![Minister Indrakaran Reddy Statement On Ugadi Festival Celebrations - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/8/Ugadi.jpg.webp?itok=BMwEzQpy)
సాక్షి, హైదరాబాద్: ప్రతిసారి తెలుగు నూతన సంవత్సరం ఉగాది విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. ఈసారి అలాంటిదేమీ లేకున్నా ఉగాది పండుగ విషయంలో మత్రం తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈనెల 13వ తేదీన ఉగాది పండుగ చేసుకోవాలని మంత్రి ప్రకటించారు. ఆ రోజుల ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోజు ఉదయం 10.45 నిమిషాలకు బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు.
హైదరాబాద్‌లో గురువారం ఉగాది పండుగ నిర్వహణపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం ఆనవాయితీ అని, అయితే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈసారి కూడా ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా భక్తులు ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు.
హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 13వ తేదీన ఉగాది పర్వదినం పురస్కరించుకుని యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహా స్వామి దేవస్థాన ఉగాది పంచాంగాన్ని ఆవిష్కరిస్తామని వివరించారు. ఆరోజు ఉదయం 10.45 నిమిషాలకు బాచంపల్లి సంతోశ్ కుమార్ శాస్త్రి పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment