
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం కెనడాలో ఘనంగా జరిగింది. తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్,తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో ఈ వేడుక జరిగింది. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ.. ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది.
గత రెండునెలలుగా బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ అమెరికా, కెనడా దేశాలలో చేస్తున్న ఆధ్యాత్మిక, సాహితీ పర్యటనలో భాగంగా అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ప్రవచానాలు, ఒక అష్టావధానము, ఒక శతావధానము కూడా నిర్వహించి ఇప్పుడు కెనడాలో మరొక అష్టావధానం చేశారు. అత్యంత వైభవంగా నిర్వహించబడిన ఈ సాహితీసదస్సు తెలుగు భాషాప్రియులకు కన్నులపండుగ అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
చాలా సంవత్సరాల తర్వాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకురాలు శ్రీమతి లక్ష్మి రాయవరపు మాట్లాడుతూ " ఏ దేశమేగినా ఎందు కాలిడినా చక్కటి తెలుగు మా ప్రాణ ప్రదం, తల్లి భూమి భారతిని గౌరవించడమే జాతికి నిండుతనం అన్న భావంతో తెలుగు తల్లి కెనడా నెలకొల్పబడింది. తెలుగుతల్లి పత్రిక కెనడాలో ఉన్న తెలుగు ప్రతిభనంతా ఒక చోటికి చేర్చే వేదిక" అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment