
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా 2025(Maha Kumbh 2025) ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా విమాన సంస్థలు ఛార్జీలను గణనీయంగా పెంచేశాయి. ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లి రావడానికి రౌండ్ ట్రిప్ టిక్కెట్లు(roundtrip tickets) రూ.50,000 వరకు చేరుకున్నాయి. డిమాండ్ పెరుగుదలకు అనుగుణంగా టికెట్ ధరలను నియంత్రించాలని, ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్యను పెంచాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలను ఆదేశించింది.
ముందున్న శుభదినాలు..
జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న బసంత్ పంచమి, ఫిబ్రవరి 12న మాఘీ పూర్ణిమ, 26న మహా శివరాత్రి వంటి పుణ్యస్నానాల కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని చాలామంది భావిస్తున్నారు. ఇదే అదనుగా విమాన సంస్థలు భారీగా ఛార్జీలు పెంచుతున్నాయి. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లి రావడానికి రౌండ్ ట్రిప్ టికెట్ల ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. నగరాన్నిబట్టి సాధారణ టికెట్లు రూ.50,000 వరకు చేరుకున్నాయి.
డీజీసీఏ స్పందన..
పెరుగుతున్న ఛార్జీలకు ప్రతిస్పందనగా డీజీసీఏ 2025 జనవరి 23న విమానయాన ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఛార్జీల హేతుబద్ధీకరణ, విమానాల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ప్రయాగ్‌రాజ్(Prayagraj)కు ప్రయాణించేందుకు డీజీసీఏ జనవరిలో 81 అదనపు విమానాలను ఆమోదించింది. దీనితో దేశవ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్‌కు మొత్తం విమానాల సంఖ్య 132కు చేరుకుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే లక్ష్యంగా ఈ చర్యకు పూనుకుంది.
ఇదీ చదవండి: స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు ప్రారంభం
ప్రయాణికులపై ప్రభావం..
దేశవిదేశాల నుంచి యాత్రికులను ఆకర్షించే మహా కుంభమేళా ఉత్సవానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. అధిక రద్దీ కారణంగా విమాన ఛార్జీలు పెరిగాయి. స్థానికంగా వసతికి కూడా డిమాండ్ అధికమవుతుంది. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం మొదటిసారి రాత్రి సమయాల్లోనూ అంతర్జాతీయ విమానాలు నడుపుతూ రికార్డు స్థాయిలో ప్రయాణీకుల రద్దీని నిర్వహిస్తోంది.