యానిమల్ ట్రాకింగ్ కెమెరాల్లో కనబడిన పులి
ప్రత్తిపాడు రూరల్, పిఠాపురం: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు, ఒమ్మంగి, ధర్మవరం, శరభవరం, కొడవలి గ్రామాల శివారు ప్రాంతాల్లో గేదెలను పెద్ద పులి చంపి తింటున్నట్లు అధికారులు నిర్థారించారు. పోతులూరు, కొడవలి గ్రామాల సరిహద్దుల్లో పోలవరం పంప్‌హౌస్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన యానిమల్ ట్రాకింగ్ కెమెరాల్లో పెద్ద పులి కనిపించింది. దీంతో సమీప గ్రామ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఐదు గ్రామాల సరిహద్దుల్లోను 120 మందితో గస్తీ ఏర్పాటు చేశారు.
అడవి దున్నలను పోలి ఉన్న గేదెలపై పులి దాడి చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పశువులను ఇళ్ల వద్దే కట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులకు అధికారులు సూచించారు. రాత్రి సమయాల్లో పొలాల్లోకి ఎవరూ వెళ్లరాదని హెచ్చరించారు. అటవీశాఖ సీసీఎఫ్ శరవణన్, డీఎఫ్‌వో ఐకేవీ రాజు, వైల్డ్ లైఫ్ డీఎఫ్‌వో సెల్వం, ఐఎఫ్‌వో ట్రైనీ భరణి, సౌజన్య తదితరులు ఘటనాస్థలాన్ని శనివారం పరిశీలించారు. ప్రస్తుతం ప్రత్తిపాడు శివారు జువ్వల వారి మెట్ట ప్రాంతంలో పులి ఉన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. బోన్లు ఏర్పాటు చేస్తే ఇతర జంతువులు పడే అవకాశం ఉండటంతో ఇతర మార్గాలను అన్వేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment