ఈ సీజన్ నుంచే ఇచ్చేందుకు కసరత్తు
కౌలు రైతులను ఎలా గుర్తించాలన్న దానిపై తర్జనభర్జన
త్వరలో రైతు సంఘాలతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: కౌలు రైతులకు కూడా రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ వానాకాలం నుంచే అమలు చేయాలని యోచిస్తోంది. రైతుభరోసాపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. ఎన్నికలకు ముందు రైతులతోపాటు కౌలు రైతులకు కూడా రైతుభరోసా సాయాన్ని అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందించనుంది.
అయితే కౌలు రైతులను గుర్తించడమే ప్రభుత్వానికి అసలు సవాల్‌గా మారింది. చాలామంది కూలీలు రైతుల వద్ద కొంత భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తుంటారు. కొందరు రైతులు కూడా తమ భూమితోపాటు ఇతర రైతుల వద్ద కౌలుకు తీసుకొని కూడా సాగు చేస్తుంటారు. ఇలా రెండు విధాలుగా కౌలు రైతులుంటారు. ఒకరు భూమి ఉన్నవారు, ఇంకొకరు భూమిలేని కౌలు రైతులు. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులుండగా కౌలు రైతులు సుమారు 25 లక్షల వరకు ఉంటారని అంచనా.
అయితే వీరిని గుర్తించేందుకు 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతుల చట్టం తెచ్చింది. దీనిప్రకారం కౌలు రైతులను గుర్తిస్తామని ఎన్నికలకు ముందు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు అనేక అధికారాలు సంక్రమిస్తాయి. అదేవిధంగా చట్టపరంగా కౌలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు రైతులు కౌలుపై అధికారికంగా ఒప్పందం చేసుకోవడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుందా అన్న సందేహం తలెత్తుతోంది. కౌలు రైతు కోసం అసలు రైతు పెట్టుబడి సాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉంటారా అనేది ప్రశ్న.
ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులను ఎలా గుర్తించాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏదిఏమైనా జూలై 15లోపు రైతుభరోసాపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉపసంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సబ్‌కమిటీ త్వరలో పలువురు రైతు సంఘాల నేతలతోనూ, మేధావులతోనూ సమావేశం కానుంది. రైతుభరోసా మార్గదర్శకాల్లో భాగంగానే కౌలు రైతులకు ఎలా ఇవ్వాలన్న దానిపై అభిప్రాయాలు స్వీకరిస్తారు.
కాగా, రైతు భరోసాకు నిబంధనలు కఠినంగా ఉంటాయన్న చర్చ జరుగుతోంది. పీఎం కిసాన్ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటారన్న వాదనలు కూడా ఉన్నాయి. వాస్తవంగా రైతుబంధుకు, రైతుభరోసాకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటుందని అధికారులు అంటున్నారు. అదీగాక రైతుబంధు మార్గదర్శకాలన్నీ పూర్తిస్థాయిలో మారుతాయని, దాని స్వరూపమే మారుతుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment