
వాషింగ్టన్ డీసీ : తన పదహారవఏటనే అవధానం ప్రారంభించిన నరాల రామారెడ్డి నాటా తెలుగు ఉత్సవాల్లో భాగంగా జులై 8వ తేది ఉదయం 9 గంటలకు అష్టవధానం చేయనున్నారు. నరాల రామారెడ్డి గత 52 ఏళ్లుగా దాదాపు వెయ్యి అవధానాలు చేశారు. అమెరికా తెలుగు సంఘాలైన ఆటా, నాటా, తానా ఆహ్వానాలను అందుకొని అమెరికాలో పలుమార్లు అవధానం చేసి మన్ననలందుకున్నారు. జూలై 6,7,8న ఫిలడెల్ఫియాలో జరుగుతున్న నాటా తెలుగు ఉత్సవాలలో నరాల రామారెడ్డి మరోసారి అష్టవధానం చేయనున్నారు. ఈ అవధాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎన్‌ఆర్‌ఐలు హాజరై విజయవంతం చేయాలని నాటా కన్వెన్షన్ 2018 లిటరరీ కమిటీ ఛైర్ జయదేవ్ మెట్టుపల్లి కోరారు.
అవధాన చరిత్ర : తెలుగు సాహిత్యనందనోద్యానంలో విలక్షణంగా వికసించిన పుష్పం అవధానం. ఇది పద్యకవితా సుమగంధాలను విరజిమ్ముతుంది. చమత్కారమకరందాలను చిందిస్తుంది. భారతీయ భాషల్లో కేవలం తెలుగు బాషలోనే రూపుదిద్దుకున్న ప్రక్రియ అవధానం ఇది తెలుగువారి సొంతం. సంస్కృత భాష లో వున్న "సమస్యాపూరణం" అనే అంశాన్ని ఆధారంగా చేసుకొని 1854 సంవత్సరంలో మహా పండితులు మాడభూషి వేంకటాచార్యులు “సమస్య” అనే అంశానికి "నిషిద్ధాక్షరి దత్తపది, వ్యస్తాక్షరి, మొదలైన అంశాలను జోడించి " "అష్టావధానం" అనే పక్రియను రూపకల్పన చేశారు.
అవధాన ప్రాశస్త్యం : మాడభూషి వారి మార్గ దర్శకత్వంలో జంటకవులైన తిరుపతి వేంకట కవులు తెలుగు ప్రాంతమంతట జైత్రయాత్ర సాగించి అవధాన పక్రియను జన బాహుళ్యంలోకి తెచ్చారు.
"అష్టావధాన కష్టాలంబనమన్న
నల్లేరుపై బండిన డక మాకు
శతావధాన విధాన సంవిదానంబన్న
షడ్రసోపేత భోజనము మాకు"
అని తిరుపతి కవులు అవధానరంగంలో సింహాల్లా విజృంభించారు.
అష్టావధానంలొ ఎనిమిది అంశాలుంటాయి. సమస్యాపూరణం , దత్తపది అనే అంశాలు అవధాని చమత్కార ప్రతిభను పరీక్షిస్తాయి. నిషిద్దాక్షరి, వ్యస్తాక్షరి పాండిత్య పరీక్ష చేస్తాయి. ఘంటాగణనం, పురాణపఠనం అవధాని ఏకాగ్రతను పరీక్షిస్తాయి. వర్ణన ఆశుకవిత అవధాని కవితా కౌశల్యాన్ని పరీక్షిస్తాయి. అవధానం చేసే వ్యక్తికి ధార (Flow), ధారణ ( preservation ), ధిషణ (talent), ధోరణి (presence of mind), ధైర్యం (courage) అనే పంచధకారాలు ఉండాలని విజ్ఞులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment