సాక్షి, మంచిర్యాల: పులి ఆకలి ఖర్చు.. అక్షరాలా లక్షల రూపాయలు. మేత కోసం అడవికి వెళ్లిన రైతుల పశువులను హతమారుస్తూ పులి తన ఆకలి తీర్చుకుంటోంది. దీంతో సదరు రైతులకు పరిహారం రూపంలో అటవీశాఖ డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. ఇలా ప్రతి నెలా పులి ఆకలి ఖర్చు పెరిగిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జి ల్లా పరిధిలో విస్తరించిన కవ్వాల్ టైగర్ జోన్‌లో ఇటీవల పశులవులపై పులుల దాడులు పెరిగాయి. గతంలో కంటే పులుల సంఖ్య పెరగడంతో దాడుల సంఖ్యా పెరిగి నష్టపరిహారం పెరుగు తూ వస్తోంది. అధికారిక గణాంకాలు పరిశీలిస్తే గతేడాది ఒక్క కాగజ్‌నగర్ డివిజన్‌లోనే 77 పశువులు పులికి ఆహారమయ్యాయి. ఇందుకు రూ. 9.62 లక్షలు పరిహారంగా పశువుల యజమానులకు చెల్లించారు. తాజాగా ఈ ఏడాది ఇప్పటివరకు మరో 5 పశువులపై దాడిచేయగా.. రూ.38 వేలు చెల్లించారు. చెన్నూరు డివిజన్‌లో 50కిపైగా పశువులు పులి దాడిలో చనిపోగా రూ.6 లక్షలు, బెల్లంపల్లి డివిజన్ పరిధిలో 32 పశువులకు గాను రూ.5 లక్షల వరకు చెల్లించారు.
వన్యప్రాణుల సమతుల్యత దెబ్బతిని..
మహారాష్ట్రలోని తడోబా పులుల సంరక్షణ కేం ద్రంలో పులుల సంతతి పెరిగి.. అవి ప్రాణహిత నది దాటి కవ్వాల్ టైగర్ జోన్‌లోకి వస్తున్నాయి. ప్రస్తుతం కవ్వాల్ టైగర్ జోన్‌లో 6 పులులు సంచరిస్తున్నట్లు అంచనా. ఈ జోన్‌లో పులుల సంఖ్యకు అనుగుణంగా శాకాహార జంతువులు లేవు. దీంతో పశువులపై పులుల దాడులు పెరి గాయి. దీంతో అటవీ అధికారులు గడ్డిక్షేత్రాలు పెంచి శాకాహార జంతువుల సంతతిని వృద్ధి చే స్తున్నారు. ఫలితంగా కొన్నాళ్లకు శాకాహార జం తువులు పెరిగే అవకాశాలున్నా.. ఇప్పటికిప్పు డు పులుల సంఖ్యకు అనుగుణంగా వన్యప్రాణులు తక్కువగానే ఉన్నాయి. గతంలో విచ్చలవిడిగా వన్యప్రాణుల వేట, కలప అక్రమ రవా ణాతో శాకాహార జంతువుల సమతుల్యత దెబ్బ తింది. అదీగాక పంది, జింక, దుప్పి, నీల్గాయి లాంటివి వేటాడటం కంటే మేతకు వెళ్లిన పశువులను వేటాడటం పులికి సులభంగా మారింది.
ఏటేటా పెరుగుతున్న పరిహారం
పులుల సంచారం అధికంగా ఉన్న కాగజ్‌నగర్, చెన్నూరు, ఆసిఫాబాద్ ఫారెస్టు డివిజన్లతో పా టు పెంచికల్‌పేట, బెజ్జూరు, చెన్నూరు, కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల్లో పరిహారం చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల బెల్లంపల్లి, మంచిర్యాల డివిజన్లలోనూ పులుల సంచారం పెరగటంతో పశువులపై దాడులు మొదలయ్యా యి. అటవీ సమీప గ్రామాల శివార్లలో మేతకు వెళ్లిన పశువులపై పులులు పంజా విసురుతున్నాయి. గేదెలు, ఆవులు, ఎద్దులు, గొర్రెలు ఎక్కువగా పులికి ఆహారమవుతున్నాయి. గత ఫిబ్రవరిలో మంచిర్యాల జిల్లా నీల్వాయి రేంజ్ పరిధి బ్రాహ్మణపల్లి అటవీ ప్రాంతంలో పులి ఏకంగా పశువుల కాపరిపైనే దాడి చేయగా, అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
పశువును బట్టి పరిహారం
పులి దాడిలో మరణించిన పశువులకు అటవీ అధికారులు పశువును బట్టి నష్టపరిహారం చెల్లిస్తున్నారు. గేదె, ఆవు, ఎద్దు, గొర్రె, మేకకు ఓ రేటు ప్రకారం ఇస్తున్నారు. పాలిచ్చేవి, పశువుల వయసు తదితర అంశాలను బట్టి విలువ కడుతున్నారు. ఇందుకు స్థానిక పశువైద్యులతో పులి దాడిలోనే చనిపోయిందనే ధ్రువీకరణతోపాటు స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో అటవీ అధికారులు విచారణ చేపట్టి నష్టపరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తే చెక్కురూపంలో పశువు యజమానికి డబ్బులు అందుతున్నాయి. దాదాపు రెండు వారాల్లోపే నష్టపరిహారం చెల్లించడంతో పశువుల యజమానులకు ఊరట కలుగుతోంది. పరిహారం చెల్లింపుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తోంది. పశువులు పులుల బారిన పడకుండా దాని సంచారం ఉన్నచోటకు వెళ్లొద్దని అటవీ అధికారులు స్థానిక రైతులకు అవగాహన కలిగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment