విశాఖ విలవిల
* విశిష్టతలను ధ్వంసం చేసిన హుదూద్
* వ్యవస్థలన్నీ ఛిన్నాభిన్నం, నగరజీవనం అస్తవ్యస్థం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సిటీ ఆఫ్ డెస్టినీ... నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ఆర్థిక, పర్యాటక రాజధానిగా వర్ణిస్తున్న నగరం... అమెరికా అధ్యక్షుడు ఒబామాతో చర్చల సందర్భంగా ప్రధాని మోదీ ప్రస్తావించిన స్మార్ట్‌సిటీ... అలాంటి విశాఖపట్నాన్ని హుదూద్ తుపాను భయానకంగా కుదిపేసింది. ఓ రాకాసి చేయి పట్టుకుని ఊపేసినట్లు ఊపేసింది. పెను విధ్వంసం కళ్లకు కట్టింది. మధ్యయుగాల్లో విదేశీ దురాక్రమణల్లో ధ్వంసమైన భారతీయ నగరాలను గుర్తుకు తెచ్చేలా ప్రకృతి ప్రకోపానికి గురైంది. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని ప్రకృతి విధ్వంసానికి మూగసాక్షిగా నిలుస్తోంది.
విశాఖ విశిష్టతలు గాలికి...
హుదూద్ తుపాను విశాఖలో విధ్వంసం సృష్టించింది. విశాఖ నగరాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే విశిష్టతల్ని ఘోరంగా దెబ్బతీసింది. విశాఖ ప్రత్యేక గుర్తింపునకు ప్రధాన కారణమైన సముద్రమే ఈ పెను విధ్వంసానికి కూడా కారణం. విశాలమైన విశాఖ రోడ్లు చిన్నాభిన్నమయ్యాయి. తూర్పున సాగర్ నగర్ నుంచి దక్షిణాన గాజువాక వరకు హుదూద్ ప్రకోపానికి గురికాకుండా ఒక్క రోడ్డు కూడా మిగల్లేదు. ఇక విశాఖ రోడ్లకు ఇరువైపులా ప్రకృతి వర ప్రసాదంగా నిలిచే పచ్చని చెట్లు... చెట్టు కనిపిస్తే ఒట్టు అనే రీతిలో నేలకొరిగాయి. వందల ఏళ్ల నాటి చెట్లతోసహా దాదాపు 80 శాతం చెట్లు కూకటివేళ్లతో కుప్పకూలాయి.
సినీ అందాలకు ఎర్ర తివాచీ పరిచే విశాఖ అందాల బీచ్ రోడ్డు భారీగా కోతకు గురైంది. రెండుచోట్ల బీచ్ రోడ్డు కోతకు గురై సముద్రం నీళ్లు పైకి వచ్చేశాయి. బీచ్‌రోడ్డుకు 3 మీ. దిగువన ఉండే సముద్రం నీళ్లు హుదూద్ దాటికి ఉప్పెనగా పొంగి రోడ్డుపైకి చేరుకున్నాయి. ఫిషింగ్ హార్బర్ సమీపంలో రోడ్డు కోతకు గురై రాకపోకలకు నిలిచిపోయాయి. బీచ్‌రోడ్డుకు ఇరువైపులా హోర్డింగులు చెల్లాచెదురయ్యాయి. విశాఖలో వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలైన జగదాంబ జంక్షన్, సిరిపురం, ఆశీలు మెట్ట, ద్వారకానగర్, సీతమ్మధార, పూర్ణా మార్కెట్, వీఐపీ రోడ్డు దారుణంగా దెబ్బతిన్నాయి.
దెబ్బతిన్న ఎయిర్‌పోర్టు..
తుపాను తాకిడికి విశాఖ ఎయిర్‌పోర్టు దారుణంగా దెబ్బతింది. ఎయిర్‌పోర్టు పైకప్పులు ఎగిరిపోయాయి. లాంజ్‌తో సహా అన్ని కార్యాలయాలు 50 శాతానికిపైగా దెబ్బతిన్నాయి. అద్దాలు విరిగిపడ్డాయి. రన్‌వే పూర్తిగా నీటమునిగింది. చాలా చోట్ల రన్‌వే కోతకు గురైంది. రెండురోజుల తరువాతగానీ ఎయిర్‌పోర్టుకు జరిగిన నష్టంపై ఏమీ చెప్పలేమని అధికారులు తెలిపారు. మూడునాలుగు రోజుల వరకు విమానాల రాకపోకలు సాధ్యం కాదని చెప్పారు.
ఫిషింగ్ హార్బర్ విధ్వంసం...
విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో మత్స్యకారుల ప్రధాన జీవనాధార కేంద్రం ఫిషింగ్ హార్బర్ విధ్వంసానికి గురైంది. హార్బర్‌లో 60 మర బోట్లు పూర్తిగా దెబ్బతిని నీట మునిగిపోయాయి. అవి ఇక ఎందుకూ పనికిరావని వాటి యజమానులు చెబుతున్నారు. మరో 100 బోట్లు స్పల్పంగా దెబ్బతిన్నాయి. రూ.25 లక్షలు విలువ చేసే ఒక్కో బోటు మీద 8 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నారు.
పూర్తిగా ధ్వంసమైన బోట్ల వల్ల రూ.15 కోట్ల నష్టం వాటిల్లింది. స్వల్పంగా నష్టపోయిన బోట్ల వల్ల దాదాపు రూ.కోటి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. వీటిపై ప్రత్యక్షంగా ఆధారపడుతున్న 1,300మందితోపాటు పరోక్షంగా ఆధారపడుతున్న మరో వెయ్యిమంది ఉపాధికి విఘాతం కలిగింది. తుపాను తాకిడికి సముద్రపు నీరు ముంచెత్తడంతో హార్బర్‌లో నిల్వ ఉంచిన రూ.లక్షల విలువైన మత్స్య సంపద కొట్టుకుపోయింది.