తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం | UGADI 2025 Special International Kavi Sammelanam | Sakshi
Sakshi News home page

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం

Apr 2 2025 7:21 AM | Updated on Apr 2 2025 7:21 AM

UGADI 2025 Special International Kavi Sammelanam

డాలస్, టెక్సస్, అమెరికా:  తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదిన సందర్భంగా - “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అనే అంశంపై జరిపిన 78 వ అంతర్జాల అంతర్జాతీయ ఉగాది కవిసమ్మేళనం 30 మందికి పైగా పాల్గొన్న కవుల స్వీయ కవితా పఠనంతో ఎంతో ఉత్సాహభరితంగా జరిగింది.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ‘పద్మశ్రీ పురస్కార గ్రహీత’ యడ్లపల్లి వెంకటేశ్వరరావు బ్రిటష్ కాలంనాటి ఆధునిక సేంద్రీయపద్దతుల వరకు వ్యవసాయపద్దతులలో వచ్చిన మార్పులను సోదాహరణంగా వివరించారు. రైతులకు వ్యవసాయసంబంధ విజ్ఞానాన్ని అందించేందుకు ‘రైతునేస్తం’ మాస పత్రిక, పశుఆరోగ్యం, సంరక్షణ కోసం ‘పశునేస్తం’ మాసపత్రిక, సేంద్రీయ పద్ధతులకోసం ‘ప్రకృతి నేస్తం’ మాసపత్రికలను, ‘రైతునేస్తం యూట్యూబ్’ చానెల్ ద్వారా సమగ్ర సమాచారం అందిస్తూ నిరంతరం రైతుసేవలో నిమగ్నమై ఉన్నామని తెలియజేశారు.

 రైతుకు ప్రాధ్యాన్యం ఇస్తూ తానా ప్రపంచసాహిత్యవేదిక ఇంత పెద్ద ఎత్తున కవిసమ్మేళనం నిర్వహించడం ముదాహవమని, ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులందరూ వ్రాసిన కవితలను పుస్తకరూపంలో తీసుకురావడం ఆనందంగా ఉందంటూ అందరి హర్షధ్వానాలమధ్య ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న ముఖ్యఅతిథి, కవి సమ్మేళనంలో పాల్గొన్న కవు లందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, రైతు కుటుంబ నేపధ్యంనుండి వచ్చిన తనకు వ్యవసాయంలోఉన్న అన్ని కష్టాలు తెలుసునని, ప్రభుత్వాలు రైతులకు అన్ని విధాలా సహాయపడాలని, ‘రైతు క్షేమమే సమాజ క్షేమం’ అన్నారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ - వివిధ రకాల పంటల ఉత్పత్తులలో, ఎగుమతులలో భారతదేశం ముందువరుసలోఉన్నా రైతు మాత్రం తరతరాలగా వెనుకబడిపోతూనే ఉన్నాడన్నారు. మహాకవి పోతన, కవిసార్వభౌమ శ్రీనాధుడులాంటి ప్రాచీన కవులు స్వయంగా వ్యసాయం చేసిన కవి కర్షకులని, గుర్రం జాషువా, ఇనగంటి పున్నయ్య చౌదరి, దువ్వూరి రామిరెడ్డి, తుమ్మల సీతారామమూర్తి లాంటి ఆధునిక కవులు రైతులపై వ్రాసిన కవితలను చదివి వారికి ఘన నివాళులర్పించారు. అలాగే రైతు నేపధ్యంలో వచ్చిన ‘పేద రైతు’, ‘కత్తిపట్టిన రైతు’, ‘రైతు కుటుంబం’, ‘రైతు బిడ్డ’, ‘పాడి పంటలు’, ‘రోజులు మారాయి’, ‘తోడి కోడళ్ళు’ లాంటి సినిమాలు, వాటిల్లోని పాటలు, అవి ఆనాటి సమాజంపై చూపిన ప్రభావం ఎంతైనా ఉందని, ఈ రోజుల్లో అలాంటి సినిమాలు కరువయ్యాయి అన్నారు. 

మన విద్యావిధానంలో సమూలమైన మార్పులు రావాలని, పసిప్రాయంనుండే పిల్లలకు అవగాహన కల్పించడానికి రైతు జీవన విధానాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, చట్టాలుచేసే నాయకులు కనీసం నెలకు నాల్గురోజులు విధిగా రైతులను పంటపొలాల్లో కలసి వారి కష్టనష్టాలు తెలుసుకుంటే, పరిస్థితులు చాలావరకు చక్కబడతాయని అభిప్రాయపడ్డారు.ఈ కవి సమ్మేళనంలో వివిధ ప్రాంతాలనుండి పాల్గొన్న 30 మందికి పైగా కవులు రైతు జీవితాన్ని బహు కోణాలలో కవితల రూపంలో అద్భుతంగా ఆవిష్కరించారు.

పాల్గొన్న కవులు:            
దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, ప్రకాశం జిల్లా; మంత్రి కృష్ణమోహన్, మార్కాపురం; పాయల మురళీకృష్ణ, విజయనగరం జిల్లా; నన్నపనేని రవి, ప్రకాశం జిల్లా; డా. తలారి డాకన్న, వికారాబాద్ జిల్లా; చొక్కర తాతారావు, విశాఖపట్నం; రామ్ డొక్కా, ఆస్టిన్, అమెరికా; దొండపాటి నాగజ్యోతి శేఖర్, కోనసీమ జిల్లా; ర్యాలి ప్రసాద్, కాకినాడ; సాలిపల్లి మంగామణి (శ్రీమణి), విశాఖపట్నం; సిరికి స్వామినాయుడు, మన్యం జిల్లా; తన్నీరు శశికళ, నెల్లూరు; చేబ్రోలు శశిబాల, హైదరాబాద్; లలిత రామ్, ఆరెగాన్, అమెరికా; బాలసుధాకర్ మౌళి, విజయనగరం; గంటేడ గౌరునాయుడు, విజయనగరం జిల్లా; కోసూరి రవికుమార్, పల్నాడు జిల్లా; మార్ని జానకిరామ చౌదరి, కాకినాడ; కె.ఎ. మునిసురేష్ పిళ్లె, శ్రీకాళహస్తి; డా. బీరం సుందరరావు, చీరాల; డా. వేంకట నక్త రాజు, డాలస్, అమెరికా; బండ్ల మాధవరావు, విజయవాడ; డా. కొండపల్లి నీహారిణి, హైదరాబాద్; నారదభట్ల అరుణ, హైదరాబాద్; పి. అమరజ్యోతి, అనకాపల్లి; యార్లగడ్డ రాఘవేంద్రరావు, హైదరాబాద్; చిటిప్రోలు సుబ్బారావు, హైదరాబాద్; డా. శ్రీరమ్య రావు, న్యూజెర్సీ, అమెరికా, డా. శ్రీదేవి శ్రీకాంత్, బోట్స్వానా, దక్షిణాఫ్రికా; డా. భాస్కర్ కొంపెల్ల, పెన్సిల్వేనియా, అమెరికా; ఆది మోపిదేవి, కాలిఫోర్నియా, అమెరికా; డా. కె. గీత, కాలిఫోర్నియా, అమెరికా; శ్రీ శ్రీధర్ రెడ్డి బిల్లా, కాలిఫోర్నియా, అమెరికా నుండి పాల్గొన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు శ్రమైక జీవన విధానం, తీరు తెన్నులపై తరచూ చర్చ జరపవలసిన అవసరం ఎంతైనా ఉందని, మన అందరికీ ఆహరం పంచే రైతన్న జీవితం విషాదగాధగా మిగలడం ఎవ్వరికీ శ్రేయస్కరంగాదన్నారు. 



పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వార వీక్షించవచ్చును.

https://youtube.com/live/qVbhijoUiX8
అలాగే రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో తానా ప్రపంచసాహిత్యవేదిక వెలువరించిన రైతు కవితల పుస్తకాన్ని కూడా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement