సాక్షి, హైదరాబాద్: ‘త్రిభాషా మహా సహ స్రావధాని’ వద్దిపర్తి పద్మాకర్ ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తోన్న అష్టావధానం ఆసక్తికరంగా సాగుతోంది. ‘సప్త ఖండ అవధాన సాహితీ ఝరి’ పేర జరుగుతున్న ఈ అవధాన యజ్ఞంలో ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న తెలుగు సాహితీమూర్తులు, భాషాప్రియులు భాగస్వాములవుతున్నారు. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరప్ ఖండాల అవధానాన్ని పూర్తిచేసిన వద్దిపర్తి, తాజాగా ఆసియా ఖండావధానం నిర్వహించారు. ఈ అవధాన ప్రక్రియ ఏ ఖం డంలో కార్యక్రమం జరుగుతుంటే ఆ ఖండా నికి చెందిన తెలుగు కవి పండితులు పృచ్ఛకులుగా వ్యవహరిస్తుండటం విశేషం.
ఆసియా ఖండ అవధానానికి ప్రముఖ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రముఖ రచయిత్రి జలంధర చంద్రమోహన్, కొప్పరపు కవుల మనుమడు మాశర్మ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ‘అమెరికా అవధాని’ పాలడుగు శ్రీచరణ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కవిపండితులు పృచ్ఛకులుగా పాల్గొన్నారు. చల్లా రామచంద్రమూర్తి (సమస్య, ఉత్తరప్రదేశ్), మాడభూషి సంపత్ కుమార్ (దత్తపది, తమిళనాడు), రాధిక మంగిపూడి (న్యస్తాక్షరి, మహారాష్ట్ర), రాళ్లపల్లి సుందరరావు (ఆశువు, పశ్చిమ బెంగాల్), లక్ష్మీ అయ్యర్ (పురాణ పఠనం, రాజస్తాన్) ఫణి రాజమౌళి (అప్రస్తుతం, కర్ణాటక), ముత్యంపేట గౌరీ శంకరశర్మ (నిషిద్ధాక్షరి, తెలంగాణ), నిష్ఠల సూర్యకాంతి (వర్ణన, ఆంధ్రప్రదేశ్)లు పృచ్ఛకులుగా వ్యవహరించారు.
ఈ అవధాన ప్రక్రియలో భాగంగా ఆఫ్గానిస్తాన్‌లో జరుగుతున్న అకృత్యాల మొదలు అనేక అంశాలపై ప్రాశ్నికులు సంధించారు. ‘రాముని పెండ్లియాడె నొక రక్కసి సీత సహాయమాయెగా’అనే సమస్య,‘ముక్కు–చెవి–కన్ను–నోరు’ పదాలతో ’దత్తపది’వంటి అంశాలను అవధాని వద్దిపర్తి పద్మాకర్ అలవోకగా ఎదుర్కొని పద్యరూపాత్మక సమాధానాలతో అబ్బురపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment