Air connectivity
-
ఆర్థిక సర్వే
అన్ని చేతులూ కలిస్తేనే తయారీ దిగ్గజంభారత్ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం, ప్రైవేటు రంగం, విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) సంస్థలు, ఆర్థిక సంస్థల మధ్య సమన్వయంతో కూడిన సహకారాత్మక చర్యలు అవసరమని ఆర్థిక సర్వే సూచించింది. నియంత్రణలు సడలించడం, అవసరమైన నైపుణ్యాలు, ఉపాధి కల్పన వ్యూహాలు అమలు చేయడం, ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకమైన మద్దతు చర్యలతో భారత పరిశ్రమల పోటీతత్వాన్ని పెంచొచ్చని అభిప్రాయపడింది. అప్పుడు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, సవాళ్లను భారత సంస్థలు ఎదుర్కొని రాణించగలవని వివరించింది. బంగారం తగ్గొచ్చు.. వెండి పెరగొచ్చు బంగారం ధరలు ఈ ఏడాది తగ్గొచ్చని, వెండి ధరలు పెరగొచ్చని ఆర్థిక సర్వే అంచనాలు వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్ కమోడిటీ మార్కెట్ అవుట్‌లుక్ 2024 నివేదికను ప్రస్తావిస్తూ. కమోడిటీ ధరలు 2025లో 5.1 శాతం, 2026లో 1.7 శాతం తగ్గుతాయన్న అంచనాలను ప్రస్తావించింది. మెటల్స్, వ్యవసాయ ముడి సరకుల ధరలు స్థిరంగా ఉంటాయని, చమురు ధరలు తగ్గొచ్చని, సహజ వాయువు ధరలు పెరగొచ్చని పేర్కొంది. బంగారం ధరలు తగ్గడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపించొచ్చని తెలిపింది. దేశం దిగుమతి చేసుకునే కమోడిటీల ధరలు తగ్గడం అది సానుకూలమని, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను తగ్గిస్తుందని అభిప్రాయపడింది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలి.. ఈవీల తయారీలో స్వావలంబన ఎలక్ట్రిక్ వాహనాలు, ఎల్రక్టానిక్స్ తయారీలో స్వావలంబన దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెప్పింది. ముడి సరుకులు, విడిభాగాల కోసం చైనా తదితర కొన్ని దేశాలపై ఎక్కువగా ఆధారపడడాన్ని తగ్గించాలని, సరఫరా వ్యవస్థలోని రిస్‌్కలను తొలగించే చర్యలు చేపట్టాలని సూచించింది. కీలక విడిభాగాలు, ముడి సరుకులపై అంతర్జాతీయంగా చైనా ఆధిపత్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. సంప్రదాయ వాహనంతో పోల్చి చూసినప్పుడు ఈవీల తయారీలో ఆరు రెట్లు అధికంగా ఖనిజాలను వినియోగించాల్సిన పరిస్థితిని ప్రస్తావించింది. ఈ ఖనిజాల్లో చాలా వరకు మన దగ్గర లభించకపోవడాన్ని గుర్తు చేసింది. ‘‘సోడియం అయాన్, సాలిడ్ స్టేట్ బ్యాటరీలు తదితర అత్యాధునిక బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానాలకు పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) నిధులు పెంచడం ద్వారా స్వావలంబన ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించాలి. ఈ విభాగంలో మేధో హక్కులను సంపాదించుకోవాలి. బ్యాటరీ రీసైక్లింగ్ సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలి. దీనివల్ల భారత ఆటోమొబైల్ రంగానికి దీర్ఘకాల ప్రయోజనాలు ఒనగూరుతాయి’’అని ఆర్థిక సర్వే సూచించింది. మరోవైపు పర్యావరణ అనుకూల ఇంధనాలకు మళ్లే విషయంలోనూ చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణలు సడలించడం ద్వారా దేశీ పరిశ్రమకు మద్దతుగా నిలవాలని సూచించింది. పీఎల్ఐ, ఫేమ్ పథకాలను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఈవీల అవసరాలను తీర్చే విధానాలపై దృష్టి సారించాలని పేర్కొంది. వారానికి 60 గంటలు మించి పని.. ఆరోగ్యానికి హానికరం.. వారానికి 60 గంటలకు మించి పని చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఎకనమిక్ సర్వే పేర్కొంది. ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చోవడమనేది మానసిక ఆరోగ్యానికి హానికరమని వివరించింది. రోజూ 12 గంటలకు పైగా డెస్క్‌లోనే గడిపే వారు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఉద్యోగి ఉత్పాదకతకు ఆఫీసులో గడిపిన సమయమే కొలమానమని అభిప్రాయం నెలకొన్నప్పటికీ మెరుగైన జీవన విధానాలు, వర్క్‌ప్లేస్ సంస్కృతి, కుటుంబ సంబంధాలు మొదలైనవి కూడా ఉత్పాదకతకు కీలకమని సేపియన్ ల్యాబ్స్ సెంటర్ అధ్యయన నివేదికలో వెల్లడైనట్లు ఆర్థిక సర్వే వివరించింది. వారానికి 70–90 గంటలు పని చేయాలన్న ఇన్ఫీ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్అండ్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న తరుణంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. మెరుగుపడిన విమాన కనెక్టివిటీ కొత్త విమానాశ్రయాలు, ఉడాన్ స్కీముతో దేశీయంగా ఎయిర్ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య నిర్దేశించిన రూ. 91,000 కోట్ల పెట్టుబడి వ్యయాల లక్ష్యంలో ఎయిర్పోర్ట్ డెవలపర్లు, ఆపరేటర్లు దాదాపు 91 శాతాన్ని ఖర్చు చేసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్‌లో ఏవియేషన్ మార్కెట్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని, భారతీయ ఎయిర్‌లైన్స్ భారీ స్థాయిలో కొత్త విమానాలకు ఆర్డర్లిచ్చాయని సర్వే వివరించింది. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) పరిశ్రమకు సంబంధించి భారత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేయాలంటూ తయారీ కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపింది. రియల్ ఎస్టేట్‌లో బలమైన డిమాండ్ ఆర్థిక స్థిరత్వం, రహదారులు, మెట్రో నెట్‌వర్క్‌ల కల్పన వంటివి దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో డిమాండ్‌ను పెంచినట్టు ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. రియల్ ఎస్టేట్ రంగ నియంత్రణ కోసం ‘రెరా’తోపాటు, జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం ఈ రంగానికి మేలు చేసినట్టు తెలిపింది. 2036 నాటికి ఇళ్లకు డిమాండ్ 9.3 కోట్ల యూనిట్లకు చేరుకుంటుందన్న పలు నివేదికల అంచనాలను ప్రస్తావించింది. 2024 మొదటి ఆరు నెలల్లో ఇళ్ల అమ్మకాలు 11 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడాన్ని గుర్తు చేసింది. రెరా రాకతో రియల్ఎస్టేట్ రంగంలో మోసాల నుంచి రక్షణ లభించిందని, పారదర్శకత, సకాలంలో ప్రాజెక్టుల పూర్తికి దారి చూపిందని వివరించింది. ఇళ్ల ప్లాన్లకు ఆన్లైన్ అనుమతులుతో జాప్యం తగ్గి, పారదర్శకత పెరిగినట్టు తెలిపింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు(రీట్లు) ప్రోత్సాహం వాణిజ్య రియల్ ఎస్టేట్‌కు సానుకూలిస్తుందని అభిప్రాయపడింది. 11.6 బిలియన్ డాలర్లకు డేటా సెంటర్ మార్కెట్మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా డేటా సెంటర్ మార్కెట్ 2032 నాటికి 11.6 బిలియన్ డాలర్ల స్థాయికి చేరవచ్చని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. 2023లో ఇది 4.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఐటీ, డిజిటల్ సేవల వ్యవస్థ పటిష్టంగా ఉండటం, రియల్ ఎస్టేట్ ధరలు తక్కువగా వల్ల డేటా సెంటర్ల ఏర్పాటు వ్యయాలు చౌకగా ఉండటం భారత్‌కు లాభిస్తుందని పేర్కొంది. డేటా సెంటర్ ఏర్పాటుకు ఆ్రస్టేలియాలో సగటున ప్రతి మెగావాట్‌కు వ్యయాలు 9.17 మిలియన్ డాలర్లుగా, అమెరికాలో 12.73 మిలియన్ డాలర్లుగా ఉండగా భారత్‌లో 6.8 మిలియన్ డాలర్లేనని సర్వే వివరించింది. జీసీసీల్లో ’గ్లోబల్’ ఉద్యోగాలుభారత్లో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) అంతర్జాతీయ కార్యకలాపాలకి సంబంధించి నియమించుకునే (గ్లోబల్) ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగనుందని ఆర్థిక సర్వే తెలిపింది. 2030 నాటికి ఇది నాలుగు రెట్లు పెరిగి 30,000కు చేరుతుందని వివరించింది. ప్రస్తుతం ఈ సంఖ్య 6,500గా ఉంది. గత దశాబ్ద కాలంలో భారత్‌లో జీసీసీ వ్యవస్థ పురోగమించిందని, ప్రోడక్ట్ మేనేజర్లు, ఆర్కిటెక్టుల్లాంటి హై–ఎండ్ ఇంజినీరింగ్ ఉద్యోగాలను కూడా టెక్ నిపుణులు దక్కించుకుంటున్నారని సర్వే తెలిపింది. 2019లో 1,430గా ఉన్న జీసీసీల సంఖ్య 2024 నాటికి 1,700కు పెరిగిందని, వీటిల్లో దాదాపు 19 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని పేర్కొంది.ఏఐతో ఉద్యోగాలకు రిస్కే కృత్రిమ మేథతో (ఏఐ) ఎంట్రీ స్థాయి ఉద్యోగాలకు ముప్పు ఉంటుందని, ముఖ్యంగా జీవనోపాధి కోసం ఉద్యోగాల మీదే ఎక్కువగా ఆధారపడే భారత్‌లాంటి దేశాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సరైన ప్రణాళికలు లేకుండా ఉద్యోగుల స్థానాన్ని ఏఐతో భర్తీ చేసేందుకు కంపెనీలు తొందరపడటం శ్రేయస్కరం కాదని ఐఎంఎఫ్ నివేదికను ఉటంకిస్తూ, సూచించింది. ఒకవేళ అలా చేసిన పక్షంలో ఉపాధి కోల్పోయిన వర్కర్లకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకుని, కార్పొరేట్ల లాభాలపై మరింతగా పన్నులు విధించడం, ఇతరత్రా పాలసీపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని వివరించింది. ఎఫ్డీలకు అన్ని అడ్డంకులు తొలగాలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) భారత్ మరింతగా ఆకర్షించేందుకు వీలుగా అన్ని అవరోధాలను తొలగించాలని, పన్నుల పరమైన నిలకడను తీసుకురావాలని ఆర్థిక సర్వే సూచించింది. సమీప కాలంలో వడ్డీ రేట్లు, ద్రవ్యల్బోణ ఒత్తిళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నా కానీ, దీర్ఘకాలానికి భారత్ ఎఫ్డీలకు అనుకూల కేంద్రంగా కొనసాగుతుందని అభిప్రాయపడింది. బలమైన దేశ ఆర్థిక మూలాలు, ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు, కన్జ్యూమర్ మార్కెట్ వృద్ధి సానుకూలతలుగా పేర్కొంది. ఇప్పటికే చాలా రంగాల్లో ఎఫ్డీలను ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తున్నట్టు తెలిపింది. డిజిటల్ కనెక్టివిటీకి 5జీ దన్నుదేశవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో 5జీ సర్విసులను ప్రవేశపెట్టడంతో పాటు టెలికం మౌలిక సదుపాయాలను, యూజర్ అనుభూతిని మెరుగుపర్చేందుకు నియంత్రణ సంస్థ తీసుకుంటున్న చర్యలతో డిజిటల్ కనెక్టివిటీ మెరుగుపడినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. ప్రస్తుతం 783 జిల్లాలకు గాను 779 జిల్లాల్లో 5జీ సేవలు అందుబాటులో ఉన్నట్లు వివరించింది. భారత్ నెట్ ప్రాజెక్టు కింద 2024 డిసెంబర్ నాటికి 6.92 లక్షల కి.మీ. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) వేసినట్లు పేర్కొంది. -
ఇక 24 గంటలూ రాకపోకలు..
విమాన సర్వీసులతో పాటు రాకపోకల్లోనూ గణనీయంగా వృద్ధి సాధిస్తూ దూసుకుపోతున్న విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రూపు సంతరించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈస్ట్‌కోస్ట్‌లో ఓపెన్ స్కై ఎయిర్‌పోర్టుగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓపెన్ స్కై పాలసీలో భాగంగా ఎయిర్‌పోర్టుకు ఈ గుర్తింపు లభిస్తే..24 గంటల పాటు విమానాలు తిరుగుతాయి. కనెక్టివిటీ విమానాలు పెరిగితే..విదేశీ సర్వీసులు గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా వైజాగ్ ఎయిర్‌పోర్టుని హబ్ అండ్ స్పూఫ్ మోడల్లో తీర్చిదిద్దేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానాశ్రయం నుంచి ఎయిర్ కనెక్టివిటీ విస్తరిస్తోంది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఆక్యుపెన్సీ 90% నమోదవుతోంది. మూడేళ్ల నుంచి ఐటీ, పారిశ్రామిక, పోర్టు ఆధారిత పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్ దిగ్గజ సంస్థలు విశాఖవైపు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరింత కనెక్టివిటీ పెంచితే..అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి పథంలో దూసుకుపోనుంది. ఇందులో భాగంగా.. విశాఖ ఎయిర్‌పోర్టుని ఓపెన్ స్కై పాలసీ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ పాలసీ అమలు చేయడం ద్వారా..కొత్త సెక్టార్లలో ఆపరేషన్స్ పై విమానయాన సంస్థలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఓపెన్ స్కై పాలసీ 1944 అంతర్జాతీయ పౌర విమానయాన ఒప్పందం ప్రకారం విదేశీ విమానయాన సంస్థలకు సర్వీసులు నడిపేందుకు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించవచ్చు.కీలకంగా ఎయిర్ కనెక్టివిటీ.. ప్రతి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ విదేశాలకు కనెక్టివిటీ పెంచేందుకు అనుగుణంగా సర్వీసులు పెంచాల్సిన సమయం ఆసన్నమైంది. డిమాండ్ ఉన్న కొత్త సెక్టార్ల వైపు విమానయాన సంస్థలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి సర్వీసులు గణనీయంగా పెరిగే రోజులు సమీపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వింటర్ షెడ్యూల్ ప్రకారం 70 సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇండిగో, ఎయిర్ ఏషియా, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండియా వన్ ఎయిర్, స్కూట్, థాయ్ ఎయిర్ ఏషియా సంస్థలు ఇంటర్నేషనల్, డొమెస్టిక్ సేవలు నిర్వహిస్తున్నాయి. డిమాండ్ ఆధారంగా కొత్త కారిడార్లకు విస్తరించేందుకు బై లేటరల్ మోడల్లో విమానయాన సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇటీవల విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రారంభించిన డిజీ యాత్ర వంటి సౌకర్యాలు ఎయిర్ ప్యాసింజర్లకు పెద్ద వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై మార్గాల్లో డిమాండ్ మరింత పెరిగింది. విశాఖ నుంచి రోజు సగటున 8000 మంది రాకపోకలు సాగిస్తున్నారు. ప్రతి నెలా సగటున విమాన ప్రయాణాలు చేస్తున్న వారి సంఖ్య 2.50 లక్షలకు చేరుకుంది. గతేడాదితో పోలిస్తే 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ పెరిగిందని ఎయిర్ పోర్ట్ అథారిటీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్త కనెక్టివిటీ సర్వీసులు పెరిగితే..ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలున్నాయి.ప్రధాన దేశాలకు అనుసంధానిస్తే.. ఓపెన్ స్కై ఎయిర్‌పోర్టుగా మార్చితే..ప్ర«దాన దేశాలకు విశాఖ నుంచి అనుసంధానం చేసే విమాన సర్వీసులు మొదలవుతాయి. ప్రస్తుతం సింగపూర్, మలేషియా, బ్యాంకాక్‌లకు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. ఓపెన్ స్కైగా లేకపోవడం వల్ల..మిడిల్ ఈస్ట్ దేశాలకు అనుసంధానం చేసే విధంగా ఎయిర్ కనెక్టివిటీ సర్వీసులు రాలేదు. ఒకవేళ దీన్ని అమలు చేస్తే ఎమిరేట్స్, ఖతార్, ఒమాన్, ఎతియాడ్, కువైట్, సౌదీ ఎయిర్‌లైన్స్ విశాఖ వైపు అడుగులు వేస్తాయి. ఎమిరేట్స్, ఎతియాడ్ ఎయిర్‌లైన్స్ విశాఖ నుంచి సర్వీసులు ప్రారంభిస్తే యూరప్, యూఎస్ఏ, ఆఫ్రికా దేశాలకు విమాన సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. రాయ్‌పూర్, భువనేశ్వర్, విజయవాడ, చెన్నై కి హబ్ అండ్ స్పూఫ్గా సర్వీసులు రాత్రి పూట నడిపేందుకు వీలుంటుంది. యూరప్, ఆఫ్రికా, యూఎస్ఏ దేశాల నుంచి ఎక్కువగా సర్వీసులన్నీ రాత్రి సమయంలోనే విశాఖ చేరుకుంటాయి. ఆ సమయంలో హబ్ అండ్ స్పూఫ్ మోడల్లో సమీప నగరాలకు కనెక్టివిటీ ఫ్లైట్స్ కూడా గణనీయంగా పెరుగుతాయి. ఇవన్నీ వీలైనంత త్వరగానే అందుబాటులోకి రానున్నాయి. ప్రాంతీయ విమానయాన కేంద్రంగా.. ఏపీలో అతిపెద్ద ఎయిర్‌పోర్టుగా ఉన్న విశాఖని ఓపెన్ స్కై ఎయిర్‌పోర్ట్‌గా మార్చితే విదేశీ విమానయాన సంస్థలకు సులభంగా యాక్సెస్‌ను అందించగలం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పుడు ఓపెన్ స్కై పాలసీ కింద ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాకు విదేశీ సర్వీసుల్ని అనుమతిస్తోంది. ఈస్ట్ కోస్ట్‌లో విశాఖను ఓపెన్ స్కైగా మార్చితే ఎయిర్ కనెక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది. ఈస్ట్ కోస్ట్ పరిధిలో విశాఖ ప్రాంతీయ విమానయాన కేంద్రంగా మారుతుంది. అందుకే ఓపెన్ స్కై పాలసీని వైజాగ్ ఎయిర్‌పోర్టులో అమలు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఎందుకంటే విశాఖ విమానాశ్రయం నుంచి ప్రతీ నెల దేశీయ ప్రయాణికుల సంఖ్యతో పాటు విదేశీ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరిన్ని సర్వీసులు అందుబాటులోకి వస్తే.. అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. – విజయ్‌మోహన్, ఎయిర్‌పోర్టు అడ్వైజరీ బోర్డ్ మెంబర్ -
ఉత్తరాఖండ్‌కు మూడు ఎయిర్ పోర్టులు, 21 హెలీప్యాడ్లు!
ఉత్తరాఖండ్ ఎయిర్ కనెక్టివిటీ కొత్త రెక్కలను సంతరించుకోబోతోంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తరాఖండ్‌లోని విమానాశ్రయాల సంఖ్యను ఒకటి నుండి మూడుకు, హెలిప్యాడ్ల సంఖ్యను 10 నుండి 21కి పెంచే ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. డెహ్రాడూన్ ఎయిర్‌పోర్టు విస్తరణ, మొదటి దశ కింద హెలిపోర్టుల నిర్వహణ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో ఎయిర్‌పోర్టులు, హెలిపోర్టుల పనులు త్వరలో పూర్తి కానున్నాయి. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో గల ఏకైక జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుంచి 2024లో రోజువారీ విమాన సర్వీసులను ప్రారంభించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. గతంలో డెహ్రాడూన్ విమానాశ్రయానికి దేశంలోని మూడు నగరాలతో మాత్రమే కనెక్టివిటీ ఉండేది. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ దాదాపు నాలుగున్నర రెట్లు పెరిగింది. ప్రస్తుతం డెహ్రాడూన్ విమానాశ్రయ ఎయిర్ కనెక్టివిటీ దేశంలోని మూడు నగరాల నుండి 13 నగరాలకు చేరింది. 2014 వరకు ఈ విమానాశ్రయం నుండి 40 విమానాలు మాత్రమే నడిచేవి. 2024 చివరి నాటికి ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే విమానాల సంఖ్య 200కి పెరగనుంది. గత పదేళ్లలో డెహ్రాడూన్ విమానాశ్రయ కార్యకలాపాల్లో దాదాపు 130 శాతం పెరుగుదల నమోదైంది. త్వరలో ఉత్తరాఖండ్‌లో నూతన హెలిపోర్ట్లతో పాటు నూతన విమానాశ్రయాలు రానున్నాయి. డెహ్రాడూన్‌తో పాటు ఉత్తరాఖండ్‌లోని పంత్నగర్, పితోర్‌గఢ్‌లలో విమానాశ్రయాల ఏర్పాటుకు విమానయాన మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తున్నదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో ఏడు హెలిపోర్ట్‌లు ప్రారంభమయ్యాయి. వీటిలో అల్మోరా, చిన్యాలిసౌర్, గౌచర్, సహస్త్రధార, న్యూ తెహ్రీ, శ్రీనగర్, హల్ద్వానీ మొదలైనవి ఉన్నాయి. ధార్చుల, హరిద్వార్, జోషిమా, ముస్సోరీ, నైనిటాల్, రామ్‌నగర్‌లో కొత్త హెలిపోర్ట్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఒక విమానాశ్రయం, ఏడు హెలిపోర్టులను ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. బాగేశ్వర్, చంపావత్, లాన్స్‌డౌన్, మున్సియరి, త్రియుగినారాయణ్‌లలో ఐదు కొత్త హెలిపోర్ట్‌లను ప్రారంభించే ప్రణాళిక సిద్ధంగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఉత్తరాఖండ్‌లో విమానాశ్రయాల సంఖ్య మూడుకు, హెలిపోర్టుల సంఖ్య 21కి చేరనుంది. -
విమానయానం మరింత భారం
టికెట్లపై 2 శాతం ప్రాంతీయ కనెక్టివిటీ లెవీ * చిన్న పట్టణాలకూ విమాన సేవలు * ఎయిర్‌లైన్స్‌కు పన్ను ప్రయోజనాలు * పౌర విమానయాన విధానం ముసాయిదా న్యూఢిల్లీ: ఒకవైపు విమానచార్జీలపై పరిమితులు విధించాలన్న డిమాండ్ ఉండగా.. మరోవైపు టికెట్లపై 2 శాతం లెవీ విధించేలా ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఈవిధంగా వచ్చిన నిధులను ప్రాంతీయంగా ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు వినియోగించాలని భావిస్తోంది. అలాగే, విమానయాన సంస్థలకు కొన్ని కార్యకలాపాలపై పన్ను ప్రయోజనాలు కల్పించడంతో పాటు దేశీ ఎయిర్‌లైన్స్‌లో 50 శాతం పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని యోచిస్తోంది. పౌర విమానయాన శాఖ శుక్రవారం ఈ మేరకు ముసాయిదా పాలసీని ఆవిష్కరించింది. భారీ ఆర్భాటాలు లేని సాధారణ ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, ప్రాంతీయంగా కనెక్టివిటీ పెంచే దిశగా ఎయిర్‌లైన్స్‌కు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కల్పించడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. అలాగే, చిన్న ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు.. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్) కింద గంట వ్యవధి ఉండే ప్రయాణాలకు చార్జీపై గరిష్ట పరిమితి రూ. 2,500 ఉండనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా పరిశ్రమ వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం సవరించిన ముసాయిదా విధానాన్ని ఆవిష్కరించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. వీటిపై పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉందన్నారు. దేశీయంగా 2022 నాటికి 30 కోట్లు, 2027 నాటికి 50 కోట్ల మేర టికెట్ల కొనుగోళ్లు జరిగేలా చూసేందుకు తగు పరిస్థితులను కల్పించే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది. సామాన్యులకూ అందుబాటులోకి విమానయానం.. ఏవియేషన్ భారీగా విస్తరించడంతో పాటు సామాన్యులకు సైతం విమానయానం అందుబాటులోకి రావాలన్న ప్రధాని మోదీ ఆదేశాలకు అనుగుణంగా ఈ విధానాన్ని రూపొందించినట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబే చెప్పారు. సుమారు ఏడాది పాటు దీనిపై కసరత్తు జరిగినట్లు వివరించారు. దేశీ, విదేశీ రూట్లలో టికెట్లపై 2 శాతం లెవీతో ఖజానాకు ఏటా రూ. 1,500 కోట్లు రాగలవని ఆయన తెలిపారు. ప్రాంతీయ రూట్ల విస్తరణకు ఈ నిధులను ఉపయోగిస్తామని చెప్పారు. ఎంఆర్వోకు ఊతం.. విమానాల మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్‌హాల్ (ఎంఆర్వో) కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రతిపాదించింది. ఎంఆర్వోకు సర్వీస్ ట్యాక్స్ పరిధి నుంచి మినహాయింపునివ్వడం, వ్యాట్ విధించకపోవడం వీటిలో ఉన్నాయి. ఆసియాలో ఎంఆర్వో కార్యకలాపాలకు భారత్‌ను హబ్‌గా తీర్చిదిద్దాలన్నది విధాన లక్ష్యం. ఇక, దేశీ విమానయాన కంపెనీలు విదేశాలకు సర్వీసులు నడపాలంటే... దేశీయంగా అయిదేళ్ల పాటు కార్యకలాపాలు, 20 విమానాలు ఉండాలన్న వివాదాస్పద నిబంధనపై విమానయాన శాఖ పూర్తి స్పష్టతనివ్వలేదు. దీనికి సంబంధించి మూడు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించింది. 5/20 నిబంధనను పూర్తిగా ఎత్తివేయడం, లేదా యథాతథంగా కొనసాగించడం, లేదా దేశీయంగా కార్యకలాపాల క్రెడిట్స్‌ను విదే శీ రూట్ల సర్వీసులకు అనుసంధానించడం వీటిలో ఉన్నాయి. ప్రాంతీయ కనెక్టివిటీకి పెద్ద పీట..: ప్రాంతీయంగా ఎయిర్‌కనెక్టివిటీని పెంచేందుకు పాలసీలో పలు ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రాలు ఉచితంగా స్థలాన్ని అందించడం, విమాన ఇంధనంపై (ఏటీఎఫ్) విలువ ఆధారిత పన్నును(వ్యాట్) 1% లేదా అంతకన్నా తక్కువకే పరిమితం చేసేలా ఆర్సీఎస్ స్కీమును ప్రతిపాదించింది. ఈ స్కీము కింద ఆర్సీఎస్ ఎయిర్‌పోర్టుల్లో ఇంధనం కొనుగోలు చేసే ఎయిర్‌లైన్స్‌కు సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. టికెట్లపై సర్వీస్ ట్యాక్స్ కూడా ఉండదు. సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో ఆర్భాటాలు లేని చిన్న విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. షెడ్యూల్డ్ కమ్యూటర్ ఎయిర్‌లైన్స్.. విమానయాన శాఖ కొత్తగా షెడ్యూల్డ్ కమ్యూటర్ ఎయిర్‌లైన్స్ (ఎస్సీఏ) అంశాన్ని ప్రస్తావించింది. కనెక్టివిటీ స్కీము కింద నడిపే సర్వీసులకు ఇవి ఎయిర్‌పోర్టు చార్జీలు కట్టనక్కర్లేదు. సుమారు రూ.2 కోట్ల పెయిడప్ క్యాపిటల్‌తోనూ ఎస్‌సీఏలను ఏర్పాటు చేయొచ్చు. ఇవి 100 లేదా అంతకన్నా తక్కువ సీటింగ్ సామర్థ్యం గల విమానాలతో సర్వీసులు నడపవచ్చు. ఇతర ఎయిర్‌లైన్స్‌తో కోడ్-షేర్ ఒప్పందాలూ కుదుర్చుకోవచ్చు. పురోగామి విధానం: ఎయిర్‌లైన్స్ స్పైస్‌జెట్, ఇండిగో తదితర విమానయాన సంస్థలు దీన్ని ‘పురోగామి’ విధానంగా అభివర్ణించాయి. లెవీ వల్ల టికెట్ చార్జీలు పెరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ.. దీనివల్ల ప్రాంతీ యంగా కనెక్టివిటీని పెంచేందుకు కావల్సిన ఇన్ఫ్రాను అభివృద్ధి చేయడానికి వీలవుతుందని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్, స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. తద్వారా చార్జీలు దిగిరావొచ్చని వారు పేర్కొన్నారు. ముసాయిదా ప్రతిపాదనలపై సంబంధిత వర్గాల అభిప్రాయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొద్ది నెలల్లో తుది విధానాన్ని ఖరారు చేయనున్నారు. 3 వారాల వ్యవధిలో ప్రజలు దీనిపై తమ అభిప్రాయాన్ని శాఖకు పంపించవచ్చు. -
'విశాఖ ఎయిర్‌పోర్టులో నిఘా పటిష్టం'
విశాఖ: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో నిఘాను మరింత పటిష్టం చేశామని కస్టమ్స్ కమిషనర్ రాజేంద్రన్ పేర్కొన్నారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిటేక్టర్లు, లగేజ్ స్కానర్లను ఉపయోగిస్తున్నామని ఆయన అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఎయిర్ కనక్టవిటీ పెరిగిన తర్వాత గోల్డ్ స్మగ్లింగ్ వంటి సమస్యలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి కంటైనర్లుపై కూడా నిఘా పెట్టామని రాజేంద్రన్ తెలిపారు.