ఫిలడెల్ఫియా : జూలై 7, 8 తేదీల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన నాటా - 2018 కన్వెన్షన్‌లో భాగంగా సాహిత్య కార్యక్రమాలు దిగ్విజయంగా ముగిశాయి. ఆదివారం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకూ 'భాషా - సాహిత్యం - సమాజం' సెషన్ తిమ్మాపురం ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ సెషన్‌లో తెలుగులో శాస్త్రీయ సాహిత్యం, వైజ్ఞానిక సాహిత్యం ఆవశ్యకతను గురించి నరిసెట్టి ఇన్నయ్య ప్రసంగించారు. భారతీయ సాహిత్యంలో తెలుగు భాషా స్థానం గురించి హిందీ నుంచి తెలుగులోకి అనేక అనువాదాలు చేసిన ఢిల్లీకి చెందిన లక్ష్మిరెడ్డి సోదాహరణంగా మాట్లాడి సభికులను ఆలోచింప చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ తీరు తెన్నులు, అకాడమీ చేసిన మంచి పనులు, అకాడమీ నిర్వహణలో సాధక బాధకాల గురించి దుగ్గిరాల సుబ్బారావు వివరించారు. తమిళ నాట తెలుగు భాషా ఉద్యమం గురించి నంద్యాల నారాయణ రెడ్డి ఆవేశంతో, ఆవేదనతో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.
'తెలుగు సాహిత్యంలో భిన్న దృక్పథాలు' సెషన్‌లో వక్తల ప్రసంగాలతో పాటు, పుస్తాకావిష్కరణలు, స్వీయకవితా పఠనం జరిగాయి. రచయిత్రి కల్పనా రెంటాల అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో విక్రంసింహపూరి విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేసి రిటైరైన సీఆర్ విశ్వేశ్వర రావు ఇంగ్లీష్ లోవచ్చిన తెలుగు అనువాదాల గురించి ఆలోచనాత్మక ప్రసంగం చేశారు. పుట్టపర్తి వారి అభ్యుదయ వాదం గురించి వారి కుమార్తె, విదుషీమణి పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి వారి మహోన్నత వ్యక్తిత్వం పరిచయం చేశారు. ఇటీవల మరణించిన ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణికి రచయిత్రి కల్పనారెంటాల నివాళి ప్రసంగం చేశారు. యడ్లపల్లి భారతి 'ఎడారి బతుకులు' వడ్డేపల్లి కృష్ణ తెలుగు కవిత్వానికి ఇంగ్లీష్ అనువాదాల పుస్తకం, తదితర పుస్తకావిష్కరణలు జరిగాయి. నాటా సాహిత్య కమిటీ చైర్ మెట్టుపల్లి జయదేవ్, తిమ్మాపురం ప్రకాష్ ఆధ్వర్యం లో జరిగిన ఈ సెషన్స్ సాహిత్యాభిమానులను అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment