అధికార షాక్
సాక్షి, గుంటూరు : మాచర్ల ప్రాంతంలో ప్రభుత్వ భూములు కాజేయాలని చూసి ఆనక చేతులు కాల్చుకున్న సదరు నేత తాజాగా తన తనయుడి పేరుతో ఏర్పాటు చేసిన కేబుల్ నెట్‌వర్క్‌కు బహిరంగంగానే విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్నారు. ఆ నేతకు చెందిన కేబుల్ నోడ్‌లు బహిరంగంగా విద్యుత్ స్తంభాలకు వేలాడుతూ కనిపిస్తున్నా ఆ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
మాచర్ల నియోజకవర్గ అధికారపార్టీకి చెందిన నేత తన తనయుడి పేరుతో ఆరు నెలల క్రితం ఓ కేబుల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి మాచర్ల, రెంటచింతల, వెల్దుర్తి, దుర్గి మండలాల్లోని పలు గ్రామాల్లో తక్కువ ధరలకు కనెక్షన్లు ఇచ్చారు. సహజంగా జిల్లాలోని కేబుల్ నెట్‌వర్క్‌లు తమ కనెక్షన్ నోడ్‌లను ప్రైవేటు స్థలాలు లేదా ఇళ్లల్లో ఏర్పాటు చేసుకుని విద్యుత్ చార్జీలు చెల్లిస్తుంటారు. నోడ్‌ల నుంచి ఇళ్లకు కనెక్షన్లు ఇస్తారు. సదరు టీడీపీ నేత మాత్రం బహిరంగంగా విద్యుత్ స్తంభాలకే ఈ నోడ్‌లను బిగించి మెయిన్‌లైను నుంచి నేరుగా విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
విద్యుత్ శాఖ ఆదాయానికి గండి..
ఆరు నెలలుగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కేబుల్ నెట్‌వర్క్ కోసం విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నారు. సుమారు 250 నుంచి 300 వరకు విద్యుత్ స్తంభాలపై నోడ్‌లను బిగించారు. రోజుకు ఒక్కో నోడ్‌కు 1 నుంచి 2 యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే నెలకు 12 వేల యూనిట్లకు పైగా విద్యుత్‌ను అక్రమంగా వాడుకుంటున్నట్టు అర్థమవుతోంది. అంటే నెలకు సుమారు రూ. లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు విద్యుత్ శాఖ ఆదాయనికి గండిపడినట్టు తెలుస్తోంది. మాచర్ల పట్టణంలో విద్యుత్ శాఖలో డీఈ స్థాయి అధికారి ఉన్నప్పటికీ దీనిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
విజిలెన్స్ దాడులు నిర్వహించి చర్యలు తీసుకుంటాం
మాచర్ల నియోజకవర్గంలో అధికార పార్టీ నేత కేబుల్ నెట్‌వర్క్‌కు విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. అక్కడి విద్యుత్ అధికారులను అడిగి వివరాలు సేకరిస్తా. మంగళవారం గుంటూరు నుంచి విజిలెన్స్ అధికారులను పంపి దాడులు నిర్వహిస్తాం. విద్యుత్ అక్రమ వినియోగం జరిగినట్లు తేలితే కేసులు పెట్టి, పెనాల్టీలు వేస్తాం.
- జయభారత్‌రావు, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ
కేబుల్ నోడ్‌లను తొలగిస్తాం..
విద్యుత్ స్తంభాలపై కేబుల్ నోడ్లను ఉంచిన విషయం సోమవారమే నా దృష్టికి వచ్చింది. సిబ్బందిని పంపి కొన్ని స్తంభాలపై ఉన్న నోడ్‌లను తొలగించాం, మంగళవారం విద్యుత్ అధికారులు, సిబ్బందితో కలిసి మిగిలిన స్తంభాలపై ఉన్న కేబుల్ నోడ్‌లను పూర్తిగా తొలగిస్తాం. వీటిని ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. కేబుల్ వైర్లకు మాత్రం 176 స్తంభాలకు నెలకు రూ. 1700 చొప్పున పన్ను వసూలు చేస్తున్నాం. వీటిలో కూడా ఏమైనా తేడా ఉంటే పరిశీలించి చర్యలు చేపడతాం.
- భాస్కర్‌బాబు, విద్యుత్ డీఈ, మాచర్ల