రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు
హుద్‌హుద్ బీభత్సంలోనూ భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు
ఆశ్చర్యపోతున్న అబ్కారీ శాఖాధికారులు
రూ.6 కోట్ల అదనపు ఆదాయం
విశాఖపట్నం సిటీ: ‘విశాఖ నగరమంతా హుద్‌హుద్ తుపాను ధాటికి తల్లడిల్లిపోయింది. అంతా కష్టంలో చిక్కుకున్నారు. ఎవరూ మద్యం జోలికి వచ్చే అవకాశం లేదు. ఈ నెల కాస్త అమ్మకాలు తగ్గొచ్చు’... ఇదీ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు గత నెలలో వేసుకున్న లెక్కలు. అదే నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. అమ్మకాలు తగ్గినా ఫర్వాలేదు... వచ్చే నెలలోనైనా సరిగ్గా చూసుకోండంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. కానీ అధికారులు ఊహించింది ఒకటైతే విశాఖలో జరిగింది మరొకటి. అనూహ్యంగా అమ్మకాలు జరిగిపోయాయి. ఇప్పుడు ఆ సంగతి గుర్తు చేసుకుని ఇంత మద్యం ఎలా అమ్మకాలు జరిగాయోనని సర్వేలు చేసుకుంటున్నారు. తుపానులో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నష్టం జరిగింది. ఈ తరుణంలో మద్యం అమ్మకాలు తగ్గాల్సింది పోయి పెరగడమేంటంటూ అబ్కారీ శాఖ ఆశ్చర్యపోతోంది.
అసలేం జరిగింది?
జిల్లాలో దాదాపు 310 మద్యం దుకాణాలున్నాయి. వీ టన్నింటి ద్వారా నెలకు రూ.90 కోట్ల ఆదాయం వ స్తుందని అంచనా. హుద్‌హుద్ కారణంగా అంత మొ త్తంలో అమ్మకాలు జరిగే అవకాశం లేదని భావించారు. వారం రోజుల పాటు విశాఖ అంధకారంలో ఉండడం, చాలా మద్యం దుకాణాల రేకులు ఎగిరిపోవడం, గోడలు పడిపోవడం, మద్యం గొడౌన్లు కూలిపోవడం కారణంగా వ్యాపారానికి ఎంతో కొంత నష్టం వచ్చి ఉంటుందని అనుకున్నారు. రూ.90 కోట్లు కన్నా ఓ అయిదో పదో కోట్లు తక్కువ రావచ్చని అంచనా వేశారు. కానీ ఊహించని రీతిలో రూ.96 కోట్ల మేర అమ్మకాలు సాగండంతో ఎక్సైజ్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. జిల్లాలోని మద్యం ప్రియులు దాదాపు 2.36 లక్షల కేసుల మద్యాన్ని గుటుక్కున మింగేశారు. రెండు లక్షల కేసుల మద్యం అమ్మడమే చాలా గొప్ప అనుకున్న తరుణంలో విశాఖ వాసుల మద్యం పట్టు ఏంటో తాజాగా తెలిసొచ్చింది. దీంతో ప్రతి నెలా ఇచ్చే లక్ష్యాన్ని ఈ సారి అబ్కారీ శాఖ విశాఖకు మరింత పెంచే అవకాశముంది. వ్యాపారం లేదనుకున్న సమయంలోనే ఊహించనంత ఆదాయం వచ్చినప్పుడు శీతాకాలంలో మరింత ఎక్కువగా వ్యాపారం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో నవంబర్ నెల నుంచి మరో 20 శాతం అదనపు వ్యాపార లక్ష్యాన్ని జిల్లాకు నిర్దేశించినట్టు సమాచారం. ఈ మొత్తం అమ్మకాలు పెంచుకునేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
రూ.6 కోట్ల మద్యం తాగిందెవరు?
జిల్లాలో అధనంగా రూ.6 కోట్ల మద్యం ఎవరు తాగేశారని సర్వే చేస్తున్న అబ్కారీ శాఖకు పొరుగు రాష్ట్రాల నుంచి పనులు కోసం ఇక్కడికి వచ్చిన వారిపైనే అనుమానం కలుగుతోంది. హుద్‌హుద్ తుపాను తర్వాత వివిధ పనులు నిమిత్తం విశాఖ జిల్లాకు వచ్చిన కార్మికులే మద్యం భారీగా సేవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తుపాను తర్వాత వారం రోజుల వరకూ మంచి నీళ్లే దొరకని పరిస్థితిలో ఈ మద్యాన్నే కార్మికులు, రోజూ వారి కూలీలు ఎక్కువగా కొని ఉంటారని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ , ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో బాటు రాయలసీమ నుంచి వచ్చిన కార్మికులు మస్తుగా మద్యం సేవించి ఉండొచ్చని భావిస్తున్నారు. వారు రోజు 10 నుంచి 12 గంటలు పైగా కష్టపడేవారని, అలాంటప్పుడు మద్యం సేవించకపోతే అన్ని గంటలు ఎలా పని చేస్తారని చెబుతున్నారు.