విమానయానం మరింత భారం | 4 ways air travel in India could change in 2016 | Sakshi
Sakshi News home page

విమానయానం మరింత భారం

Published Sat, Oct 31 2015 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

విమానయానం మరింత భారం

విమానయానం మరింత భారం

టికెట్లపై 2 శాతం ప్రాంతీయ కనెక్టివిటీ లెవీ
* చిన్న పట్టణాలకూ విమాన సేవలు
* ఎయిర్‌లైన్స్‌కు పన్ను ప్రయోజనాలు
* పౌర విమానయాన విధానం ముసాయిదా
న్యూఢిల్లీ: ఒకవైపు విమానచార్జీలపై పరిమితులు విధించాలన్న డిమాండ్ ఉండగా.. మరోవైపు టికెట్లపై 2 శాతం లెవీ విధించేలా ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఈవిధంగా వచ్చిన నిధులను ప్రాంతీయంగా ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు వినియోగించాలని భావిస్తోంది.

అలాగే, విమానయాన సంస్థలకు కొన్ని కార్యకలాపాలపై పన్ను ప్రయోజనాలు కల్పించడంతో పాటు దేశీ ఎయిర్‌లైన్స్‌లో 50 శాతం పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని యోచిస్తోంది. పౌర విమానయాన శాఖ శుక్రవారం ఈ మేరకు ముసాయిదా పాలసీని ఆవిష్కరించింది. భారీ ఆర్భాటాలు లేని సాధారణ ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, ప్రాంతీయంగా కనెక్టివిటీ పెంచే దిశగా ఎయిర్‌లైన్స్‌కు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కల్పించడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.

అలాగే, చిన్న ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు.. రీజినల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్‌సీఎస్) కింద గంట వ్యవధి ఉండే ప్రయాణాలకు చార్జీపై గరిష్ట పరిమితి రూ. 2,500 ఉండనుంది. గతంలో ఎన్నడూ లేనంతగా పరిశ్రమ వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం సవరించిన ముసాయిదా విధానాన్ని ఆవిష్కరించినట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. వీటిపై పరిశ్రమ వర్గాల అభిప్రాయాలు తెలియజేయాల్సి ఉందన్నారు. దేశీయంగా 2022 నాటికి 30 కోట్లు, 2027 నాటికి 50 కోట్ల మేర టికెట్ల కొనుగోళ్లు జరిగేలా చూసేందుకు తగు పరిస్థితులను కల్పించే లక్ష్యంతో ఈ విధానాన్ని రూపొందించడం జరిగింది.
 
సామాన్యులకూ అందుబాటులోకి విమానయానం..
ఏవియేషన్ భారీగా విస్తరించడంతో పాటు సామాన్యులకు సైతం విమానయానం అందుబాటులోకి రావాలన్న ప్రధాని మోదీ ఆదేశాలకు అనుగుణంగా ఈ విధానాన్ని రూపొందించినట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ చౌబే చెప్పారు. సుమారు ఏడాది పాటు దీనిపై కసరత్తు జరిగినట్లు వివరించారు. దేశీ, విదేశీ రూట్లలో టికెట్లపై 2 శాతం లెవీతో ఖజానాకు ఏటా రూ. 1,500 కోట్లు రాగలవని ఆయన తెలిపారు. ప్రాంతీయ రూట్ల విస్తరణకు ఈ నిధులను ఉపయోగిస్తామని చెప్పారు.
 
ఎంఆర్‌వోకు ఊతం..
విమానాల మెయింటెనెన్స్, రిపేరు, ఓవర్‌హాల్ (ఎంఆర్‌వో) కార్యకలాపాలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రతిపాదించింది. ఎంఆర్‌వోకు సర్వీస్ ట్యాక్స్ పరిధి నుంచి మినహాయింపునివ్వడం, వ్యాట్ విధించకపోవడం వీటిలో ఉన్నాయి. ఆసియాలో ఎంఆర్‌వో కార్యకలాపాలకు భారత్‌ను హబ్‌గా తీర్చిదిద్దాలన్నది విధాన లక్ష్యం.

ఇక, దేశీ విమానయాన కంపెనీలు విదేశాలకు సర్వీసులు నడపాలంటే... దేశీయంగా అయిదేళ్ల పాటు కార్యకలాపాలు, 20 విమానాలు ఉండాలన్న వివాదాస్పద నిబంధనపై విమానయాన శాఖ పూర్తి స్పష్టతనివ్వలేదు. దీనికి సంబంధించి మూడు ప్రత్యామ్నాయాలు ప్రతిపాదించింది. 5/20 నిబంధనను పూర్తిగా ఎత్తివేయడం, లేదా యథాతథంగా కొనసాగించడం, లేదా దేశీయంగా కార్యకలాపాల క్రెడిట్స్‌ను విదే శీ రూట్ల సర్వీసులకు అనుసంధానించడం వీటిలో ఉన్నాయి.
 
ప్రాంతీయ కనెక్టివిటీకి పెద్ద పీట..: ప్రాంతీయంగా ఎయిర్‌కనెక్టివిటీని పెంచేందుకు పాలసీలో పలు ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రాలు ఉచితంగా స్థలాన్ని అందించడం, విమాన ఇంధనంపై (ఏటీఎఫ్) విలువ ఆధారిత పన్నును(వ్యాట్) 1% లేదా అంతకన్నా తక్కువకే పరిమితం చేసేలా ఆర్‌సీఎస్ స్కీమును ప్రతిపాదించింది. ఈ స్కీము కింద ఆర్‌సీఎస్ ఎయిర్‌పోర్టుల్లో ఇంధనం కొనుగోలు చేసే ఎయిర్‌లైన్స్‌కు సర్వీస్ ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. టికెట్లపై సర్వీస్ ట్యాక్స్ కూడా ఉండదు. సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో ఆర్భాటాలు లేని చిన్న విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది.
 
షెడ్యూల్డ్ కమ్యూటర్ ఎయిర్‌లైన్స్..
విమానయాన శాఖ కొత్తగా షెడ్యూల్డ్ కమ్యూటర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌సీఏ) అంశాన్ని ప్రస్తావించింది. కనెక్టివిటీ స్కీము కింద నడిపే సర్వీసులకు ఇవి ఎయిర్‌పోర్టు చార్జీలు కట్టనక్కర్లేదు. సుమారు రూ.2 కోట్ల పెయిడప్ క్యాపిటల్‌తోనూ ఎస్‌సీఏలను ఏర్పాటు చేయొచ్చు. ఇవి 100 లేదా అంతకన్నా తక్కువ సీటింగ్ సామర్థ్యం గల విమానాలతో సర్వీసులు నడపవచ్చు. ఇతర ఎయిర్‌లైన్స్‌తో కోడ్-షేర్ ఒప్పందాలూ కుదుర్చుకోవచ్చు.
 
పురోగామి విధానం: ఎయిర్‌లైన్స్

స్పైస్‌జెట్, ఇండిగో తదితర విమానయాన సంస్థలు దీన్ని ‘పురోగామి’ విధానంగా అభివర్ణించాయి. లెవీ వల్ల టికెట్ చార్జీలు పెరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమైనప్పటికీ.. దీనివల్ల ప్రాంతీ యంగా కనెక్టివిటీని పెంచేందుకు కావల్సిన ఇన్‌ఫ్రాను అభివృద్ధి చేయడానికి వీలవుతుందని ఇండిగో ప్రెసిడెంట్ ఆదిత్య ఘోష్, స్పైస్‌జెట్ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. తద్వారా చార్జీలు దిగిరావొచ్చని వారు పేర్కొన్నారు. ముసాయిదా ప్రతిపాదనలపై సంబంధిత వర్గాల అభిప్రాయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొద్ది నెలల్లో తుది విధానాన్ని ఖరారు చేయనున్నారు. 3 వారాల వ్యవధిలో ప్రజలు దీనిపై తమ అభిప్రాయాన్ని శాఖకు పంపించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement