కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రభుత్వం నియామకాలు ప్రారంభించింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్(సీపీఎస్‌ఈ)లోని స్వతంత్ర డైరెక్టర్ పోస్టుల్లో డిసెంబర్ 2024 నాటికి 86% ఖాళీగా ఉన్నాయి. ఇది అక్టోబర్‌లో ఉన్న 59% కంటే అధికంగా పెరిగింది.
వీరు ఏం చేస్తారంటే..
కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను నిర్వహించడంలో, వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో ఇండిపెండెంట్ డైరెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. చట్టబద్ధమైన ఆడిట్ విధానాన్ని పర్యవేక్షించే కమిటీల్లో వీరు ముఖ్యమైన బాధ్యత వహిస్తారు. కంపెనీల ఉనికి, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అత్యున్నత ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తారు.
ప్రస్తుత ఖాళీల పరిస్థితి
సీపీఎస్ఈ బోర్డుల్లో సుమారు 750 ఇండిపెండెంట్ లేదా నాన్ అఫీషియల్ డైరెక్టర్ పోస్టుల్లో 2024 డిసెంబర్ చివరి నాటికి 648 ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్దమొత్తంలో ఖాళీలు ఉండడంతో కార్పొరేట్ పాలనపై ఆందోళనలు రేకిస్తున్నాయి. ఈ ఖాళీల పర్వం ఇలాగే కొనసాగితే సంస్థల పనితీరుపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ స్పందన..
ఈ ఆందోళనకర పరిస్థితికి ప్రతిస్పందనగా ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం తక్షణ ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా 64 లిస్టెడ్ సీపీఎస్ఈల బోర్డుల్లోని 200 ఖాళీలపై దృష్టి సారించింది. నియామక ప్రక్రియను వేగవంతం చేయడానికి డిపార్ట్‌మెంట్స్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్(డీఓపీటీ), పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగాలతో పాటు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరస్పరం చర్చలు జరుపుతుంది.
ఇదీ చదవండి: వినియోగ సంక్షోభానికి కారణాలు.. బడ్జెట్‌పై ఆశలు
ఖాళీల సమస్యను పరిష్కరించడానికి అధికారులు అనేక చర్యలను పరిశీలిస్తున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో నాన్ అఫీషియల్ డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించి పోస్టులను భర్తీ చేసేలా చూడాలనే ప్రతిపాదనలున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీ డైరెక్టర్లలో కనీసం మూడింట ఒక వంతు మంది స్వతంత్ర డైరెక్టర్లు ఉండాలి. నిర్ణీత పరిమాణానికి మించి అన్ లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలకు కనీసం ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్లు అవసరం. వీరు కార్పొరేట్ గవర్నెన్స్ కస్టోడియన్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ ఖాళీల భర్తీకి అత్యంత ప్రాధాన్యం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment