలరించిన అతివల అక్షరక్రీడ

కురిసిన పద్యాల సుమవర్షం
రాజమహేంద్రవరం కల్చరల్‌ : ‘ముదితల్‌ నేర్వగరాని విద్యగలదె ముద్దార నేర్పించినన్‌’.. అన్న చిలకమర్తి పదాలను సత్యమని అతివలు మరోసారి నిరూపించారు. నన్నయవాఙ్ఞ్మయ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఆదిత్య డిగ్రీ కళాశాలలో అతివల అష్టావధానం రసవత్తరంగా జరిగింది. పాతిక వసంతాలు పైబడిన శతావధాని ఫుల్లాభట్ల నాగశాంతిస్వరూప అందరినీ దీటుగా ఎదుర్కొని అక్షరక్రీడలో, సాహితీసమరాంగణంలో విజేతగా నిలిచారు.  అడుగడుగునా నిషిద్ధాక్షరి నిషేధాలను దాటుకుంటూ, సమస్యల చిక్కుముడులు విప్పుతూ, వ్యస్తాక్షరి నియమాలను పాటిస్తూ, ఛందోనియమాలను తప్పకుండా నాగశాంతిస్వరూప చేసిన అష్టావధానం రసజ్ఞులను అలరించింది. విశ్రాంత ఆంధ్రయువతీసంస్కృత కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏవీఎస్‌ మహాలక్ష్మి అవధానానికి సంచాలకత్వం వహించారు. సమన్వయ శక్తి, ధారణ, సమయస్ఫూర్తి, భాషాపటిమ..అన్నీ కలిస్తేనే అవధానమని ఆమె పేర్కొన్నారు. అవధాని అని మగవారినీ, అవధానిని అని మహిళలను పేర్కొనవలసిన అవసరం లేదని, స్త్రీ,పురుషులిద్దరినీ అవధానిగా పేర్కొనడంలో వ్యాకరణరీత్యా అనౌచిత్యం లేదని ఆమె పేర్కొన్నారు.
అవధాన కళాకాంతి నాగశాంతి
ఫుల్లాభట్ల నాగశాంతిస్వరూప అవధానాన్ని ప్రారంభిస్తూ, తల్లి తండ్రులను, గరువులను స్మరిస్తూ పద్యాలను చెప్పారు. పృచ్ఛకులు సంధించిన అక్షరశస్త్రాలను సమర్థంగా ఎదుర్కొన్నారు.
*‘తన సూనున్‌కొని తెచ్చి కూర్పుమనియెన్‌ తన్వంగి కామార్తౖయె..’ఇదీ శాంతిస్వరూపకు పృచ్ఛకురాలు ఇచ్చిన సమస్య..కామార్త అయిన తన్వంగి తన సూనుని(కుమారుడిని) తీసుకురమ్మందిట.. ఈ సమస్యను అవధాని ఇలా పూరించారు..‘
వినయంబే తన రూపమై తనరుచున్‌ విన్నాణిౖయె వెల్గుచున్‌
తన నాథున్‌గని జాలినొంది మదిలో దాంపత్యధర్మంబునన్‌
అనయంబున్‌ తన పోషణార్ధమునకై అర్ధించె నా తల్లి ‘వే
తన సూనున్‌’ కొనితెచ్చి కూర్పుమనియెన్‌ తన్వంగి కామార్తౖయె..
కామము అనే పదానికి మనం సాధారణంగా ఉపయోగించే భావంలో కాకుండా కోరిక అన్న అర్థం ఉందని అవధాని వివరించారు. సూనున్‌ అన్న పదాన్ని ‘వేతన సూనున్‌’ అని అభివర్ణించారు.
 
*పెళ్లి, ప్రేమ, పబ్బు, క్లబ్బు పదాలతో దత్తపది
పై పదాలతో పద్యం చెప్పమని పృచ్ఛకురాలు కోరినప్పుడు, అవధాని ఇలా పూరించారు..
‘పెళ్లి’ ఒక్కటే స్త్రీలకు వేడుకటర?
‘ప్రేమౖ’మెకాన పడెనిట్టు భామలెల్ల
భళిర! ముందు చూ‘పబ్బు’రపరిచె నేడు
వెలది! వి‘క్లబ’త్వంబది వీడవలయు.. 
అలరించిన ఘంటావధానం
విశ్రాంత ఆచార్యుడు, ప్రవచన రాజహంస ప్రవేశపెట్టిన ఘంటావధాన ప్రక్రియను ఎం.వెంకటలక్ష్మి నిర్వహించారు. సభకు హాజరైన సాహితీప్రియులు కాగితంపై రాసిచ్చిన పదాలకు అనుగుణంగా వెంకట లక్ష్మి కంచంపై గరిటెతో ఘంట వాయిస్తారు. అవధాని ఆ ఘంటానాదం విని, కాగితంపై రాసిందేమిటో వివరించడంతో సభలో కరతాళధ్వనులు మోగాయి.
ద్విశతావధాని ఆకెళ్ల బాలభాను నిషిద్ధాక్షరి, ఆదిత్య తెలుగు ఉపన్యాసకురాలు బీవీ రమాదేవి సమస్య, విశ్రాంత కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అద్దేపల్లి సుగుణ దత్తపది, తెలుగు పండితురాలు డాక్టర్‌ సీఎస్‌వీ రమణీకుమారి వర్ణన, కవయిత్రి, గాయని డి.విజయలక్ష్మి వ్యస్తాక్షరి, ప్రభుత్వ అటానమస్‌ కళాశాల తెలుగు ఉపన్యాసకురాలు డాక్టర్‌ ఎం.సుధామయి ఆÔవవు, సదనం విద్యార్థిని ఎం.వెంకటలక్ష్మి ఘంటావధానం, రామచంద్రుని మౌనిక అప్రస్తుత ప్రసంగాలను నిర్వహించారు. డాక్టర్‌ మేజర్‌ చల్లా సత్యవాణి అధ్యక్షత వహించారు. ఆదిత్య విద్యాసంస్ధల డైరెక్టర్‌ ఎస్పీ గంగిరెడ్డి  అవధానంలో పాల్గొన్న అతివలను సత్కరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement