రక్తపాతంతో ‘డ్యామ్‌’ కట్టాలా ? | How Consent For Diband Dam in Arunachal Pradesh | Sakshi
Sakshi News home page

రక్తపాతంతో ‘డ్యామ్‌’ కట్టాలా ?

Published Fri, Jul 26 2019 3:28 PM | Last Updated on Fri, Jul 26 2019 7:22 PM

How Consent For Diband Dam in Arunachal Pradesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘వాళ్లు అరాచకులు, ఆటవికులు, అభివద్ధి నిరోధకులు, నెత్తిన ఈకలు, మెడలో పూసలేసుకొని తిరిగే అనాగరికులు, ఆ రూపంలో సంచరించే మావోయిస్టులు, చైనాకు అనుబంధంగా పనిచేస్తున్న పలు అంతర్జాతీయ సంస్థల నిధులు పుచ్చుకొని ఆందోళన చేస్తున్న ఆదివాసులు’ ఇది ప్రభుత్వ భాష. ఈ భాషణంతోని అమాయక ఆదివాస ప్రజలపై పలు సార్లు తుపాకీ గుండ్లను కురిపించి, రక్తపాతం సష్టించింది ప్రభుత్వం. అందులో దాదాపు 50 మంది తిరుగుబాటుదారులు అశువులు బాసారు. 

ఇంతకు ఆ తిరుగుబాటుదారులు ఎవరు ? వారు దేనిపై తిరుగుబాటు చేస్తున్నారు ? ఎందుకు చేస్తున్నారు ? అసలు ఈ గొడవ ఇప్పుడెందుకు ? అరుణాచల్‌ ప్రదేశ్‌లో 1,600 కోట్ల రూపాయలతో  కేంద్ర ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న ‘దిబాంగ్‌ డ్యామ్‌ ప్రాజెక్ట్‌’ వ్యతిరేకిస్తున్న వారంతా కేంద్రం దృష్టిలో తిరుగుబాటుదారులే. బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌లో భాగంగా సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున దిబాంగ్‌ నదిపై ప్రపంచంలోనే ఎత్తయిన కాంక్రీట్‌ గ్రావిటీ డ్యామ్‌ను కేంద్రం ఎప్పటి నుంచో నిర్మించాలనుకుంటోంది. ఇక్కడే జల విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2,880 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ప్రాజెక్ట్‌లో అంతర్భాగం. 

బ్రహ్మపుత్రకు ఉపనదిగా వ్యవహరించే దిబాంగ్‌ నది భారత్‌–చైనా సరిహద్దు ప్రాంతంలో పుట్టి అరుణాచల్‌ ప్రదేశ్‌లోకి ప్రవేశిస్తోంది. మిష్మీ హిల్స్‌ మీదుగా నిజాంఘాట్‌ వద్ద దిబాంగ్‌ లోయలోకి ప్రవహిస్తోంది. ఈ ప్రాంతమంతా జీవ రాసుల ఖజానా. ఉష్ణ మండలం, ఉప ఉష్ణ మండల, సమశీతోష్ణ మండలాల్లో కనిపించే ప్రతి వక్షరాసి ఇక్కడ ఉంది. హిమాలయ పర్వత సానువుల్లో కనిపించే అరుదైన చిరుతపులి (క్లౌడెడ్‌ లియోపార్డ్‌), మకాకు కోతి జాతులు, జింకలు, ఎలుగుబంట్లతోపాటు అంతరించిపోతున్న పలు అరుదైన పక్షులకు నెలవు ఈ ప్రాంతం. భూ భౌతిక సంపదతోపాటు జీవరాసులతో కళకళలాడుతున్న ఈ ప్రాంతం ఒక్క భారత్‌లోనే కాకుండా పరిసర దేశాల పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో తోడ్పడుతోంది. ఇక్కడ భూ ప్రకంపనలు కూడా ఎక్కువే. ఇందుకు కారణాలేమిటో శాస్త్రవేత్తలకు కూడా ఇప్పటికీ అంచనాలు అందడం లేదు. 

2000లోనే ప్రాజెక్ట్‌కు నాంది
భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, 2000 సంవత్సరంలో ఈ దిబాంగ్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి ‘నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ), సమగ్ర నివేదికను రూపొందించింది. అప్పటి బీజేపీ ప్రభుత్వం దీన్ని అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లింది. దిబాంగ్‌ దిగువ ప్రాంతానికి చెందిన అప్పటి ముఖ్యమంత్రి ముకుత్‌ మీటీ. తన ప్రాంతం అభివద్ధి చెందుతున్నదన్న ఆశతో అంగీకరించారు. 2010 నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కావాల్సి ఉండింది. స్థానిక ప్రజల నుంచి అనూహ్యంగా తిరుగుబాటు రావడంతో అది సాధ్యం కాలేదు. 

2007లో ప్రజాభిప్రాయ సేకరణ
‘ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ నోటిఫికేషన్‌’ ప్రకారం ఇలాంటి ప్రాజెక్ట్‌లకు పర్యావరణ అనుమతి తప్పనిసరి. అందుకు ప్రజామోదం కూడా తప్పనిసరి. 2007, మే నెలలో మొదటి సారి ప్రజాభిప్రాయ సేకరణకు మొదటిసారి పిలుపునిచ్చారు. అప్పటికి అస్సాం–అరుణాచ్‌ సరిహద్దులో నిర్మిస్తున్న ‘సుభాన్‌సిరి హైడ్రో పవర్‌ డ్యామ్‌ ప్రాజెక్ట్‌’కు వ్యతిరేకంగా ప్రజాందోళన చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి డ్యామ్‌ల వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉందో వివరించడంతోపాటు ప్రస్తుత దిబాంగ్‌ ప్రాజెక్ట్‌ విషయంలో ఎన్ని లోపాలున్నాయో తెలియజేస్తూ స్థానిక పత్రికలు లెక్కలేనన్ని వార్తా కథనాలను రాశాయి. అనేక ఆదివాసీ గ్రామాలతోపాటు దాదాపు 5000 హెక్టార్ల అటవి భూమి మునిగిపోతుందని వెల్లడించాయి. 700 కుబుంబాలు భూములు కోల్పోతారని పేర్కొన్నాయి. 

2008లో తొలి సమావేశం
ప్రజలు ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతో 2007, మే నెలలో ఏర్పాటు చేయాలుకున్న ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం వాయిదా పడింది. 2008, ఫిబ్రవరి నెలలో సమావేశం ఏర్పాటు చేయగా ఇదు–మిష్మీకి చెందిన 1200 మందితోపాటు మొత్తం 12 వేల మంది  హాజరయ్యారు. వారిలో 99 శాతం మంది ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాను వెల్లడించారు. అయినప్పటికీ అదే సంవత్సరం అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్, ప్రాజెక్ట్‌ సైట్‌కు 400 కిలోమీటర్ల దూరంలోని రాష్ట్ర రాజధాని ఇటానగర్‌లో ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. అప్పుడు ‘ఆల్‌ ఇదూ మిష్మీ విద్యార్థుల సంఘం, ఇదూ మిష్మీ కల్చరల్‌ అండ్‌ లిటరర్‌ సొసైటీ’ సభ్యులు నిరసన తెలిపారు. 

విచక్షణా రహితంగా కాల్పులు
2008 నుంచి మౌనం వహిస్తూ వస్తోన్న కేంద్రం ప్రభుత్వం 2011లో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి మళ్లీ పనులు చేపట్టింది. దానికి వ్యతిరేకంగా ప్రజాందోళనలు రాజుకోవడంతో వారి వెనక మావోయిస్టులు ఉన్నారంటూ కేంద్రం బలగాలను రంగంలోకి దించింది. 2011, అక్టోబర్‌ ఐదవ తేదీన ‘స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌’ దళాలు ఓ దుర్గాపూజా మండపంలోకి వెళ్లి విచక్షణారహితంగా  కాల్పులు జరపగా కనీసం పది మంది గాయపడ్డారు. అప్పటి నుంచి ఆందోళనలు జరిపినప్పుడల్లా కాల్పులు అనివార్యమయ్యాయి. మావోలు లేకపోయినప్పటికీ వారున్నారంటూ కేంద్రం ‘సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం’ను ప్రయోగించిందంటూ నాటి ఉద్యమకారులు పలు సందర్భాల్లో వెల్లడించారు. చైనా అనుబంధ సంస్థలు ఆందోళన నిర్వహిస్తున్నాయని కూడా కాంగ్రెస్‌ నేతలు పలు ప్రకటనలు చేశారు.

2013, మార్చి నాటికి ప్రజల వైఖరిలో మార్పు
2013, మార్చిలో జరిగిన తుది ప్రజా సదస్సు నాటికి ప్రజల్లో మార్పు వచ్చింది. ఆందోళనల కారణంగా అప్పటికే తమ కొడుకులు, బంధువులు కొన్నేళ్లపాటు జైల్లో ఉండాల్సి రావడంతో వారు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అంగీకరించారు. తగినంత నష్టపరిహారం కావాలని డిమాండ్‌ చేశారు. అది తేలకుండానే 2014లో లోక్‌సభ ఎన్నికలు రావడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయింది. అదే ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీ పాసిఘాట్‌లో మాట్లాడుతూ జల సంరక్షణ, పర్యాటకం, పూల తోటల పెంపకం, చేతి వత్తులను ప్రోత్సహించడం ద్వారా అరుణాచల్‌ ప్రజలకు ఉపాధి కల్పిస్తానని చెప్పారు. అదేమి జరగలేదు. 

1600 కోట్ల రూపాయల ప్రకటన
తమ ప్రభుత్వం అరుణాచల్‌ ప్రదేశ్‌ అభివద్ధికి కట్టుబడి ఉందని, దిబాంగ్‌ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి ఆ రాష్ట్రానికి 1600 కోట్ల రూపాయలను కేంద్రం అందజేస్తోందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ ఇటీవల పార్లమెంట్‌లో ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చేసిన మూడోరోజే ముందస్తు హెచ్చరికగా ప్రాజెక్ట్‌ ప్రాంతంలో ఓ మోస్తారు భూప్రకంపనలు వచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement