బీచ్ రోడ్డు నుంచి విశాఖ నగరి ఇలా,కైలాసగిరి నుంచి కొండల నడుమ విశాఖ నగరం
సాక్షి, విశాఖపట్నం: ప్రకృతి సౌందర్యానికి, ఆహ్లాదకర వాతావరణానికి, సౌమ్యులైన మనుషులకు అది నిలయం.. ఒకపక్క అతి సుందర సాగరతీరం.. మరోపక్క రాశులు పోసినట్లుండే పచ్చని పర్వతాలు.. వాటి దిగువన పుష్కలంగా నిక్షిప్తమై ఉండే భూగర్భ జలాలు.. ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే నేరాలు, ఘోరాలకు దూరంగా ఉండే నగరం.. అదృష్టానికి చిరునామాగా పిలుచుకునే సిటీ ఆఫ్ డెస్టినీ.. ఇన్ని ప్రత్యేకతలున్న అరుదైన నగరం మన విశాఖపట్నం.
ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వారినైనా అక్కున చేర్చుకునే నైజం విశాఖ సొంతం. నడి వేసవిలోనూ వేడి జాడ నామమాత్రంగా ఉండే ప్రాంతం. ఇక సముద్రమట్టానికి 45 మీటర్ల ఎత్తుతో భవిష్యత్తులో ముంపు ముప్పేలేని ఏకైక తీర నగరం కూడా ఇదే. దక్షిణాది రాష్ట్రాల్లో ఇన్ని విశిష్టతలు విశాఖకే సొంతం. ఇలా ఆంధ్రప్రదేశ్ కార్యనిర్వాహక రాజధానికి అవసరమైన అన్ని అర్హతలు, హంగులతో వాహ్.. అనిపించే ప్రకృతి ప్రసాదించిన మహానగరం విశాఖపట్నం.
సముద్రానికి 45మీటర్ల ఎత్తులో..
ఇది ప్రకృతి వైపరీత్యాలకు అంతగా ప్రభావితం కాని నగరం కూడా. హుద్‌హుద్‌లాంటి సూపర్ సైక్లోన్‌తో కకావికలమైనా నెలల వ్యవధిలోనే తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకున్న విశిష్ట నగరి. తూర్పు, పశ్చిమ తీరాల్లోని ప్రధాన నగరాలన్నింటికంటే విశాఖ ఎంతో సురక్షితమైనదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఈ నగరం సముద్రమట్టానికి సగటున 45 మీటర్ల ఎత్తులో ఉంది.
చెన్నై 6.7 మీటర్లు, ముంబై 14 మీటర్లు, మంగుళూరు 22 మీటర్ల ఎత్తులోనూ ఉన్నాయి. అంటే విశాఖ నగరంకంటే సముద్రం 45 మీటర్ల దిగువన ఉందన్న మాట. అందువల్ల ఇప్పట్లోనే కాదు.. భవిష్యత్తులోనూ విశాఖకు ఎలాంటి ముంపు ముప్పు ఉండే అవకాశమే లేదు. అదే చెన్నై, ముంబై నగరాలు తరచూ ముంపు బారిన పడుతున్నాయి. నిజానికి.. విశాఖ నగరం భౌగోళికంగా ఎత్తు పల్లాలుగా ఉంటుంది. దీంతో 15–20 సెం.మీ.ల మేర భారీ వర్షం కురిసినా నీరు నిలిచిపోకుండా దిగువనున్న సముద్రంలోకి వెళ్లిపోతుంది.
రాత్రి వేళ విద్యుత్ కాంతుల్లో డాల్ఫిన్ నోస్
ఆహ్లాదకర వాతావరణం..
ఇక వైజాగ్‌లో అన్ని సీజన్లలోనూ ఆహ్లాదకర వాతావరణమే నెలకొంటుంది. ఓ పక్క చల్లగాలులను పంపించే సముద్రం, మరోపక్క పచ్చని పర్వత శ్రేణులు ఇందుకు దోహదం చేస్తున్నాయి. తూర్పు కనుమలు, సింహాచలం కొండ, యారాడ కొండ, కంబాల కొండ, కైలాసగిరి, డాల్ఫిన్‌నోస్ వంటివి పర్యావరణ సమతుల్యతను పదిలంగా ఉంచుతున్నాయి. అంతేకాదు.. ఈ కొండలు భూగర్భ జలాలను సంరక్షిస్తున్నాయి. దీంతో తక్కువ లోతులోనే నీటి లభ్యత ఉంటూ ఏడాది పొడవునా నీటి ఎద్దడికి ఆస్కారం లేకుండా చూస్తున్నాయి.
అలాగే, వేసవిలో విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45–48 డిగ్రీల వరకు నమోదవుతాయి. కానీ విశాఖలో సగటున 36 డిగ్రీలకు మించదు. నడి వేసవిలో మధ్యాహ్నం వేళ ఒకింత ఉష్ణతాపం అనిపించినా సా.4 గంటలకే వాతావరణం చల్లబడిపోవడం ఈ నగరానికున్న ప్రత్యేకత. అందుకే ఇక్కడకు దేశ, విదేశాల నుంచి జనం పోటెత్తుతుంటారు. అయితే, సగటున 68 శాతం హ్యుమిడిటీ నమోదుతో వేసవిలో ఉక్కపోత ఒకింత ఎక్కువగా ఉంటుంది. మరోవైపు.. శీతాకాలంలోనూ సాధారణ చలే తప్ప ఎముకలు కొరికే చలి విశాఖలో ఉండదు.
ఉప్పెనల ముప్పేలేదు..
తీర ప్రాంతంలో ఉన్నప్పటికీ విశాఖ నగరానికి ఉప్పెనల ముప్పులేదు. ఎటువైపు నుంచీ వరద గాని, ఉప్పెన గాని ముంచెత్తే అవకాశంలేదు. ఇది కూడా విశాఖ నగరానికి ప్రకృతి పరంగా మేలుచేసే అంశంగా నిపుణులు చెబుతుంటారు. ఇక విశాఖలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల సీజనులో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయి. ఏడాదిలో సగటున 53 రోజులు వర్షిస్తాయి. ఇలా దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా అన్ని సీజన్లలోనూ అనుకూల వాతావరణం కలిగిన ఏకైక నగరంగా విశాఖపట్నం ఖ్యాతి గడించింది. రానున్న వందేళ్లలో కొచ్చి 2.3 అడుగులు, పారదీప్ 1.93 ముంబై 1.90, చెన్నై 1.87 అడుగులు, మంగుళూరు 1.87 అడుగుల చొప్పున సముద్రమట్టాలు పెరుగుతాయని.. అయితే, ఈ నగరాలన్నిటికంటే తక్కువగా విశాఖలో 1.77 అడుగులు మాత్రమే సముద్రమట్టం పెరిగే అవకాశముందని నిపుణుల అంచనా. ఇది కూడా విశాఖకు ఎంతో మేలుచేసే అంశం.
అన్ని కాలాలకు అనువైన సిటీ
విశాఖపట్నం అన్ని కాలాలకు అనువైన సిటీ. శీతాకాలంలో చలి, వర్షాకాలంలో వానలు, వేసవిలో ఎండలు ఎక్కువ ప్రభావం చూపవు. అందుకే విశాఖలో మోడరేట్ క్లైమేట్ ఉంటుంది. సమీపంలో ఉన్న పర్వతాలు విశాఖకు అదనపు ఆభరణాలు. వీటివల్ల భూగర్భ జలాలు సంరక్షించబడుతున్నాయి. సముద్రమట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఈ నగరం ఉండడంతో ముంపు ముప్పుగాని, ఉప్పెనల భయంగాని లేదు. ముంబై, చెన్నై, కొచ్చి, మంగుళూరులాంటి తీరప్రాంత నగరాల మాదిరిగా సముద్రమట్టాల పెరుగుదల బెడద కూడా విశాఖకు లేదు.
– ఓఎస్‌ఆర్‌యూ భానుకుమార్, వాతావరణం, సముద్ర అధ్యయన విభాగపు పూర్వ అధిపతి, ఏయూ, విశాఖ
Comments
Please login to add a commentAdd a comment