ఊరు వదిలేస్తం...ఉపాధి ఇస్తరా | Kawwal Tiger Reserve Residence move is not moving forward | Sakshi
Sakshi News home page

ఊరు వదిలేస్తం...ఉపాధి ఇస్తరా

Published Sun, Feb 16 2020 2:45 AM | Last Updated on Sun, Feb 16 2020 7:58 AM

Kawwal Tiger Reserve Residence move is not moving forward - Sakshi

నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్‌ పంచాయతీ పరిధిలో గల మైసంపేట్‌ గ్రామం

సాక్షి, హైదరాబాద్‌: కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ (కేటీఆర్‌) నుంచి నిర్వాసితుల తరలింపు ముందుకు సాగడం లేదు. పులులు సంచరించే అభయారణ్యంలోని ప్రధాన అటవీ ప్రాంతం (కోర్‌ ఏరియా)లోని గ్రామాల నుంచి స్థానికులను కదిలించే ప్రక్రియ విఘ్నాలను ఎదుర్కొంటోంది. అక్కడినుంచి ఇరవై గ్రామాలను తరలించాలని తొలుత నిర్ణయించారు.దీనిపై మెజారిటీ గ్రామాల వారు వ్యతిరేకించారు. ఆ తర్వాత పూర్తిగా అడవిలోనే ఉన్న నిర్మల్‌ జిల్లా కడెం మండలం ఉడుంపూర్‌ పంచాయతీ పరిధిలోని మైసంపేట, రాంపూర్‌ గ్రామాలను తరలించేందుకు పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికచేసి, ఆ ప్రక్రియను ప్రారంభించారు. అటవీశాఖ అధికారుల కృషి ఫలితంగా రెండు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ఊళ్లు ఖాళీ చేయడానికి అనుకూలంగా తీర్మానాలు చేశారు. 

కేంద్రం నిధుల విడుదల... 
కేంద్ర ప్రభుత్వ ‘ప్రాజెక్టు టైగర్‌’ పథకంలో భాగంగా ‘కేటీఆర్‌’లోని పై రెండు గ్రామాల్లోని 142 కుటుంబాల తరలింపునకు మొత్తం రూ. 14.20 కోట్లు వ్యయం కానుంది.ఇందులో కేం ద్రం 60 శాతం, రాష్ట్రం 40శాతం భరిస్తుంది. ఈనేపథ్యంలో 2018 అక్టోబర్‌ 22న కేంద్ర అటవీశాఖ తన వంతుగా రూ.8.52 కోట్లు విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో అటవీశాఖ ఉన్నతాధికారులు నిరాసక్తతను ప్రదర్శించడంతో పాటు,  రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునే విషయంలోనూ చొరవ చూపకపోవడంతో ఎలాంటి పురోగతి లేకుండా నిలిచిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరి 21న జరిగిన అటవీ శాఖ సమావేశంలోనే నిర్మల్‌ జిల్లాలోని మైసంపేట, రాంపూర్‌ గ్రామస్తులను తరలించేందు కు 112 హెక్టార్ల అటవీభూమిని డీనోటిఫై చేసే ప్రతిపాదనలకు కూడా ఆమోదం తెలిపారు.

అది పురోగతి లేకపోవడంతో మళ్లీ తాజాగా ఈనెల ఒకటిన జరిగిన రాష్ట్ర వన్యప్రాణిబోర్డు సమావేశంలోనూ డీనోటిఫై ప్రతిపాదనపై  మరోసారి ఆమోదముద్ర వేయాల్సిన స్థితి ఏర్పడింది. పునరావాసం కల్పిస్తే వెళ్లిపోయేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసినా తమను తరలించడం లేదని ఆ గ్రామాల్లోని వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అదీగాకుండా ఇటీవల నిర్మ ల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఈనెల 3న కొత్త కలెక్టర్‌గా ముషారఫ్‌ అలీ ఫారూఖి వచ్చారు. జిల్లా అధికార యంత్రాంగంలో  వచ్చిన మార్పు కూడా తరలింపుపై ప్రభావం పడనుంది.

పునరావాసానికి రెండు ఆప్షన్లు
ఈ గ్రామాల పునరావాసం కోసం...అధికారులు రెండు ఆప్షన్లు ఇచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల వంతున ఒకేసారి నగదు అందజేయడం మొదటిదికాగా, విడిగా పునరావాస గ్రామాన్ని ఏర్పాటు చేసి, ఇళ్లు, భూములు ఇచ్చి, ఇతర సౌకర్యాలను కల్పించి ఇవ్వాలనేది రెండో ప్రతిపాదన, వీటిలో 48కుటుంబాలు మొదటి ఆప్షన్‌ను,  94కుటుంబాలు రెండో ఆప్షన్‌ను   ఎంపికచేసుకున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండడంతో ఈ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోగా, ఉపాధి ఆవకాశాలు లేకపోవడంతో పలువురు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. స్థానికంగా ఉండేవారు  వెదురు తడకల అల్లికతో జీవనోపాధిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ భూములున్నా సాగునీటికి ఇబ్బందిగానే ఉంది. ఈ కారణాలతో వారు మైదాన ప్రాంతానికి వెళ్లేందుకు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చారు. 

ఊరును, ఇళ్లను ఇడిసిపెడతం..
మా మైసంపేట ఊరు మొత్తం అడివిలనే ఉంటది. సుట్టూ జంగలే. సాగు చేసుకుందమన్నా ఇబ్బందే. అధికారుల సూచన మేరకు మా గ్రామస్తులం పులుల కో సం ఊరిని, ఇళ్లను ఇడిసిపెట్టేందుకు సిద్ధమై నం. ఊరిని, ఇళ్లను ఇడిసిపెట్టి వస్తున్న మాకు మంచి సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నం. 
– పెంద్రం లచ్చు, గ్రామపటేల్, మైసంపేట్‌ 

అందరం ఒప్పుకున్నం..
అటవీ అధికారులు చెప్పిన తర్వాత ఊళ్లే అందరం ఇక్కడి నుంచే పోతందుకు ఒప్పుకున్నం. సార్లు చెప్పినట్లు మేం ఉన్న ఊరిని ఇడిసిపెట్టేందుకు సిద్ధమై నం. మాకు మంచి సౌకర్యాలు కల్పించాలి. సా గు కోసం ఇబ్బంది లేకుండా చూడాలి. ఉపాధి అవకాశాలను కల్పించాలని కోరుతున్నం. 
– అమృత్‌రావు, గ్రామస్తుడు, మైసంపేట్‌ 

తరలింపు కోసం ఏర్పాట్లు..
నిర్మల్‌జిల్లాలో గల కవ్వాల్‌ పులుల అభయారణ్యంలో నుంచి రెండు గ్రామాలను ప్రయోగాత్మకంగా తరలించి, పునరావాసం కల్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారు గ్రామసభ తీర్మానం ద్వారా పునరావాసానికి ఒప్పుకున్నారు. అదే మండలంలోని కొత్తమద్దిపడగ, నచ్చన్‌ ఎల్లాపూర్‌ గ్రామాల మధ్య గల అటవీశాఖకు చెందిన ప్రాంతానికి తరలించనున్నాం. పునరావాసానికి 112హెక్టార్ల భూమిని కేటాయించారు. త్వరలోనే జిల్లా కలెక్టర్, అధికారులతో డీఎల్‌సీ(డిస్ట్రిక్ట్‌ లెవల్‌ కో–ఆర్డినేషన్‌) మీటింగ్‌ నిర్వహించి, తదుపరి ప్రక్రియ చేపడతాం.
–ఎస్‌పీ.సుధన్, డీఎఫ్‌ఓ, నిర్మల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement