కవులే భవిష్యత్తు నిర్దేశకులు
-
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి
కొత్తపేట :
భవిష్యత్తుకు దశ, దిశ నిర్దేశకులు కవులేనని, కవి లేకపోతే చరిత్రే లేదని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ అన్నారు. ప్రముఖ కవి, రచయిత∙అద్దంకి కేశవరావు 98వ జయంత్యుత్సవాల్లో భాగంగా ప్రియదర్శినీ బాలవిహార్ ప్రాంగణంలో గురువారం జరిగిన కవి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేశవరావు వంటి కవులు తెలుగు జాతిరత్నాలని అన్నారు. నేటి సినిమా పాటలు ఒంటిని కదిలిస్తూండగా.. నాటి పాటలు హృదయాన్ని కదిలిస్తాయని అన్నారు. జాతికి భాషే ప్రామాణికమని, సాహిత్యంతో భాష ముడిపడి ఉందని అన్నారు. అమ్మలాంటి తెలుగు భాషను కాపాడుకోవాలని కవులను కోరారు. కేశవరావు కుమారుడు, బాలవిహార్ కరస్పాండెంట్ అద్దంకి బుద్ధచంద్రదేవ్ ఆధ్వర్యాన ప్రముఖ కవి, కళాసాహితి ప్రధాన కార్యదర్శి జి.సుబ్బారావు పర్యవేక్షణలో జరిగిన ఈ సభకు కళాసాహితి అధ్యక్షుడు పెన్మెత్స హరిహర దేవళరాజు అధ్యక్షత వహించారు.
ఆకట్టుకున్న కవి సమ్మేళనం
జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన కవులతో నిర్వహించిన కవి సమ్మేళనం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. దాదాపు 50 మంది కవులు మానవతావాదంపైన, నేటి ప్రజాస్వామ్య వ్యవస్థ పోకడలపైన వినిపించిన కవితలు ఆలోచింపజేశాయి. కవులకు పొట్లూరి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేశారు.
కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రెంటాల శ్రీవెంకటేశ్వరరావు తాలూకా పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఏవీ సుబ్బారావు, ప్రముఖ బుర్రకథ కళాకారుడు నిట్టల హనుమంతరావు, ప్రముఖ మెజీషియన్ చింతా శ్యామ్‌కుమార్, కళాసమితి అధ్యక్షుడు నల్లా సత్యనారాయణమూర్తి, తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తిమండ ప్రతాప్, నన్నయ విశ్వవిద్యాలయం ఆచార్యులు టి.సత్యనారాయణ, కవులు దేవవరపు నీలకంఠేశ్వరరావు, భగ్వాన్, ధర్మోజీరావు, మధునాపంతుల, వీవీవీ సుబ్బారావు, షేక్ గౌస్, పద్మజావాణి, సోమయాజులు, పిట్టా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.