
‘రాజధాని’కి 33,000 ఎకరాలు..అటవీ భూమి కావాలి
కేంద్రానికి లేఖ రాయాలని మంత్రివర్గం నిర్ణయం
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలో అవసరాల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33,057.5 ఎకరాల (13,223 హెక్టార్లు) అటవీ భూమిని సీఆర్‌డీఏకి బదలాయించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రెండు జిల్లాల్లోని 27 అటవీ బ్లాకుల్లో ఉన్న ఈ భూములు ఇచ్చినందుకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు రూ.1,357 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 20 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మీడియాకు వివరించారు.
అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్, అభయగోల్డ్ వంటి సంస్థల బాధితులకు సత్వర న్యాయం కోసం విజయవాడలో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పా టు చేసేందుకు ఆమోదం. ఈ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టుకు లేఖ రాయా లి. అగ్రిగోల్డ్‌పై ఇప్పటికే 176 కేసులు నమోదైన నేపథ్యంలో ఇంకా ఎవరైనా ఫిర్యాదులు చేసేందుకు అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్ ఏర్పాటు చేసి దాన్నుంచే ఫిర్యాదులు స్వీకరించాలి. హైకోర్టు నియమించిన జస్టిస్ సీతాపతి కమిటీ ఆధ్వరంలో అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తుల వేలం ప్రక్రియను ప్రారంభించాలి. మొదటి దశలో ఈ నెల 20, 21 తేదీల్లో వేలం వేయాలి. కేసు విచారణను వేగవంతం చేయాలని సీఐడీకి ఆదేశాలు.
► భూముల డబుల్ రిజిస్ట్రేషన్లను నివారించేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22బీకి సవరణ. ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభల్లో ప్రవేశపెట్టాలి.
►ఈ నెల 8న ఉగాది పండుగను 13 జిల్లాల్లో వైభవంగా నిర్వహించాలి. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు.
► ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆరు లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం.
► ఉచిత ఇసుక పథకాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఒక మొబైల్ యాప్‌ను తీసుకురావాలి. ఇసుక అవసరమైన వారు ఈ యాప్ ద్వారా కోరినా లేదా టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసినా ఇసుక సరఫరా చేసేలా ఏర్పాటు. ఉపాధి హామీ కూలీల దినసరి వేతనాన్ని రూ.194కు పెంచాలి.
► కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానికి లేఖ రాయాలి.
► పదో షెడ్యూల్‌లో ఉన్న 142 సంస్థల్లో రాష్ట్ర వాటాగా రావాల్సిన వాటి కోసం తెలంగాణ సీఎస్‌కు, ఏపీ సీఎస్‌తో లేఖ రాయించాలి.
ప్రైవేటుకు భారీగా భూ కేటాయింపులు
నాలుగు జాతీయ విద్యా సంస్థలతోపాటు పలు ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వం భారీగా భూములు కేటాయించింది. శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో విద్యా సంస్థలకు 914 ఎకరాలు, నాలుగు పవన విద్యుదుత్పత్తి ప్రాజెక్టులకు 180 ఎకరాలు, హీరో మోటార్ కార్పొరేషన్‌కు 600 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జాతీయ విద్యాసంస్థలకు..
► వైఎస్సార్ జిల్లా కడప మండలం పుట్లంపల్లెలో మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ యూనివర్సిటీ కేంద్రం ఏర్పాటు నిమిత్తం ఉన్నత విద్యా శాఖకు 10.15 ఎకరాలు ఉచితంగా కేటాయించారు.
► అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం జంతలూరులో సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణం కోసం సాంకేతిక విద్యాశాఖకు 491.23 ఎకరాలను ఉచితంగా ఇచ్చారు.
► విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో ఐఐఎం నిర్మాణానికి 241.50 ఎకరాలను సాంకేతిక విద్యా శాఖకు ఉచితంగా ఇచ్చారు.
► పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడకట్ల, తాడేపల్లిగూడెం, కొండ్రుప్రోలులో 172.08 ఎకరాలను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నిర్మాణానికి గాను నిట్ డెరైక్టర్‌కు ఉచితంగా కేటాయించారు.