అలరించిన అష్టావధానం | sandeep ashtavadhanam rajamahendravaram | Sakshi
Sakshi News home page

అలరించిన అష్టావధానం

Published Thu, Jun 29 2017 11:19 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM

అలరించిన అష్టావధానం

అలరించిన అష్టావధానం

అవధాన కదనంలో అజేయుడు తాతా సందీప్‌
రాజమహేంద్రవరం కల్చరల్‌ : అడుగడుగునా నిషిద్ధాక్షరితో అడ్డుతగిలేవారు కొందరు, వ్యస్తాక్షరితో వెంటాడే వారు మరి కొందరు, సమస్యల చిక్కుముడులు వేసేది ఇంకొందరు.. అప్రస్తుత ప్రసంగాలతో దృష్టిని మరల్చేవారు మిగిలిన చతురులు..అందరినీ అలవోకగా పద్యాల అస్త్రశస్త్రాలతో ఎదుర్కొన్న నూనూగు మీసాల యువకుడు అవధాన అష్టాపద తాతా సందీపశర్మ. అవధాన కదనంలో, పద్యాల పద్మవ్యూహంలో అభిమన్యుడిగా కాక అజేయుడిగా నిలిచిన తాతా సందీపశర్మ సారస్వతాభిమానుల హృదయాలను ఈ అక్షరక్రీడలో గెలుచుకున్నాడు. ఛందస్సు ‘సర్ప పరిష్వంగం’ కాదని, సుమపారిజాతాల పరిష్వంగమేనని సందీప్‌ చెప్పకనే చెప్పాడు. ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో గురువారం కళాశాలలో జరిగిన అవధాన ప్రక్రియలో అతిరథ మహారథులు పృచ్ఛకులుగా పాల్గొన్నారు.
ధార, ధారణ అవధానానికి ప్రాణం
అవధాన సంచాలకుడిగా వ్యవహరించిన ప్రజ్ఞారాజహంస చింతలపాటి శర్మ ముందుగా మాట్లాడుతూ మొక్కవోని కవితాధార, సునిశితమైన ధారణా శక్తి అవధానానికి ప్రాణమన్నారు. 23 వసంతాల ప్రాయంలో 23 అవధానాలు పూర్తి చేసుకుని 24వ అవధానానికి ముందుకు వచ్చిన తాతాసందీపశర్మ సహస్రావధానిగా ఎదగాలని నేటి తరానికిస్ఫూర్తి కావాలని ఆశీస్సులు అందజేశారు.
దత్తపది ఇలా...
‘తల’, ‘వల’, ‘ఇల’, ‘కల’ పదాలతో ఆంజనేయస్వామిని వర్ణించమని పృచ్ఛకుడు కోరినదే తడువుగా, తాతా సందీప్‌ ఇలా పూరించారు..
‘ఇల’లో చిం‘తల’ దీర్పగ–పలువురుకున్‌ తా‘వల’ మగు–పవనతనయుడే అలనాడు కోతిమూ‘కల’–కెలమిన్‌ దాటంగ జలధిని యిచ్చెను దారిన్‌’
ఒక శీలవతిని విప్రుడు గని ఛీఛీ అనియెన్‌–
పై సమస్యను తాతా సందీపశర్మ ఇలా పూరించారు..
లీలగ నా ప్రవరాఖ్యు–డాలేపనమూని చేరె నద్రిని–తనపై వాలిన వరూధినిని, ఒక –శీలవతిన్‌ విప్రుడు గని ఛీఛీ అనియెన్‌’
పృచ్ఛకులుగా అతిరథ, మహారథులు..
ఈ కార్యక్రమానికి ఆంధ్రకేసరి విద్యాసంస్థల వ్యవస్థాపకుడు వైఎస్‌ నరసింహారావు అ«ధ్యక్షత వహించారు. పద్యకవితిలక డాక్టర్‌ యస్వీ రాఘవేంద్రరావు నిషిద్ధాక్షరి, పద్యనాటక రచయిత వి.వి సుబ్రహ్మణ్యం సమస్య, శతకకర్త డీవీ హనుమంతరావు దత్తపది, విశ్రాంత ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అద్దేపల్లి సుగుణ వర్ణన, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు పి.నరసింహారావు వ్యస్తాక్షరి, చిలకమర్తి ఫౌండేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ల రఘునాథ్‌ ఆశువు, భాషాప్రవీణ ఎం.వెంకట లక్ష్మి ఘంటావధానం, రామచంద్రుని మౌనిక అప్రస్తుత ప్రసంగాలను సమర్థంగా నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్‌ షేక్‌ అసదుల్లా అహ్మద్‌, చైర్‌పర్సన్‌ పి.సుభద్ర, ప్రిన్సిపాల్‌ సీహెచ్‌ జోగినాయుడు, కళాగౌతమి వ్యవస్థాపకుడు డాక్టర్‌ బీవీఎస్‌ మూర్తి పాల్గొన్నారు.
నవ్వులు పూయించిన అప్రస్తుత ప్రసంగం..
‘రామాయణంలో పిడకల వేట అంటారు కదా! మరి భారతంలో?– ఇదీ ప్రశ్న.
‘గారెల వేట–ఇదీ అవధాని సమాధానం
‘అవధానిగారూ : ఇంటికి దీపం ఇల్లాలే అంటారు కదా:  మీపేరులోనే సం‘దీప’శర్మ అని ఉండటంతో మీకు ఇల్లాలి అవసరం లేదేమో? ఇదీ ప్రశ్న.
మా ఇంట్లో రెండు దీపాలు కావాలి–ఇదీ అవధాని సమాధానం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement