ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియాలో ఉత్తర అమెరికా తెలుగు సమితి(నాటా) ఆధ్వర్యంలో జూలై 6 నుంచి 8 వరకు శ్రీ శ్రీనివాస కళ్యాణం జరుపనున్నట్టు నాటా ప్రతినిధులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతులతో ఈ వేడుకను వైభవంగా నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయని.. హిందూ సంప్రదాయం ప్రకారం కన్నుల పండుగగా కళ్యాణం జరిపించడానికి టీటీడీ నుంచి వేద పండితులు జీఏవీ దీక్షితులు, కే పురుషోత్తం ఆచార్యులు ప్రత్యేకంగా వస్తున్నారని వెల్లడించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తిరుపతి లడ్డు ప్రసాదం ఇవ్వనున్నామన్నారు.
కళ్యాణ సమయంలో గాయని కొండవీటి జ్యోతిర్మయి అన్నమాచార్య కీర్తనల రూపంలో శ్రీనివాసుని కళ్యాణ ప్రశస్తిని భక్తులకు వివరిస్తారని.. చైతన్య సోదరుల గాత్రం, పారుపల్లి బాలసుబ్రహ్మణ్యం మృదంగం, సత్యనారాయణ శర్మ వయోలిన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ఫిలడెల్ఫియాలో జరిగే తెలుగు మహాసభల నిర్వహకులు ఎందరో కార్యకర్తలు అహార్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందజేసిన శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు సకుటుంబ సమేతంగా ఈ కళ్యాణంలో పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాల కోసం nata2018.org వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment