Kavi sammelanam
-
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
"వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం” , “శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్” సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాల వేదికపై “ఉగాది కవి సమ్మేళనము” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. "శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని, కేవలం విదేశాలలో నివసిస్తున్న తెలుగు కవుల కొరకు ప్రత్యేకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 11 దేశాల నుండి సుమారు 40 మంది కవులు కవయిత్రులు పాల్గొనడం చాలా సంతోషదాయకమని, త్వరలో ఈ ఈ కవితలు అన్నిటినీ ఒక సంపుటిగా ప్రచురిస్తామని" నిర్వాహకులు, వంశీ వ్యవస్థాపకులు డా. వంశీ రామరాజు . 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సింగపూర్ వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూర్వ రాజ్యసభ సభ్యులు, సాహితీవేత్త పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ దేశాల కవులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమం ఆసాంతం వీక్షించి, ఆంగ్ల వ్యామోహంలో తెలుగును దూరం చేసుకోకూడదని, యువతరం కవులను రచయితలను ప్రోత్సహించే మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని సందేశాన్నిచ్చారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ సినీ గేయకవి, రచయిత భువనచంద్ర గీతం అందరినీఆహ్లాదపరిచింది. ఆత్మీయ అతిథిగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు డా. వంగూరి చిట్టెన్ రాజు పాల్గొని సభను, నిర్వాహకులను అభినందించారు. రాధిక మంగిపూడి సభా నిర్వహణలో, కవులందరూ “నా బాల్యంలో ఉగాది” అనే శీర్షికతో తమ చిన్ననాటి ఉగాది పండుగ జ్ఞాపకాలను, తాము పెరిగిన సొంత ఊరి పరిస్థితులను తలచుకుంటూ, వర్ణిస్తూ కవితలను వినిపించడం అందరినీ మరింత విశేషంగా ఆకట్టుకుంది. అందరూ ఒకే శీర్షికతో రాసిన కవితలైనా, వివిధ ప్రాంతాలలో ఉగాది వేడుకల తీరుతెన్నులు, వివిధ మనోభావాల ద్వారా ప్రకటించబడుతూ, దేనికి అదే ప్రత్యేకంగా నిలిచాయి. అమెరికా, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, మలేసియా, ఇండోనేసియా, ఖతార్, ఒమాన్, యూఏఈ, పోలాండ్, యూకే దేశాల నుండి 40మంది ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. వంశీ అధ్యక్షరాలు డా తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ సుంకరకపల్లి శైలజ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం, కల్చరల్ టీవీ & శ్రీ సాంస్కృతిక కళాసారథి యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. -
మరపురాని కవిసమ్మేళనం.. అయిదారు సార్లు ‘వహ్వా వహ్వాలు’
జనవరి 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సర్వభాషా కవిసమ్మేళనానికి హాజరు కావటం జీవితంలో మరచిపోలేని జ్ఞాపకం. ఏటా ఆలిండియా రేడియో – భారత ప్రభుత్వం గుర్తింపు పొందిన 22 భాషల నుంచి 23 మందిని (ఒక్క హిందీ భాష నుంచి మాత్రం ఇద్దరు) సెలెక్ట్ చేసి, ఏదో ఒక నగరంలో ఈ సమ్మేళనం ఏర్పాటు చేస్తుంది. ఈ సంవత్సరం ఢిల్లీలో నిర్వహించిన సర్వభాషా కవిసమ్మేళనానికి తెలుగు భాష నుంచి నా కవిత ‘అమృతోపనిషత్’ ఎన్నికైంది. మొదటిరోజు (9వ తేదీ) ఢిల్లీ ఆకాశవాణి సమావేశ మందిరంలో రిహార్సల్స్ చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రసారభారతి ఉన్నతాధికారులు హాజరై ప్రతి కవినీ జ్ఞాపిక, శాలువాలతో సగౌరవంగా సత్కరించారు. రెండోరోజు (10వ తేదీ) తొలుత మూలభాషలో కవిత చదివించి, వెంటనే హిందీ అనువాదం వినిపించారు. ప్రతి కవినీ ఆహ్వానించే ముందు ఆ కవి గురించి హిందీలో పరిచయం చేశారు. నేను సాహిత్యంలో చేసిన కృషి, ప్రచురించిన పుస్తకాలు, చేస్తున్న ఉద్యోగంతో పాటు... మా నాన్న స్మృత్యర్థం స్థాపించిన ‘మువ్వా చినబాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్’ తరఫున నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల గురించి కూడా యాంకర్ స్వచ్ఛమైన హిందీలో చెప్పి నప్పుడు నా భావోద్వేగం తారస్థాయికి చేరుకుంది. ఆ పెద్ద హాలులో తెలుగు తెలిసిన ఒక్కరూ లేకపోయినా, నా మట్టుకు నేను సీరియస్‌గా కవితను (ఆలిండియా రేడియో రికార్డింగ్ కోసం) చదివాను. ఆ తర్వాత డాక్టర్ పుష్పాసింగ్ నా కవితకు హిందీ అనువాదం చదివినప్పుడు, మంచి స్పందన వచ్చింది. అయిదారు సార్లు ‘వహ్వా వహ్వాలు’ సభలో సందడి చేశాయి. ఆమె మంచి ఫ్రెండ్ అయ్యారు. ఈ అరుదైన సందర్భంలో అన్ని రాష్ట్రాల కవులతో పాటు ప్రత్యేకించి గోవా, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులను కలవటం ప్రత్యేక అనుభూతి. వారి అనుభవాల్ని గ్రహించటం సాహిత్యంలో సరికొత్త పాఠాలు నేర్చుకోవటమే. పంజాబీ కవి గురుతేజ్తో ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం దొరికింది. ఇండో–పాక్ బోర్డర్లో ఓ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సింగ్ అనేక విషయాలు నాతో పంచుకున్నారు. కశ్మీరీ కవి డాక్టర్ గులామ్ నబీ హలీమ్ చలాకీగా తిరుగుతూ అందరినీ అల్లుకుపోయాడు. ఈ ఇద్దరూ నా ఇతర కవితల ఆంగ్లానువాదాలు తమకు పంపమని, వాటిని తమ భాషల్లోకి తర్జుమా చేస్తామని అడిగారు. నేను వేదిక దిగగానే ఢిల్లీకి చెందిన మరో ముగ్గురు మహిళలు కూడా ఇదే అభ్యర్థన చేశారు. ఇవి నాకు సరికొత్త ద్వారాలు. నా రూమ్మేట్ అయిన మరాఠీ కవి అనిల్ సబాలే, పక్క గదిలో దిగిన సంథాలీ కవి గౌరు ముర్ము, పోలీస్ డిపార్ట్మెంటులో పనిచేసే మణిపురి కవి క్షేత్రి రాజన్ తదితరులతో ఎక్కువగా చర్చించే అవకాశం దొరికింది. నా సాహిత్యపు డైరీలో కొత్త మిత్రులు చేరారు. నా కవిత 21 భాషల్లోకి తర్జుమా అవుతుందన్న సంతోషం మరింత కిక్కిచ్చే అంశం. ఈ సర్వ భాషా కవిసమ్మేళనం జనవరి 25వ తేదీ రాత్రి 10 గంటలకు అన్ని రేడియో స్టేషన్ల నుంచి ప్రసారమవుతుంది. (క్లిక్ చేయండి: ప్రెస్ – పిక్చర్ – ప్లాట్‌ఫాం!) – ఎమ్వీ రామిరెడ్డి, రచయిత -
ఉగాదికి ‘తానా మహాకవి సమ్మేళనం - 21
వాషింగ్టన్: ఉగాది సందర్భంగా తెలుగు సాహిత్య చరిత్రలోనే అపూర్వమైన రీతిలో ‘తానా’ ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయిలో ‘తెలుగు మహాకవి సమ్మేళనం 21’ అనే కార్యక్రమాన్ని అంతర్జాలంలో నిర్వహిస్తున్నట్లు తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలిపారు. సాహిత్య వేదిక సమన్వయకర్త, శతశతక కవి, చిగురుమళ్లు శ్రీనివాస్, తానా మహిళా విభాగపు సమన్వయకర్త శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగుతుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ వెల్లడించారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. 21 దేశాలలోని 21 తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక కవి సమ్మేళనం కవితాగానంతో, విశిష్ట అతిధుల సందేశాలతో కొనసాగుతందుని తెలిపారు. ఈ అంతర్జాల దృశ్య సాహిత్య సమావేశం నిర్విరామంగా 21 గంటల పాటు సాగుతుందని తెలియజేశారు. తెలుగు భాషా, సాహిత్యాలను ప్రోత్సహించటం, ప్రపంచంలోని తెలుగు కవులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి ఒకే గొంతుగా తెలుగు భాషా వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ పేర్కొన్నారు. -
కవి సమ్మేళనానికై కవితల ఆహ్వానం
కడప కల్చరల్ : అక్టోబరులో జరగనున్న గండికోట వారసత్వ ఉత్సవాలలో నిర్వహించనున్న కవి సమ్మేళనం కోసం జిల్లాకు చెందిన కవులు, రచయితల నుంచి కవితలను ఆహ్వానిస్తున్నామని సాంస్కృతిక కమిటీ సభ్యులు, ఇంటాక్ జిల్లా కన్వీనర్ ఎస్.ఎలియాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాలలో భాగంగా ప్రధాన వేదికపై ఏర్పాటు చేయనున్న కవి సమ్మేళనానికి రెండు లేదా మూడు నిమిషాలకు మించని కవితలను పంపాలని కోరారు. వచ్చిన వాటిలో ప్రత్యేక జ్యూరీ సభ్యులు ఎంపిక చేసిన కవితలను మాత్రమే ఉత్సవాలలో చదివేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు. గండికోట వైభవం తెలిపేలా కవితలు పంపాలని, వివరాలకు 98858 01061 నంబరులో సంప్రదించాలని సూచించారు. -
కవులే భవిష్యత్తు నిర్దేశకులు
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి కొత్తపేట : భవిష్యత్తుకు దశ, దిశ నిర్దేశకులు కవులేనని, కవి లేకపోతే చరిత్రే లేదని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ అన్నారు. ప్రముఖ కవి, రచయిత∙అద్దంకి కేశవరావు 98వ జయంత్యుత్సవాల్లో భాగంగా ప్రియదర్శినీ బాలవిహార్ ప్రాంగణంలో గురువారం జరిగిన కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేశవరావు వంటి కవులు తెలుగు జాతిరత్నాలని అన్నారు. నేటి సినిమా పాటలు ఒంటిని కదిలిస్తూండగా.. నాటి పాటలు హృదయాన్ని కదిలిస్తాయని అన్నారు. జాతికి భాషే ప్రామాణికమని, సాహిత్యంతో భాష ముడిపడి ఉందని అన్నారు. అమ్మలాంటి తెలుగు భాషను కాపాడుకోవాలని కవులను కోరారు. కేశవరావు కుమారుడు, బాలవిహార్ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ ఆధ్వర్యాన ప్రముఖ కవి, కళాసాహితి ప్రధాన కార్యదర్శి జి.సుబ్బారావు పర్యవేక్షణలో జరిగిన ఈ సభకు కళాసాహితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహర దేవళరాజు అధ్యక్షత వహించారు. ఆకట్టుకున్న కవి సమ్మేళనం జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన కవులతో నిర్వహించిన కవి సమ్మేళనం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు 50 మంది కవులు మానవతావాదంపైన, నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ పోకడలపైన వినిపించిన కవితలు ఆలోచింపజేశాయి. కవులకు పొట్లూరి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రెంటాల శ్రీవెంకటేశ్వరరావు తాలూకా పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఏవీ సుబ్బారావు, ప్రముఖ బుర్రకథ కళాకారుడు నిట్టల హనుమంతరావు, ప్రముఖ మెజీషియన్ చింతా శ్యామ్‌కుమార్, కళాసమితి అధ్యక్షుడు నల్లా సత్యనారాయణమూర్తి, తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తిమండ ప్రతాప్, నన్నయ విశ్వవిద్యాలయం ఆచార్యులు టి.సత్యనారాయణ, కవులు దేవవరపు నీలకంఠేశ్వరరావు, భగ్వాన్, ధర్మోజీరావు, మధునాపంతుల, వీవీవీ సుబ్బారావు, షేక్ గౌస్, పద్మజావాణి, సోమయాజులు, పిట్టా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
రేపు ‘హరితహారం’పై కవి సమ్మేళనం
మహబూబ్‌నగర్ కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం పథకంపై జిల్లా స్థాయిలో ఆగస్టు 2న కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు పాలమూరు సాహితీ అధ్యక్షుడు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్,సర్వే సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.విజయకుమార్, ప్రభుత్వ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే కవిసమ్మేళన ంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డైట్ కళాశాలల విద్యార్థులు పాల్గొనాలని కోరారు. వివరాలకు నెం.9032844017 ను సంప్రదించాలన్నారు.