Independent Director
-
కార్పొరేట్ కంపెనీల్లో మాజీ బ్యూరోక్రాట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ వర్గాల్లో పరపతి పెంచుకునే దిశగా కార్పొరేట్ కంపెనీలు మాజీ బ్యూరోక్రాట్లపై దృష్టి పెడుతున్నాయి. వ్యూహాత్మకంగా వారిని తమ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించుకుంటున్నాయి. తాజాగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) మాజీ రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్‌ను స్వతంత్ర డైరెక్టరుగా నియమించుకుంది. తద్వారా గత ఆరు నెలల వ్యవధిలో ఇలా ఒక మాజీ బ్యూరోక్రాట్‌ను నియమించుకున్న నిఫ్టీ 50 కంపెనీల్లో రెండోదిగాను, ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో మూడోదిగాను నిలి్చంది. నిఫ్టీ కంపెనీ అయిన లార్సన్ అండ్ టూబ్రో అక్టోబర్‌లో ఇలా ఒకరిని తీసుకోగా, హెచ్‌యూఎల్ పోటీ సంస్థలైన డాబర్, కోల్గేట్–పామోలివ్ కూడా అదే బాటలో నడిచాయి. హెచ్‌యూఎల్‌లో ఇప్పటికే మాజీ బ్యూరోక్రాట్ అయిన సంజీవ్ మిశ్రా, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఓపీ భట్ స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. మాజీ బ్యూరోక్రాట్లకు ప్రభుత్వ వర్గాలతో ఉండే సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని తమ పనులు జరిపించుకునే ఉద్దేశంతో కంపెనీలు ఇలా వారిని నియమించుకుంటూ ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని లిస్టెడ్ కంపెనీల్లో 6 శాతం.. తగినంత స్థాయిలో స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకోనందుకు గాను ప్రభుత్వ రంగ కంపెనీలకు ఒకవైపు అక్షింతలు పడుతుండగా.. మరోవైపు ప్రైవేట్ కంపెనీలు మాత్రం రిటైరైన బ్యూరోక్రాట్లను జోరుగా నియమించుకుంటున్నాయి. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అన్ని లిస్టెడ్ కంపెనీల్లోని స్వతంత్ర డైరెక్టర్లలో మాజీ బ్యూరోక్రాట్ల వాటా 6 శాతంగా ఉంది. అదే మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా టాప్ 200 కంపెనీలను మాత్రమే తీసుకుంటే ఇది మరింత అధికంగా 13 శాతంగా ఉంది. నిఫ్టీ 50లో 26 పైచిలుకు సంస్థలు రిటైరైన బ్యూరోక్రాట్లను నియమించుకున్నాయి. ఐటీసీ, మారుతీ సుజుకీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారతి ఎయిర్టెల్, హిందాల్కో, హెచ్‌యూఎల్ మొదలైన సంస్థల్లో అత్యధిక సంఖ్యలో మాజీ బ్యూరోక్రాట్లు స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. వ్యక్తులవారీగా చూస్తే ఏఎన్ రాయ్ 7 సంస్థల్లో స్వతంత్ర డైరెక్టరుగా ఉండగా అమిత్ కిరణ్ దేవ్ (6 సంస్థల్లో), దీపా గోపాలన్ వాధ్వా.. దినేష్ కుమార్ మిట్టల్.. యూకే సిన్హా ..సుమిత్ బోస్ .. వీరయ్య చౌదరి కొసరాజు తలో అయిదు సంస్థల్లో, సుధా పిళ్లయ్ .. మీరా శంకర్ .. నిరుపమా రావు తలో 4 సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక, అత్యధికంగా మాజీ బ్యూరోక్రాట్లు ఉన్న ప్రభుత్వ రంగయేతర సంస్థలను చూస్తే డాబర్ ఇండియాలో ఆరుగురు ఉన్నారు. ఐటీసీ, భారత్ రోడ్ నెట్వర్క్, అపోలో టైర్స్, సీసీఎల్ ప్రోడక్ట్స్ (ఇండియా)లో నలుగురు చొప్పున .. సెంచరీ ప్లైబోర్డ్స్ (ఐ), వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్, లార్సన్ అండ్ టూబ్రో, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లో ముగ్గురు చొప్పున ఉన్నారు. -
బ్యాంక్ డైరెక్టర్ రాజీనామా.. షేర్లు ఢమాల్!
ప్రైవేట్ రంగ ధనలక్ష్మి బ్యాంక్ ఇండిపెండెంట్ డైరెక్టర్ శ్రీధర్ కళ్యాణసుందరం బోర్డుతో విభేదాల కారణంగా రాజీనామా చేశారు. ఆయన వైదొలిగిన గంటల వ్యవధిలోనే బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి. ధనలక్ష్మి బ్యాంక్ షేర్లు పాక్షికంగా కోలుకోవడానికి ముందు సోమవారం (సెప్టెంబర్ 18) 9 శాతం వరకూ పడిపోయాయి. ఉదయం 10:20 గంటల సమయానికి బ్యాంక్ షేర్లు 3.25 శాతం క్షీణించి 28.20 రూపాయల వద్ద ఉన్నాయి. కేరళలోని త్రిసూర్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ధనలక్ష్మి బ్యాంక్‌కి కళ్యాణసుందరం 2022 డిసెంబరులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. (ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులకు బిగ్ బొనాంజా.. వరాలు కురిపించిన కేంద్ర ప్రభుత్వం) ధనలక్ష్మి బ్యాంక్ ప్రస్తుతం బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శివన్ నేతృత్వంలో ఉంది. అపరిష్కృతంగా ఉన్న బ్యాంకు ప్రణాళికాబద్ధమైన హక్కుల సమస్యపై తాను ప్రశ్నలు లేవనెత్తానని, దీంతో తనను బ్యాంకు నుంచి తొలగిస్తామని బెదిరించారని సెప్టెంబరు 16న ఎక్స్ఛేంజీలకు పంపిన లేఖలో కళ్యాణసుందరం ఆరోపించారు. ధనలక్ష్మి బ్యాంక్ 2023 మార్చి నాటికి కేవలం రూ. 15 వేల కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉంది. బ్యాంక్ నాయకత్వానికి సంబంధించి చాలా కాలంగా గందరగోళం నెలకొంది. దీంతో ఈ బ్యాంక్‌పై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచిన ఆర్బీఐ బోర్డులో ఇద్దరు డైరెక్టర్లను ఉంచింది. -
సుందరానికి అదనపు బాధ్యతలు
న్యూఢిల్లీ: బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్ మజుందార్ షా పదవీ విరమణ చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా పేర్కొంది. ఈ నెల 22న పదవీ కాలం ముగిసినట్లు వెల్లడించింది. అయితే నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సిఫారసుమేరకు ఈ 23 నుంచి డి.సుందరంను లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొంది. బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఇన్ఫోసిస్ బోర్డులో 2014 నుంచి స్వతంత్ర డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 నుంచి లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అంతేకాకుండా నామినేషన్, రెమ్యునరేషన్ కమిటీ, సీఎస్ఆర్ కమిటీలకు చైర్‌పర్శన్‌గా వ్యవహరించారు. బోర్డుకు చెందిన రిస్క్ మేనేజ్మెంట్, ఈఎస్జీ కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. ఇన్ఫోసిస్ కుటుంబంలో సభ్యులైన కిరణ్ కొన్నేళ్లుగా విలువైన నాయకత్వం, మార్గదర్శకత్వం వహించారని, ఇందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కంపెనీ చైర్మన్ నందన్ నిలేకని పేర్కొన్నారు. ఇదేవిధంగా లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఎంపికైన సుందరంకు శుభాకాంక్షలు తెలియజేశారు. 2017 నుంచి సుందరం ఇన్ఫోసిస్ బోర్డులో కొనసాగుతున్నారు. ఫైనాన్స్, వ్యూహ రచనలో అత్యంత సమర్ధుడైన సుందరం కంపెనీ భవిష్యత్ లక్ష్యాలను నిజం చేయడంలో కీలకంగా నిలవగలరని అభిప్రాయపడ్డారు. ఆయన ఆడిట్, రిస్క్ మేనేజ్మెంట్, వాటాదారుల రిలేషన్షిప్, నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ తదితర పలు కమిటీలలో సేవలందించనున్నారు. -
ఇండిపెండెంట్ డైరెక్టర్లకు స్వేచ్ఛ లేదు
న్యూఢిల్లీ: కంపెనీల్లోని ఇండిపెండెంట్ డైరెక్టర్లకు స్వేచ్ఛ లేదని, ప్రమోటర్ల ప్రయోజనాలకే ఉపయోగపడుతున్నారని పలువురు ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్ ప్లాట్ఫార్మ్, లోకల్‌సర్కిల్స్ నిర్వహించిన కార్పొరేట్ గవర్నెన్స్ సర్వే 2020లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 272 జిల్లాల్లో ఉన్న వివిధ కేటగిరీల వాటాదారులపై నిర్వహించిన ఈ సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలు.... ► సర్వేలో పాల్గొన్న వారిలో 79 శాతం మంది ఇండిపెండెంట్ డైరెక్టర్ల స్వేచ్ఛపై ఆందోళన వ్యక్తం చేశారు. ► మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇండిపెండెంట్ డైరెక్టర్లు పనిచేస్తున్న దాఖలాలు లేవని 65 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► పలువురు ఇండిపెండెంట్ డైరెక్టర్లు తమ బాధ్యతలను నిర్వర్తించడం లేదు. అకౌంటింగ్ మోసాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని, వాటాదారులకు తెలియకుండానే కంపెనీ ఆస్తుల విక్రయానికి సహకరిస్తున్నారని, ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారని ఇండిపెండెంట్ డైరెక్టర్లపై అభియోగాలున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించగలిగితే మరింత మంది షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు. ► భారత కంపెనీల్లో కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగుపడితే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా పెరుగుతాయి. -
ఇండిపెండెంట్ డైరెక్టర్ల ‘డేటా బ్యాంక్’ ఆరంభం
న్యూఢిల్లీ: ఇండిపెండెంట్ డైరెక్టర్ల వివరాలతో కూడిన సమగ్రమైన ‘డేటా బ్యాంక్’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ డేటా బ్యాంక్‌లో ప్రస్తుతమున్న ఇండిపెండెంట్ డైరెక్టర్ల వివరాలతో పాటు ఇండిపెండెంట్ డైరెక్టర్లయ్యే అర్హత గల వారి వివరాలను కూడా పొందుపరుస్తారు. కంపెనీలు ఏవైనా ఇండిపెండెంట్ డైరెక్టర్లను నియమించుకోవాలనుకుంటే ఈ డేటా బ్యాంక్ వాటికి ఉపయోగపడుతుంది. ఈ డేటా బ్యాంక్ పోర్టల్‌ను కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఇండి యన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) నిర్వహిస్తుంది. 2013 నాటి కంపెనీల చట్టం ప్రకారం ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఈ నెల 1 నుంచి 3 నెలలలోపు తమ వివరాలను ఈ డేటాబ్యాంక్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా, 2020 మార్చి నుంచి అందుబాటులోకి వచ్చే ఆన్లైన్ ప్రొఫిషియెన్సీ సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలో ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. -
విప్రో లాభాలు డౌన్: బోర్డులోకి అరుంధతీ భట్టాచార్య
సాక్షి,ముంబై: ఐటీ సేవల సంస్థ విప్రో క్యూ 2 ఫలితాల్లో నీరసపడింది. ఈ ఏడాది సెప్టెంబరు 30తో ముగిసిన రెండవ త్రైమాసికంలో నికర లాభాలు క్షీణించాయి. గత క్వార్టర్లో రూ. 2,121 కోట్లతో పోలిస్తే తాజా క్వార్టర్లో 1890 కోట్ల రూపాయల లాభాలను మాత్రమే నమోదు చేసింది. ఇదే సమయంలో సంస్థ ఆదాయం 2.3 శాతం పెరిగి రూ .14,567.9 కోట్లకు చేరింది. అలాగే సెప్టెంబరు 2018 ముగిసిన రెండవ త్రైమాసికానికి కంపెనీ ఐటీ సేవల ఆదాయం 5 శాతం పెరిగి రూ .14,377.3 కోట్లకు చేరింది. మరోవైపు ఎస్బీఐ మాజీ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య విప్రో బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈ మేరకు బోర్డు ఆఫ్ డైరెక్టర్ల ఆమోదం లభించిందని ఫలితాల సందర్భంగా విప్రో వెల్లడించింది. జనవరి 1, 2019 నుంచి 5 సంవత్సరాల పాటు ఆమె ఈ పదవిలో ఉంటారని తెలిపింది. -
ఎయిర్ ఇండియా డైరెక్టర్‌గా పురందేశ్వరి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్రం గురువారం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఆమె మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన పురందేశ్వరి ప్రస్తుతం మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. -
ఇన్ఫీ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తప్పుకున్న వెంకటేశన్
సాక్షి, బెంగళూరు: ఇన్ఫోసిస్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి రవి వెంకటేశన్ రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వెంకటేశన్ మరో నూతన అవకాశాన్ని దక్కించుకునే ప్రణాళికలో ఉన్నారని దేశీయ అతిపెద్ద ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ వెల్లడించింది. మరోవైపు దీనిపై వెంకటేశన్ మాట్లాడుతూ ఇన్ఫోసిస్ సంక్లిష్ట ప్రయాణం ప్రారంభ సమయంలో తాను ఇన్ఫోసిస్ బోర్డులో చేరానంటూ గుర్తు చేసుకున్నారు. అది టెక్టోనిక్ పరిశ్రమ మార్పుల సమయం. ఈ మిషన్ సాధించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని వెంకటేశన్ ప్రకటించారు. ప్రస్తుతం సమర్ధులైన వారి చేతుల్లో ఇన్ఫోసిస్ బలంగా ఉంది. పురోగతిని సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా 2011నుంచి ఇన్ఫీబోర్డు స్వత్రంత్ర డైరెక్టర్‌గా ఉన్న వెంకటేశన్ ఇన్ఫోసిస్ కో-ఛైర్మన్‌గా కూడా వ్యవహరించారు. కార్పొరేట్ పాలన వివాదం, ఇన్ఫోసిస్ సంక్షోభం నేపథ్యంలో అప్పటి సీఈవో విశాల్ సిక్కా రాజీనామా అనంతరం నందన్ నీలేకని మరోసారి ఇన్ఫీ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే కో చైర్మన్ పదవినుంచి రవి వెంకటేశన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. -
సిగ్నిటీ బోర్డులోకి కొత్తగా ముగ్గురు డైరెక్టర్లు
హైదరాబాద్: ప్రముఖ సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ సంస్థ ‘సిగ్నిటీ టెక్నాలజీస్’ తాజాగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను బోర్డులోకి తీసుకుంది. వీరిలో క్వాలిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్.కె.అగర్వాల్, గ్లోబల్ ఐటీ ఇండస్ట్రీ వెటరన్ ఫణీశ్ మూర్తి, ఇన్వెంచర్ అకాడమీ సీఈవో, సహ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ ట్రస్టీ నూరిన్ ఫజల్ ఉన్నారు. ‘సిగ్నిటీ బ్రాండ్‌ను బలోపేతం చేసే దిశగా ఇదో పెద్ద ముందడుగు. ఈ ముగ్గురిని బోర్డులోకి తీసుకోవడం అనేది కంపెనీకి విలువ జోడించడంతోపాటు భవిష్యత్‌లో మరింత అభివృద్ధిని లక్ష్యించి ముందుకు వెళ్తున్న మాకెంతో ఉపయోగపడుతుంది. వీరి సహకారంతో ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత గౌరవనీయమైన స్వతంత్ర సాఫ్ట్వేర్ టెస్టింగ్ సర్వీసెస్ కంపెనీల్లో ఒకటిగా మా ప్రయాణం వేగవంతం అవుతుందని భావిస్తున్నాం’ అని సిగ్నిటీ టెక్నాలజీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి.వి.సుబ్రమణ్యం వివరించారు. -
ఇన్ఫోసిస్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా సుందరం
బెంగళూరు: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన బోర్డులోకి మరో ఎగ్జిక్యూటివ్‌ను తీసుకుంది. డి. సుందరంను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించింది. జూలై 14నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఇన్ఫీ ప్రకటించింది. బోర్డ్ ఆఫ్ నామినేషన్ అండ్ రెమినరేషన్ కమిటీ సిఫార్సులు ఆధారంగా ఈ నియమకాన్ని చేపట్టింది. ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ రంగంలో విస్తృతమైన అనుభవం ఉన్న సుందరాన్ని తమ బోర్డులోకకి తీసుకోవడం సంతోషంగా ఉందని ఇన్ఫోసిస్ బోర్డ్ ఛైర్మన్ శేష శాయి తెలిపారు. 1975 లో యునిలివర్ గ్రూప్‌లో చేరిన సుందరం వివిధ నాయకత్వ స్థానాల్లో కీలక బాధ్యతలను నిర్వహించారు. 34 సం.రాల కెరీర్లో హిందుస్తాన్ యునిలివర్ లిమిటెడ్ ఫైనాన్స్ అండ్ ఐటి డైరెక్టర్ వైస్ చైర్మన్ పదవులను ఆయన చేపట్టారు. కాగా ప్రస్తుతం సుందరం టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. -
టాటా మరో వికెట్ డౌన్
ముంబై: టాటా గ్రూపు నుంచి సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మిస్త్రీ ఉద్వాసన తరువాత ఆయన సన్నిహితులపై టాటా గ్రూపు వేటు వేసింది. దీంతోపాటు మిస్త్రీ అనుయాయులు కొంతమంది రాజీనామా చేశారు. అయితే తాజాగా టాటా గ్రూపులోని అతి పెద్ద సంస్థ టాటా గ్లోబల్ బెవరేజెస్ సంస్థ బోర్డుకు మరో డైరెక్టర్ గుడ్ బై చెప్పారు. టాటా బేవరేజెస్ స్వతంత్ర డైరెక్టర్, మ్యాక్స్ హెల్త్ కేర్ అండ్ మ్యాక్స్ బుపా ఇన్సూరెన్స్ కంపెనీ ఛైర్మన్ అనల్జిత్ సింగ్ మంగళవారం రాజీనామా చేశారు. నవంబరు 15న జరిగి టాటా గ్లోబల్ బోర్డు సమావేశంలో మిస్త్రీకి ఉద్వాసనకు వ్యతిరేకంగా వాదించిన డైరెక్టర్లలో అనల్జిత్ కూడా ఒకరు. నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి అనల్జిత్ సింగ్ రాజీనామా చేశారని టాటా గ్లోబల్ ప్రకటించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. కాగా టాటా గ్రూపు నుంచి ఛైర్మన్‌గా తొలగించిన సైరస్ మిస్త్రీని టాటా గ్లోబల్ ఇటీవల తొలగించింది. పలు టాటా కంపెనీల పదవుల నుంచి తొలగింపు నేపథ్యంలోనే టాటా గ్లోబల్ కూడా మిస్త్రీని ఛైర్మన్ గా తొలగించిని సంగతి తెలిసిందే.