ఇక 24 గంటలూ రాకపోకలు.. | Visakhapatnam Airport to be an Open Sky Airport | Sakshi
Sakshi News home page

ఇక 24 గంటలూ రాకపోకలు..

Jan 8 2025 5:20 AM | Updated on Jan 8 2025 5:36 AM

Visakhapatnam Airport to be an Open Sky Airport

ఓపెన్‌ స్కై ఎయిర్‌పోర్ట్‌గా విశాఖ విమానాశ్రయం!

ప్రభుత్వానికి ప్రతిపాదనలు సూచించిన ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు 

ఎమిరేట్స్, ఖతార్లకు కనెక్టివిటీ పెరిగితే ఇతర దేశాలకూ అనుసంధానం 

రాత్రి సమయంలోనూ కనెక్టివిటీ ఫ్లైట్స్‌తో రాకపోకలు పెరిగే అవకాశం 

విమాన సర్వీసులతో పాటు రాకపోకల్లోనూ గణనీయంగా వృద్ధి సాధిస్తూ దూసుకుపోతున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రూపు సంతరించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈస్ట్‌కోస్ట్‌లో ఓపెన్‌ స్కై ఎయిర్‌పోర్టుగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓపెన్‌ స్కై పాలసీలో భాగంగా ఎయిర్‌పోర్టుకు ఈ గుర్తింపు లభిస్తే..24 గంటల పాటు విమానాలు తిరుగుతాయి. 

కనెక్టివిటీ విమానాలు పెరిగితే..విదేశీ సర్వీసులు గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా వైజాగ్‌ ఎయిర్‌పోర్టుని హబ్‌ అండ్‌ స్పూఫ్‌ మోడల్‌లో తీర్చిదిద్దేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. 

సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి ఎయిర్‌ కనెక్టివిటీ విస్తరిస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ ఆక్యుపెన్సీ 90% నమోదవుతోంది. మూడేళ్ల నుంచి ఐటీ, పారిశ్రామిక, పోర్టు ఆధారిత పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్‌ దిగ్గజ సంస్థలు విశాఖవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత కనెక్టివిటీ పెంచితే..అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పథంలో దూసుకుపోనుంది. 

ఇందులో భాగంగా.. విశాఖ ఎయిర్‌పోర్టుని ఓపెన్‌ స్కై పాలసీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ పాలసీ అమలు చేయడం ద్వారా..కొత్త సెక్టార్లలో ఆపరేషన్స్‌ పై విమానయాన సంస్థలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఓపెన్‌ స్కై పాలసీ 1944 అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందం ప్రకారం విదేశీ విమానయాన సంస్థలకు సర్వీసులు నడిపేందుకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించవచ్చు.

కీలకంగా ఎయిర్‌ కనెక్టివిటీ..  
ప్రతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ విదేశాలకు కనెక్టివిటీ పెంచేందుకు అనుగుణంగా సర్వీసులు పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. డిమాండ్‌ ఉన్న కొత్త సెక్టార్ల వైపు విమానయాన సంస్థలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి సర్వీసులు గణనీయంగా పెరిగే రోజులు సమీపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వింటర్‌ షెడ్యూల్‌ ప్రకారం 70 సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. 

ఇండిగో, ఎయిర్‌ ఏషియా, ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండియా వన్‌ ఎయిర్, స్కూట్, థాయ్‌ ఎయిర్‌ ఏషియా సంస్థలు ఇంటర్నేషనల్, డొమెస్టిక్‌ సేవలు నిర్వహిస్తున్నాయి. డిమాండ్‌ ఆధారంగా కొత్త కారిడార్‌లకు విస్తరించేందుకు బై లేటరల్‌ మోడల్‌లో విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రారంభించిన డిజీ యాత్ర వంటి సౌకర్యాలు ఎయిర్‌ ప్యాసింజర్‌లకు పెద్ద వెసులుబాటు కల్పిస్తున్నాయి. 

ఈ క్రమంలో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మార్గాల్లో డిమాండ్‌ మరింత పెరిగింది. విశాఖ నుంచి రోజు సగటున 8000 మంది రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతి నెలా సగటున విమాన ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య 2.50 లక్షలకు చేరుకుంది. గతేడాదితో పోలిస్తే 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ పెరిగిందని ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్త కనెక్టివిటీ సర్వీసులు పెరిగితే..ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలున్నాయి.

ప్రధాన దేశాలకు అనుసంధానిస్తే.. 
ఓపెన్‌ స్కై ఎయిర్‌పోర్టుగా మార్చితే..ప్ర«దాన దేశాలకు విశాఖ నుంచి అనుసంధానం చేసే విమాన సర్వీసులు మొదలవుతాయి. ప్రస్తుతం సింగపూర్, మలేషియా, బ్యాంకాక్‌లకు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. ఓపెన్‌ స్కైగా లేకపోవడం వల్ల..మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు అనుసంధానం చేసే విధంగా ఎయిర్‌ కనెక్టివిటీ సర్వీసులు రాలేదు. 

ఒకవేళ దీన్ని అమలు చేస్తే ఎమిరేట్స్, ఖతార్, ఒమాన్, ఎతియాడ్, కువైట్, సౌదీ ఎయిర్‌లైన్స్‌ విశాఖ వైపు అడుగులు వేస్తాయి. ఎమిరేట్స్, ఎతియాడ్‌ ఎయిర్‌లైన్స్‌ విశాఖ నుంచి సర్వీసులు ప్రారంభిస్తే యూరప్, యూఎస్‌ఏ, ఆఫ్రికా దేశాలకు విమాన సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. రాయ్‌పూర్, భువనేశ్వర్, విజయవాడ, చెన్నై కి హబ్‌ అండ్‌ స్పూఫ్‌గా సర్వీసులు రాత్రి పూట నడిపేందుకు వీలుంటుంది. 

యూరప్, ఆఫ్రికా, యూఎస్‌ఏ దేశాల నుంచి ఎక్కువగా సర్వీసులన్నీ రాత్రి సమయంలోనే విశాఖ చేరుకుంటాయి. ఆ సమయంలో హబ్‌ అండ్‌ స్పూఫ్‌ మోడల్‌లో సమీప నగరాలకు కనెక్టివిటీ ఫ్లైట్స్‌ కూడా గణనీయంగా పెరుగుతాయి. ఇవన్నీ వీలైనంత త్వరగానే అందుబాటులోకి రానున్నాయి.  

ప్రాంతీయ విమానయాన కేంద్రంగా.. 
ఏపీలో అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా ఉన్న విశాఖని ఓపెన్‌ స్కై ఎయిర్‌పోర్ట్‌గా మార్చితే విదేశీ విమానయాన సంస్థలకు సులభంగా యాక్సెస్‌ను అందించగలం. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఇప్పుడు ఓపెన్‌ స్కై పాలసీ కింద ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాకు విదేశీ సర్వీసుల్ని అనుమతిస్తోంది. ఈస్ట్‌ కోస్ట్‌లో విశాఖను ఓపెన్‌ స్కైగా మార్చితే ఎయిర్‌ కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది. 

ఈస్ట్‌ కోస్ట్‌ పరిధిలో విశాఖ ప్రాంతీయ విమానయాన కేంద్రంగా మారుతుంది. అందుకే ఓపెన్‌ స్కై పాలసీని వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఎందుకంటే విశాఖ విమానాశ్రయం నుంచి ప్రతీ నెల దేశీయ ప్రయాణికుల సంఖ్యతో పాటు విదేశీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తే.. అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. – విజయ్‌మోహన్, ఎయిర్‌పోర్టు అడ్వైజరీ బోర్డ్‌ మెంబర్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement