స్వైన్‌విహారం
వేగంగా విస్తరిస్తున్న వైరస్
కాలు బయటపెట్టాలంటేనే భయం
ముందస్తు మందుల కోసం వెదుకులాట
అరకొర చర్యలతో సరిపెడుతున్న అధికారులు
విశాఖపట్నం: ఆర్ధిక రాజధాని.. సిటీ ఆఫ్ డెస్టినీ..ఇలా విశాఖ జిల్లాను, మహా నగరాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు మన పాలకులు. కానీ అంతటి ప్రాశస్త్యాన్ని నిలబెట్టేందుకు మా త్రం ప్రయత్నించడం లేదు. కొన్ని నెలల క్రి తం హుద్‌హుద్ తుపాను విశాఖను కకావిక లం చేసింది. పచ్చదనాన్ని తుడిసిపెట్టేసింది. భారీ ఆస్థి నష్టాన్ని కలిగించింది. ఆ భయానక విలయం నుంచి తేరుకుంటున్న ప్రజలను ఇప్పుడు స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. హైదారాబాద్‌లో విశాఖలో అత్యంత వేగంగా స్వైన్‌ఫ్లూ వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే ముగ్గురికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉంది. స్వైన్‌ఫ్లూ నిర్ధారణతో జిల్లా వాసుల్లో మళ్లీ కలవర ం మొదలైంది. జనం ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అరకొర ఏర్పాట్లు, సమీక్షలు మినహా ప్రభుత్వం, అధికారులు చేస్తున్న చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. హుద్ హుద్ తుపాను తర్వాత విశాఖ వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు అప్పుడే హెచ్చరించారు. దానికి తగ్గట్టుగానే ముందుగా తీరం కోతకు గురయ్యింది. మునుపెన్నడూ లేనంత భారీగా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. ఆర్ కే బీచ్ నుంచి, సాగర్‌నగర్ వరకూ తీరం భయపెడుతోంది. కట్టడాలు సైతం సముద్రంలో కలిసిపోతున్నాయి. తీరం కోతను అడ్డుకోవడానికి జిల్లా అధికార యంత్రాంగం తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంది. అధ్యయనాలంటూ కాలయాపన చేస్తోంది. దీని వల్ల భవిష్యత్‌లో ప్రాణాలకు ముప్పు వాటిల్లనుందని తీర ప్రాంత వాసులు ఆందోళన పడుతున్నారు. ఈ సమస్య తీరకుండానే స్వైన్‌ఫ్లూ వచ్చిపడింది.
హైదరాబాద్ వంటి మైదాన నగరాలతో పోల్చితే, సముద్ర తీర ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ విజృంభణ అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు ఇప్పటికే తేల్చారు. అయినా యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యింది. నెల రోజుల క్రితమే హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న స్వైన్‌ఫ్లూని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే విమానాశ్రయాలు, బస్, రైల్వే స్టేషన్లలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే వైరస్‌ను జిల్లాలో అడుగుపెట్టకుండా అడ్డుకునే అవకాశం ఉండేది. అది ఎలాగూ చేయలేదు. వైరస్ వచ్చాకైనా పట్టించుకున్నారా అంటే అదీ లేదు. నాలుగేళ్ల బాలుడుకి స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నాయని గుర్తించినా మేల్కోలేదు. చివరికి ఆ బాలుడికి వైద్యం చేసిన వైద్యురాలు కూడా అస్వస్థకు గురయ్యారంటే నిర్లక్ష్యం స్థాయి ఏ మేరకు ఉందో అర్ధమవుతోంది. బాలుడికి స్వైన్‌ప్లూ నిర్ధారణయ్యాక మంత్రులు కేజీహెచ్‌లో కాసేపు తిరిగి వచ్చేశారు. తర్వాత మరో ఇద్దరికి ప్లూ సోకింది. శనివారం సమీక్ష జరుపానని చెప్పిన మంత్రి గం టా శ్రీనివాసరావు ఆస్పత్రికి మొఖం చాటేశారు. శనివారం జాయింట్ కలెక్టర్ జనార్ధన్ నివాస్ సమీక్ష మినహా స్వైన్‌ప్లూపై యుద్దప్రాతిపధికన అధికారులు స్పందిస్తున్న దాఖలాలు లేవు. మరోవైపు జనం స్వైన్‌ప్లూ భారిన పడకుండా ముందస్తు మందులేమైనా ఉన్నాయా అని మెడికల్ దుకాణాలకు పరుగులుదీస్తున్నారు. కానీ ఎక్కడా నివారణ మందులు లేవు. హోమియో గుళికలతో ప్రయోజనం ఉంటుందని భావించి వాటిని కొందరు వాడుతున్నారు. అవీ అందరికీ దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో ముఖానికి మాస్క్‌లు వేసుకుని తిరగడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఏం చేయాలో చెప్పే వారు లేరు.
స్వ్వైన్‌ఫ్లూ అనుమానిత మహిళ మృతి
విశాఖ మెడికల్: విశాఖ ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో చికి త్స పొందుతున్న విజయనగరం మహిళ(45) శనివారం మృతి చెందింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆమెను గత నెల 29(జనవరి)న రాత్రి ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చేర్చగా, పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు ఆమెలో స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వ్యాధి నిర్థారణ కోసం ఆమె గొంతు నుంచి సేకరించిన లాలాజల న మూనాలను హైదరాబాద్ పంపిన విషయం విదితమే. వెంటిలేటర్‌పై స్వైన్‌ఫ్లూ చికిత్స కొనసాగిస్తుండగా ఆమె మృతి చెందడం, వ్యాధి నిర్థారణ నివేదిక ఇంకా అందకపోవడం ఆమె మృతి స్వైన్‌ఫ్లూ మృతా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలుడి పరిస్థితి మెరుగుపడడంతో శనివారం ఆ బాలుడికి డిశ్చార్జ్ చేసినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూధనబాబు తెలిపారు.
బులిటెన్
స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయిన వారు..
1. అక్కయ్యపాలెం అబీద్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి-సీతమ్మధారలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ప్లూతో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల పరిస్థితి విషమంగా ఉంది.
2. విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన 32ఏళ్ల మహిళ-రాంనగర్‌లోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది.
అనుమానిత లక్షణాలున్నవారు..
1. కొత్తరోడ్డుకు చెందిన 56ఏళ్ల మహిళ- ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది.
2. గాజువాకకు చెందిన 38ఏళ్ల వ్యక్తి-ైప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది.
డిశ్చార్జ్ అయిన వారు..
1. ఇసుకతోటకు చెందిన నాలుగేళ్ల బాలుడు స్వైన్‌ప్లూ భారి నుంచి కోలుకున్నాడు. శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.