విమానయానం రయ్‌రయ్‌ | - | Sakshi
Sakshi News home page

విమానయానం రయ్‌రయ్‌

Jan 18 2024 12:28 AM | Updated on Jan 18 2024 1:13 PM

ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సందడి - Sakshi

ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సందడి

సాక్షి, విశాఖపట్నం: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల రాకపోకల్లో గణనీయమైన వృద్ధి నమోదు చేసుకుంటోంది. 2022–23తో పోలిస్తే 2023–24లో ఏకంగా 22 శాతం వృద్ధి సాధించింది. ఓవైపు రన్‌వే పునరుద్ధరణ పనుల వల్ల నవంబర్‌ నుంచి రాత్రి పూట సర్వీసులు నిలుపుదల చేసినా.. చివరి రెండు నెలల్లోనూ మంచి ఫలితాలే నమోదయ్యాయి. రాత్రి పూట కూడా సర్వీసులుండుంటే వృద్ధి శాతం 25కి దాటే అవకాశం ఉండేదని విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్‌కు ముందు ఏడాది 30 లక్షల వరకూ ప్రయాణికుల రాకపోకలు సాగగా.. కోవిడ్‌ తర్వాత ఈ సంఖ్య సగానికి పడిపోయింది.

అయితే.. క్రమంగా కోలుకుంటూ 2023లో తొలిసారిగా 20 లక్షల బెంచ్‌ మార్క్‌ను దాటింది. 2022–23 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకూ 17,67,609 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా.. 2023–24 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకూ 21,67,660 మంది రాకపోకలు సాగించారు. మరోవైపు.. ఈ ఏడాది విశాఖ ఎయిర్‌పోర్టుకు అన్నీ మంచి శకునాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కటే ఉన్న అంతర్జాతీయ సర్వీసు ఏప్రిల్‌ నాటికి మూడు సర్వీసులు రానున్నాయి. రోజుకు సగటున 50 విమానాల రాకపోకలు సాగిస్తుండగా.. రన్‌వే పనులు పూర్తయ్యాక వీటి సంఖ్య కూడా 70కి చేరుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

రోజుకు 50 విమానాల రాకపోకలు
1981లో రోజుకు ఒక విమానం ద్వారా పౌర సేవలు ప్రారంభమయ్యాయి. సివిల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్స్‌లకు 85 రన్‌ వే కెపాసిటీగా విధించారు. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉన్నప్పుడు 80 విమానాలు రాకపోకలు సాగించాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌ సర్వీసులు గతంలో నిలిచిపోవడంతో ప్రస్తుతం 60 నుంచి 66 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతి పదేళ్లకోసారి రన్‌వే పునరుద్ధరణ పనులు చేపడుతుంటారు. ఈ పనుల కారణంగా నవంబర్‌ 15 నుంచి రాత్రి పూట సర్వీసులు నిలిపేశారు.

రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు రన్‌వే మూసివేస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా, పూణె తదితర ప్రాంతాలకు 12కి పైగా సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ప్రస్తుతం 50 వరకూ విమానాల రాకపోకలు సాగుతున్నాయి. ఇందులో ఒక అంతర్జాతీయ సర్వీసు కూడా ఉండటం విశేషం. అయినప్పటికీ.. పాసింజర్‌ ఫుట్‌ఫాల్‌లో మాత్రం 2023లో మంచి ఫలితాలు నమోదు చేసింది. ప్రతి రోజూ సగటున 7,000 నుంచి 7,500 వరకూ ప్రయాణికులు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

సర్వీసులు పెరిగే అవకాశాలు
ఈ ఏడాది మార్చి 31 నాటికి రన్‌వే రీ సర్వీసింగ్‌ పనులు పూర్తి కానున్నాయి. అనంతరం.. పాత సర్వీసులు పునరుద్ధరించేందుకు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. వీటితో పాటు దేశంలోని వివిధ నగరాలకు కొత్త సర్వీసులు మొదలు పెట్టేందుకు ఇండిగో, ఎయిర్‌ఏసియా సంస్థలు ఎయిర్‌పోర్టు వర్గాలతో చర్చలు జరుపుతున్నాయి. టైమ్‌ స్లాట్స్‌ని అడ్జెస్ట్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. వీటికి తోడు.. ప్రస్తుతం సింగపూర్‌కు మాత్రమే ఇంటర్నేషనల్‌ సర్వీసు నడుస్తోంది. మరో రెండు మూడు నెలల్లో అదనంగా రెండు సర్వీసులు మొదలవ్వనున్నాయి. ఏప్రిల్‌ నుంచి థాయ్‌లాండ్‌, మలేసియాకు డైరెక్ట్‌ సర్వీసుల్ని విశాఖ నుంచి నడపనున్నట్లు ఎయిర్‌ఏసియా సంస్థ ప్రకటించింది. ఇలా.. రీ సర్వీసింగ్‌ పనులు పూర్తయిన తర్వాత.. విమాన సర్వీసులు 70కి చేరే అవకాశాలున్నాయని విమానాశ్రయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

విమాన ప్రయాణికుల వృద్ధి ౖపైపెకి..

2023–24లో 21,67,660 మంది రాకపోకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement