city of destiny
-
వాహ్ వైజాగ్.. సాటిలేని మేటి సిటీ
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి సౌందర్యానికి, ఆహ్లాదకర వాతావరణానికి, సౌమ్యులైన మనుషులకు అది నిలయం.. ఒకపక్క అతి సుందర సాగరతీరం.. మరోపక్క రాశులు పోసినట్లుండే పచ్చని పర్వతాలు.. వాటి దిగువన పుష్కలంగా నిక్షిప్తమై ఉండే భూగర్భ జలాలు.. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే నేరాలు, ఘోరాలకు దూరంగా ఉండే నగరం.. అదృష్టానికి చిరునామాగా పిలుచుకునే సిటీ ఆఫ్ డెస్టినీ.. ఇన్ని ప్రత్యేకతలున్న అరుదైన నగరం మన విశాఖపట్నం. ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వారినైనా అక్కున చేర్చుకునే నైజం విశాఖ సొంతం. నడి వేసవిలోనూ వేడి జాడ నామమాత్రంగా ఉండే ప్రాంతం. ఇక సముద్రమట్టానికి 45 మీటర్ల ఎత్తుతో భవిష్యత్తులో ముంపు ముప్పేలేని ఏకైక తీర నగరం కూడా ఇదే. దక్షిణాది రాష్ట్రాల్లో ఇన్ని విశిష్టతలు విశాఖకే సొంతం. ఇలా ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానికి అవసరమైన అన్ని అర్హతలు, హంగులతో వాహ్.. అనిపించే ప్రకృతి ప్రసాదించిన మహానగరం విశాఖపట్నం. సముద్రానికి 45మీటర్ల ఎత్తులో.. ఇది ప్రకృతి వైపరీత్యాలకు అంతగా ప్రభావితం కాని నగరం కూడా. హుద్‌హుద్‌లాంటి సూపర్ సైక్లోన్‌తో కకావికలమైనా నెలల వ్యవధిలోనే తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకున్న విశిష్ట నగరి. తూర్పు, పశ్చిమ తీరాల్లోని ప్రధాన నగరాలన్నింటికంటే విశాఖ ఎంతో సురక్షితమైనదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ నగరం సముద్రమట్టానికి సగటున 45 మీటర్ల ఎత్తులో ఉంది. చెన్నై 6.7 మీటర్లు, ముంబై 14 మీటర్లు, మంగుళూరు 22 మీటర్ల ఎత్తులోనూ ఉన్నాయి. అంటే విశాఖ నగరంకంటే సముద్రం 45 మీటర్ల దిగువన ఉందన్న మాట. అందువల్ల ఇప్పట్లోనే కాదు.. భవిష్యత్తులోనూ విశాఖకు ఎలాంటి ముంపు ముప్పు ఉండే అవకాశమే లేదు. అదే చెన్నై, ముంబై నగరాలు తరచూ ముంపు బారిన పడుతున్నాయి. నిజానికి.. విశాఖ నగరం భౌగోళికంగా ఎత్తు పల్లాలుగా ఉంటుంది. దీంతో 15–20 సెం.మీ.ల మేర భారీ వర్షం కురిసినా నీరు నిలిచిపోకుండా దిగువనున్న సముద్రంలోకి వెళ్లిపోతుంది. రాత్రి వేళ విద్యుత్ కాంతుల్లో డాల్ఫిన్ నోస్ ఆహ్లాదకర వాతావరణం.. ఇక వైజాగ్‌లో అన్ని సీజన్లలోనూ ఆహ్లాదకర వాతావరణమే నెలకొంటుంది. ఓ పక్క చల్లగాలులను పంపించే సముద్రం, మరోపక్క పచ్చని పర్వత శ్రేణులు ఇందుకు దోహదం చేస్తున్నాయి. తూర్పు కనుమలు, సింహాచలం కొండ, యారాడ కొండ, కంబాల కొండ, కైలాసగిరి, డాల్ఫిన్‌నోస్ వంటివి పర్యావరణ సమతుల్యతను పదిలంగా ఉంచుతున్నాయి. అంతేకాదు.. ఈ కొండలు భూగర్భ జలాలను సంరక్షిస్తున్నాయి. దీంతో తక్కువ లోతులోనే నీటి లభ్యత ఉంటూ ఏడాది పొడవునా నీటి ఎద్దడికి ఆస్కారం లేకుండా చూస్తున్నాయి. అలాగే, వేసవిలో విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45–48 డిగ్రీల వరకు నమోదవుతాయి. కానీ విశాఖలో సగటున 36 డిగ్రీలకు మించదు. నడి వేసవిలో మధ్యాహ్నం వేళ ఒకింత ఉష్ణతాపం అనిపించినా సా.4 గంటలకే వాతావరణం చల్లబడిపోవడం ఈ నగరానికున్న ప్రత్యేకత. అందుకే ఇక్కడకు దేశ, విదేశాల నుంచి జనం పోటెత్తుతుంటారు. అయితే, సగటున 68 శాతం హ్యుమిడిటీ నమోదుతో వేసవిలో ఉక్కపోత ఒకింత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు.. శీతాకాలంలోనూ సాధారణ చలే తప్ప ఎముకలు కొరికే చలి విశాఖలో ఉండదు. ఉప్పెనల ముప్పేలేదు.. తీర ప్రాంతంలో ఉన్నప్పటికీ విశాఖ నగరానికి ఉప్పెనల ముప్పులేదు. ఎటువైపు నుంచీ వరద గాని, ఉప్పెన గాని ముంచెత్తే అవకాశంలేదు. ఇది కూడా విశాఖ నగరానికి ప్రకృతి పరంగా మేలుచేసే అంశంగా నిపుణులు చెబుతుంటారు. ఇక విశాఖలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజనులో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ఏడాదిలో సగటున 53 రోజులు వర్షిస్తాయి. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా అన్ని సీజన్లలోనూ అనుకూల వాతావరణం కలిగిన ఏకైక నగరంగా విశాఖపట్నం ఖ్యాతి గడించింది. రానున్న వందేళ్లలో కొచ్చి 2.3 అడుగులు, పారదీప్ 1.93 ముంబై 1.90, చెన్నై 1.87 అడుగులు, మంగుళూరు 1.87 అడుగుల చొప్పున సముద్రమట్టాలు పెరుగుతాయని.. అయితే, ఈ నగరాలన్నిటికంటే తక్కువగా విశాఖలో 1.77 అడుగులు మాత్రమే సముద్రమట్టం పెరిగే అవకాశముందని నిపుణుల అంచనా. ఇది కూడా విశాఖకు ఎంతో మేలుచేసే అంశం. అన్ని కాలాలకు అనువైన సిటీ విశాఖపట్నం అన్ని కాలాలకు అనువైన సిటీ. శీతాకాలంలో చలి, వర్షాకాలంలో వానలు, వేసవిలో ఎండలు ఎక్కువ ప్రభావం చూపవు. అందుకే విశాఖలో మోడరేట్ క్లైమేట్ ఉంటుంది. సమీపంలో ఉన్న పర్వతాలు విశాఖకు అదనపు ఆభరణాలు. వీటివల్ల భూగర్భ జలాలు సంరక్షించబడుతున్నాయి. సముద్రమట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఈ నగరం ఉండడంతో ముంపు ముప్పుగాని, ఉప్పెనల భయంగాని లేదు. ముంబై, చెన్నై, కొచ్చి, మంగుళూరులాంటి తీరప్రాంత నగరాల మాదిరిగా సముద్రమట్టాల పెరుగుదల బెడద కూడా విశాఖకు లేదు. – ఓఎస్ఆర్యూ భానుకుమార్, వాతావరణం, సముద్ర అధ్యయన విభాగపు పూర్వ అధిపతి, ఏయూ, విశాఖ -
Visakhapatnam: టూరిజంలో వైజాగ్‌కు ట్రెండ్ సెట్ చేసే సత్తా
టీ ఆఫ్ డెస్టినీగా పిలుచుకునే విశాఖ నగరానికి పర్యాటక రంగంలో ట్రెండ్ సెట్ చేసే సత్తా ఉందని కేంద్ర పర్యాటక శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గౌర్ కంజీలాల్ అన్నారు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తూ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే గోవా కంటే మిన్నగా విశాఖ బీచ్‌లను అభివృద్ధి చేయవచ్చన్నారు. అలాగే 10 విభిన్న రకాల టూరిజం డెస్టినేషన్‌గా వైజాగ్‌ను తీర్చిదిద్దవచ్చని వివరించారు. ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన గౌర్ కంజీలాల్.. టూరిజం రంగంలో విశాఖకు ఉన్న అవకాశాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, విశాఖపట్నం ప్రపంచంలో ప్రతి మనిషి ఆలోచనలు ఎప్పటికప్పుడు విభిన్నంగా మారిపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్ టూరిజం ట్రెండ్‌కు తగినట్లుగా ఆలోచనలు చేస్తూ ప్రాజెక్టులను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఒక ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ వరుసలో అవకాశాలు పుష్కలంగా ఉన్న నగరాల జాబితాలో విశాఖపట్నం మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడ పర్యాటక పరంగా వనరులు అపారంగా ఉన్నాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేస్తే దేశంలో నంబర్ వన్‌గా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్లీన్ అండ్ పీస్ఫుల్ బీచ్‌లుగా.. 1952 నుంచి 1980 మధ్యలో భారత్‌లో పర్యటించింది కేవలం ఒక మిలియన్ పర్యాటకులు మాత్రమే. దీనిపై మేము లండన్ వెళ్లి అధ్యయనం చేశాం. అప్పుడే ఛార్టర్ విమానాలు నడపాలన్న ప్రతిపాదనలను తీసుకొచ్చాం. క్రమంగా ఒక్కో ప్రాంతానికి ఎయిర్ కనెక్టివిటీ పెంచుతూ పర్యాటకంగా అభివృద్ధికి దోహదపడింది. ఇదే కాన్సెప్ట్‌లో వైజాగ్‌కు పెద్ద సంఖ్యలో టూరిస్టులను ఆకర్షితుల్ని చెయ్యాలి. ఇందుకు కాన్సెప్ట్ డెవలప్మెంట్ చాలా అవసరం. దేశంలో ఉన్న 365 బీచ్‌లతో పోలిస్తే.. విశాఖలో మంచి బీచ్‌లున్నాయి. వీటన్నింటినీ క్లీన్ అండ్ పీస్ఫుల్ బీచ్‌లుగా తీర్చిదిద్దాలి. తీరప్రాంత వినియోగంతో అద్భుతాలు విశాఖకు 135 కిలోమీటర్ల సువిశాల సాగర తీరం ఉన్నా.. టూరిజం పరంగా సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. పోర్ట్ ఆఫ్ కాల్ పేరుతో క్రూయిజ్ టూరిజం అభివృద్ధి చేయవచ్చు. పెద్ద క్రూయిజ్‌ని సముద్ర మధ్య భాగంలో నిలిపి.. డైనింగ్, ఫంక్షన్లు నిర్వహించేలా, క్యాసినోలు మొదలైన కమర్షియల్ టూరిజంని ప్రవేశపెడితే అద్భుతంగా ఉంటుంది. గోవా ఈ తరహాలోనే అభివృద్ధి చెందింది. అక్కడ జనాభా 2 మిలియన్లుంటే.. వచ్చే పర్యాటకులు మాత్రం 5 మిలియన్లుంటారు. కారణం.. పర్యాటకుల అభిరుచికి అనుగుణంగా స్థానికుల్లోనూ మార్పు వచ్చింది. ఫలితంగా గోవా మొత్తం టూరిస్ట్ డెస్టినీగా మారిపోయింది. దానికంటే మిన్నగా విశాఖను అభివృద్ధి చేయవచ్చు. ప్రజలు ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేస్తే... వైజాగ్ కచ్చితంగా.. దేశంలోనే నెంబర్ వన్ పర్యాటక ప్రాంతంగా మారుతుంది. ఛార్టర్లను అందుబాటులోకి తీసుకురావాలి.. ఛార్టర్లను విశాఖకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. పొరుగు దేశాల నుంచి ఛార్టర్లు వస్తే.. ఒకేసారి 400 మంది పర్యాటకులు వస్తారు. వారికి తగిన ఏర్పాట్లను కల్పించాల్సి ఉంది. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. గల్ఫ్, ఖతార్, కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్, కొలంబో మొదలైన దేశాల నుంచి ఇక్కడి పర్యాటకులకు ఆహ్వానం పలికేలా ప్యాకేజీలు రూపొందించాలి. విదేశీ పర్యాటకులకు అనుగుణంగా ఎయిర్‌పోర్టులో మౌలిక వసతులు, నగరంలో సదుపాయాలు, హాస్పిటాలిటీ పెంచాలి. వైజాగ్ ప్రపంచాన్ని టూరిస్టులకు పరిచయం చేసేందుకు స్కిల్ డెవలప్మెంట్ ఉన్న స్టాఫ్‌ని నియమించుకోవాలి. 10 విభిన్నతల టూరిజం.. బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, క్రూయిజ్ టూరిజం, సస్టైనబుల్ టూరిజం, ఎకోటూరిజం, విలేజ్ టూరిజం, కల్చరల్ టూరిజం, అగ్రి టూరిజం, క్రియేటివ్ టూరిజం, డార్క్ టూరిజం.. ఇలా పది విభిన్న రకాల పర్యాటక అభివృద్ధికి కావల్సిన వనరులు విశాఖలో ఉన్నాయి. ఉదాహరణకు అరకులో కూల్ టూరిజం అభివృద్ధి చేయవచ్చు. గ్రామీణ విశాఖ, అరకు ప్రాంతంలో అగ్రి టూరిజం, విలేజ్ టూరిజం ప్రమోట్ చేస్తే అంతర్జాతీయ నగరాల నుంచి పర్యాటకులు క్యూ కడతారు. అదేవిధంగా.. హోమ్ స్టే సంస్కృతి తీసుకురావాలి. టూరిజం మార్కెట్లో హోమ్‌స్టేలకు మంచి డిమాండ్ ఉంది. -
స్వైన్‌విహారం
వేగంగా విస్తరిస్తున్న వైరస్ కాలు బయటపెట్టాలంటేనే భయం ముందస్తు మందుల కోసం వెదుకులాట అరకొర చర్యలతో సరిపెడుతున్న అధికారులు విశాఖపట్నం: ఆర్ధిక రాజధాని.. సిటీ ఆఫ్ డెస్టినీ..ఇలా విశాఖ జిల్లాను, మహా నగరాన్ని ఆకాశానికెత్తేస్తున్నారు మన పాలకులు. కానీ అంతటి ప్రాశస్త్యాన్ని నిలబెట్టేందుకు మా త్రం ప్రయత్నించడం లేదు. కొన్ని నెలల క్రి తం హుద్‌హుద్ తుపాను విశాఖను కకావిక లం చేసింది. పచ్చదనాన్ని తుడిసిపెట్టేసింది. భారీ ఆస్థి నష్టాన్ని కలిగించింది. ఆ భయానక విలయం నుంచి తేరుకుంటున్న ప్రజలను ఇప్పుడు స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. హైదారాబాద్‌లో విశాఖలో అత్యంత వేగంగా స్వైన్‌ఫ్లూ వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే ముగ్గురికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. మరో ఇద్దరి రిపోర్టులు రావాల్సి ఉంది. స్వైన్‌ఫ్లూ నిర్ధారణతో జిల్లా వాసుల్లో మళ్లీ కలవర ం మొదలైంది. జనం ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అరకొర ఏర్పాట్లు, సమీక్షలు మినహా ప్రభుత్వం, అధికారులు చేస్తున్న చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. హుద్ హుద్ తుపాను తర్వాత విశాఖ వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు అప్పుడే హెచ్చరించారు. దానికి తగ్గట్టుగానే ముందుగా తీరం కోతకు గురయ్యింది. మునుపెన్నడూ లేనంత భారీగా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. ఆర్ కే బీచ్ నుంచి, సాగర్‌నగర్ వరకూ తీరం భయపెడుతోంది. కట్టడాలు సైతం సముద్రంలో కలిసిపోతున్నాయి. తీరం కోతను అడ్డుకోవడానికి జిల్లా అధికార యంత్రాంగం తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంది. అధ్యయనాలంటూ కాలయాపన చేస్తోంది. దీని వల్ల భవిష్యత్‌లో ప్రాణాలకు ముప్పు వాటిల్లనుందని తీర ప్రాంత వాసులు ఆందోళన పడుతున్నారు. ఈ సమస్య తీరకుండానే స్వైన్‌ఫ్లూ వచ్చిపడింది. హైదరాబాద్ వంటి మైదాన నగరాలతో పోల్చితే, సముద్ర తీర ప్రాంతాల్లో స్వైన్‌ఫ్లూ విజృంభణ అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు ఇప్పటికే తేల్చారు. అయినా యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యింది. నెల రోజుల క్రితమే హైదరాబాద్‌లో కలకలం రేపుతున్న స్వైన్‌ఫ్లూని పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే విమానాశ్రయాలు, బస్, రైల్వే స్టేషన్లలో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే వైరస్‌ను జిల్లాలో అడుగుపెట్టకుండా అడ్డుకునే అవకాశం ఉండేది. అది ఎలాగూ చేయలేదు. వైరస్ వచ్చాకైనా పట్టించుకున్నారా అంటే అదీ లేదు. నాలుగేళ్ల బాలుడుకి స్వైన్‌ఫ్లూ లక్షణాలున్నాయని గుర్తించినా మేల్కోలేదు. చివరికి ఆ బాలుడికి వైద్యం చేసిన వైద్యురాలు కూడా అస్వస్థకు గురయ్యారంటే నిర్లక్ష్యం స్థాయి ఏ మేరకు ఉందో అర్ధమవుతోంది. బాలుడికి స్వైన్‌ప్లూ నిర్ధారణయ్యాక మంత్రులు కేజీహెచ్‌లో కాసేపు తిరిగి వచ్చేశారు. తర్వాత మరో ఇద్దరికి ప్లూ సోకింది. శనివారం సమీక్ష జరుపానని చెప్పిన మంత్రి గం టా శ్రీనివాసరావు ఆస్పత్రికి మొఖం చాటేశారు. శనివారం జాయింట్ కలెక్టర్ జనార్ధన్ నివాస్ సమీక్ష మినహా స్వైన్‌ప్లూపై యుద్దప్రాతిపధికన అధికారులు స్పందిస్తున్న దాఖలాలు లేవు. మరోవైపు జనం స్వైన్‌ప్లూ భారిన పడకుండా ముందస్తు మందులేమైనా ఉన్నాయా అని మెడికల్ దుకాణాలకు పరుగులుదీస్తున్నారు. కానీ ఎక్కడా నివారణ మందులు లేవు. హోమియో గుళికలతో ప్రయోజనం ఉంటుందని భావించి వాటిని కొందరు వాడుతున్నారు. అవీ అందరికీ దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో ముఖానికి మాస్క్‌లు వేసుకుని తిరగడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఏం చేయాలో చెప్పే వారు లేరు. స్వ్వైన్ఫ్లూ అనుమానిత మహిళ మృతి విశాఖ మెడికల్: విశాఖ ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో చికి త్స పొందుతున్న విజయనగరం మహిళ(45) శనివారం మృతి చెందింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆమెను గత నెల 29(జనవరి)న రాత్రి ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చేర్చగా, పరీక్షించిన ఆస్పత్రి వైద్యులు ఆమెలో స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వ్యాధి నిర్థారణ కోసం ఆమె గొంతు నుంచి సేకరించిన లాలాజల న మూనాలను హైదరాబాద్ పంపిన విషయం విదితమే. వెంటిలేటర్‌పై స్వైన్‌ఫ్లూ చికిత్స కొనసాగిస్తుండగా ఆమె మృతి చెందడం, వ్యాధి నిర్థారణ నివేదిక ఇంకా అందకపోవడం ఆమె మృతి స్వైన్‌ఫ్లూ మృతా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలుడి పరిస్థితి మెరుగుపడడంతో శనివారం ఆ బాలుడికి డిశ్చార్జ్ చేసినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూధనబాబు తెలిపారు. బులిటెన్ స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయిన వారు.. 1. అక్కయ్యపాలెం అబీద్ నగర్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తి-సీతమ్మధారలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వైన్‌ప్లూతో పాటు ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల పరిస్థితి విషమంగా ఉంది. 2. విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన 32ఏళ్ల మహిళ-రాంనగర్‌లోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. అనుమానిత లక్షణాలున్నవారు.. 1. కొత్తరోడ్డుకు చెందిన 56ఏళ్ల మహిళ- ప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. 2. గాజువాకకు చెందిన 38ఏళ్ల వ్యక్తి-ైప్రభుత్వ ఛాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం నిలకడగా ఉంది. డిశ్చార్జ్ అయిన వారు.. 1. ఇసుకతోటకు చెందిన నాలుగేళ్ల బాలుడు స్వైన్‌ప్లూ భారి నుంచి కోలుకున్నాడు. శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. -
విశాఖ విలవిల
* విశిష్టతలను ధ్వంసం చేసిన హుదూద్ * వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం, నగరజీవనం అస్తవ్యస్థం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సిటీ ఆఫ్ డెస్టినీ... నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ఆర్థిక, పర్యాటక రాజధానిగా వర్ణిస్తున్న నగరం... అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావించిన స్మార్ట్‌సిటీ... అలాంటి విశాఖపట్నాన్ని హుదూద్ తుపాను భయానకంగా కుదిపేసింది. ఓ రాకాసి చేయి పట్టుకుని ఊపేసినట్లు ఊపేసింది. పెను విధ్వంసం కళ్లకు కట్టింది. మధ్యయుగాల్లో విదేశీ దురాక్రమణల్లో ధ్వంసమైన భారతీయ నగరాలను గుర్తుకు తెచ్చేలా ప్రకృతి ప్రకోపానికి గురైంది. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రకృతి విధ్వంసానికి మూగసాక్షిగా నిలుస్తోంది. విశాఖ విశిష్టతలు గాలికి... హుదూద్ తుపాను విశాఖలో విధ్వంసం సృష్టించింది. విశాఖ నగరాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే విశిష్టతల్ని ఘోరంగా దెబ్బతీసింది. విశాఖ ప్రత్యేక గుర్తింపునకు ప్రధాన కారణమైన సముద్రమే ఈ పెను విధ్వంసానికి కూడా కారణం. విశాలమైన విశాఖ రోడ్లు చిన్నాభిన్నమయ్యాయి. తూర్పున సాగర్ నగర్ నుంచి దక్షిణాన గాజువాక వరకు హుదూద్ ప్రకోపానికి గురికాకుండా ఒక్క రోడ్డు కూడా మిగల్లేదు. ఇక విశాఖ రోడ్లకు ఇరువైపులా ప్రకృతి వర ప్రసాదంగా నిలిచే పచ్చని చెట్లు... చెట్టు కనిపిస్తే ఒట్టు అనే రీతిలో నేలకొరిగాయి. వందల ఏళ్ల నాటి చెట్లతోసహా దాదాపు 80 శాతం చెట్లు కూకటివేళ్లతో కుప్పకూలాయి. సినీ అందాలకు ఎర్ర తివాచీ పరిచే విశాఖ అందాల బీచ్ రోడ్డు భారీగా కోతకు గురైంది. రెండుచోట్ల బీచ్ రోడ్డు కోతకు గురై సముద్రం నీళ్లు పైకి వచ్చేశాయి. బీచ్‌రోడ్డుకు 3 మీ. దిగువన ఉండే సముద్రం నీళ్లు హుదూద్ దాటికి ఉప్పెనగా పొంగి రోడ్డుపైకి చేరుకున్నాయి. ఫిషింగ్ హార్బర్ సమీపంలో రోడ్డు కోతకు గురై రాకపోకలకు నిలిచిపోయాయి. బీచ్‌రోడ్డుకు ఇరువైపులా హోర్డింగులు చెల్లాచెదురయ్యాయి. విశాఖలో వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలైన జగదాంబ జంక్షన్, సిరిపురం, ఆశీలు మెట్ట, ద్వారకానగర్, సీతమ్మధార, పూర్ణా మార్కెట్, వీఐపీ రోడ్డు దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఎయిర్‌పోర్టు.. తుపాను తాకిడికి విశాఖ ఎయిర్‌పోర్టు దారుణంగా దెబ్బతింది. ఎయిర్‌పోర్టు పైకప్పులు ఎగిరిపోయాయి. లాంజ్‌తో సహా అన్ని కార్యాలయాలు 50 శాతానికిపైగా దెబ్బతిన్నాయి. అద్దాలు విరిగిపడ్డాయి. రన్‌వే పూర్తిగా నీటమునిగింది. చాలా చోట్ల రన్‌వే కోతకు గురైంది. రెండురోజుల తరువాతగానీ ఎయిర్‌పోర్టుకు జరిగిన నష్టంపై ఏమీ చెప్పలేమని అధికారులు తెలిపారు. మూడునాలుగు రోజుల వరకు విమానాల రాకపోకలు సాధ్యం కాదని చెప్పారు. ఫిషింగ్ హార్బర్ విధ్వంసం... విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో మత్స్యకారుల ప్రధాన జీవనాధార కేంద్రం ఫిషింగ్ హార్బర్ విధ్వంసానికి గురైంది. హార్బర్లో 60 మర బోట్లు పూర్తిగా దెబ్బతిని నీట మునిగిపోయాయి. అవి ఇక ఎందుకూ పనికిరావని వాటి యజమానులు చెబుతున్నారు. మరో 100 బోట్లు స్పల్పంగా దెబ్బతిన్నాయి. రూ.25 లక్షలు విలువ చేసే ఒక్కో బోటు మీద 8 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు. పూర్తిగా ధ్వంసమైన బోట్ల వల్ల రూ.15 కోట్ల నష్టం వాటిల్లింది. స్వల్పంగా నష్టపోయిన బోట్ల వల్ల దాదాపు రూ.కోటి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. వీటిపై ప్రత్యక్షంగా ఆధారపడుతున్న 1,300మందితోపాటు పరోక్షంగా ఆధారపడుతున్న మరో వెయ్యిమంది ఉపాధికి విఘాతం కలిగింది. తుపాను తాకిడికి సముద్రపు నీరు ముంచెత్తడంతో హార్బర్లో నిల్వ ఉంచిన రూ.లక్షల విలువైన మత్స్య సంపద కొట్టుకుపోయింది.