సార్‌.. పార్టీలో చేరితే టికెట్‌ కన్ఫర్మ్‌ అన్నారు.. ఫస్ట్‌ లిస్ట్‌లో మా పేర్లు ఎక్కడ! | - | Sakshi
Sakshi News home page

సార్‌.. పార్టీలో చేరితే టికెట్‌ కన్ఫర్మ్‌ అన్నారు.. ఫస్ట్‌ లిస్ట్‌లో మా పేర్లు ఎక్కడ!

Published Wed, Feb 28 2024 12:26 AM | Last Updated on Wed, Feb 28 2024 8:34 AM

- - Sakshi

 ఫిరాయింపుదారులపై చంద్రబాబు ట్రిక్స్‌ 

 అదే బాటలో దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ 

 అడకత్తెరలో పోకచెక్కలా వైఎస్సార్‌ సీపీ నుంచి వెళ్లిన వారి పరిస్థితి 

 తొలి జాబితాలో ఒక్కరి పేరూ లేకుండా చేసిన బాబు ద్వయం 

 దాడి, పంచకర్ల, వంశీకృష్ణ, కార్పొరేటర్లకు హ్యాండిచ్చినట్లేనా.? 

 చంద్రబాబు గురించి తెలిసి కూడా మోసపోయామంటూ నేతల ఆక్రోశం 

 తమ రాజకీయ భవిష్యత్‌ నాశనమైపోయినట్లేనంటూ ఆవేదన

సాక్షి, విశాఖపట్నం: ‘సార్‌.. పార్టీలో చేరితే టికెట్‌ కన్ఫర్మ్‌ అన్నారు.. మీరు సీనియర్లు కదా.. మీకే ఫస్ట్‌ ప్రయారిటీ అని చెప్పారు.. కానీ.. ఫస్ట్‌ లిస్ట్‌లో మా పేర్లు కనిపించలేదెందుకు..?’ చెప్పాను కదా.. మీరు సీనియర్లు అని.. ఆ మూలన నిల్చోండి.. మీ సంగతి తర్వాత చూద్దాం.. ఇదీ సంగతి.. ‘‘వైఎస్సార్‌ సీపీలో అత్యుత్తమ పదవులు అనుభవించారు. పోటీ చేసిన ప్రతిసారీ ఓడిపోయినా.. చట్టసభలకు పంపించారు. రాజకీయ భవిష్యత్‌కు అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అయినా ఇంకా ఏదో ఆశించారు. పరుగెత్తి పాలు తాగేద్దాం అనేలా.. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ వ్యామోహంలో పడిపోయారు. సీనియర్లుగా మనకు పెద్ద పీట వేస్తారని ఊహల్లో తేలిపోయారు. ఇక ఇక్కడ మేం ఏం చెప్తే అదే జరుగుతుంది.. మన ప్రాంతాన్ని మనమే శాసించే స్థాయికి ఎదిగిపోతున్నామని పగటి కలలు కన్నారు’’. కానీ.. ఆ కలలన్నీ చంద్రబాబు వెన్నుపోటుతో పటాపంచలైపోయాయి. శాసిస్తామనుకున్న వాళ్లంతా.. సైడ్‌ క్యారెక్టర్స్‌గా మారిపోయారు.

కార్పొరేటర్లదీ అదే బాధ
దక్షిణ టికెట్‌ నాదేనంటూ.. 32వ వార్డు కార్పొరేటర్‌ కందుల నాగరాజు జనసేనలో చేరిన మొదటి రోజు హడావిడి చేశారు. తర్వాత ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని స్థితికి చేరుకున్నారు. దక్షిణ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నేనేనంటూ వెళ్లిన 39వ వార్డు కార్పొరేటర్‌ సాధిక్‌ది కూడా అదే పరిస్థితి. అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ సముచిత స్థానం కల్పిస్తే.. కుళ్లు రాజకీయాలతో పార్టీకి రాజీనామా చేసిన సీతంరాజు సుధాకర్‌ పరిస్థితి ఎడారిగా మారింది. ఏ పార్టీలోకి వెళ్లినా సీటు లేదంటూ తరిమేస్తుండటంతో తన రాజకీయ భవిష్యత్‌కి ఎండ్‌ కార్డ్‌ పడిందంటూ వాపోతున్నారు.

కన్నీళ్లు పెట్టుకుంటున్న క్యాడర్‌
అన్ని విధాలా ఆదుకున్న పార్టీకి ద్రోహం చేసి.. చంద్రబాబు వలలో చిక్కుకొని విలవిల్లాడుతున్న నాయకుల వెంట ఉన్న క్యాడర్‌ పరిస్థితి దారుణంగా మారింది. నేతలను నమ్ముకొని వెంట నడిస్తే.. తమ భవిష్యత్‌ని కూడా వాళ్లతో పాటే రోడ్డున పడేశారంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కులం, మతం, రాజకీయం చూడకుండా.. పథకాలు అందించిన వైఎస్సార్‌ సీపీ బెస్ట్‌ అనీ.. అనవసరంగా రాజకీయ ఉచ్చులోకి తీసుకొచ్చేశారంటూ ఆవేదన చెందుతున్నారు.

పంచకర్లకు కుంపటి
వై
ఎస్సార్‌ సీపీలో చేరిన వెంటనే విశాఖ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి.. పంచకర్ల రమేష్‌బాబుకు వైఎస్‌ జగన్‌ సముచిత స్థానాన్ని కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లోనూ సీట్‌ పక్కాగా ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయినా తొందరపడి జనసేన కండువా కప్పుకున్న పంచకర్ల.. ఇప్పుడు ‘గ్లాసు’లో ఇరుకున్నారు. పెందుర్తి నియోజకవర్గ బాధ్యతలు పవన్‌ అప్పగించడంతో గొప్పలు పోయిన పంచకర్లకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. సొంత పార్టీలోనే శివశంకర్‌ అనే కుంపటి రగులుతుండగా.. పొత్తులో భాగంగా పెందుర్తి టికెట్‌ పంచకర్లకు ఇస్తే ఖబడ్దార్‌ అంటూ టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణ అధినేతకు అల్టిమేటం జారీ చేశారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. తొలి జాబితాలో పేరు లేకపోవడంతో పంచకర్ల అయోమయానికి గురవుతున్నారు. వైఎస్సార్‌ సీపీలో ఉంటే కచ్చితంగా టికెట్‌ వచ్చేదనీ.. ఇప్పుడు వస్తుందో రాదో అనేది డౌటేనంటూ సన్నిహితులతో వాపోతున్నట్లు తెలుస్తోంది.

వంశీ.. ఏదో అనుకుంటే..
పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబుతోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా పయనిస్తూ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కి కూడా.. బాబు లక్షణాలు వంటబట్టాయి. తనని నమ్ముకుని పార్టీలోకి వచ్చిన వారి భవిష్యత్తుని గాలిలో దీపం మాదిరిగా వదిలేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు పవన్‌ పొత్తు వైఖరిని దుమ్మెత్తి పోస్తున్నారు. విశాఖలోనూ ‘తూర్పా’రబడుతున్నారు. తూర్పు టికెట్‌ నీకే.. వచ్చేసెయ్‌ అంటూ వంశీకృష్ణ శ్రీనివాస్‌ను పార్టీలోకి ఆహ్వానించేశారు. 2014లో వైఎస్సార్‌ సీపీ తరఫున టికెట్‌ ఇస్తే వంశీ ఓటమి పాలయ్యారు. అయినా వైఎస్‌ జగన్‌ అక్కున చేర్చుకుని పార్టీ నగర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు. 

అనంతరం జీవీఎంసీ కార్పొరేటర్‌గా అవకాశం ఇస్తే.. అతి కష్టంమీద నెగ్గుకొచ్చారు. అయినా జగన్‌ మాత్రం సోదరుడిలా భావించి.. ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఇలా అన్ని విధాలుగా వైఎస్సార్‌ సీపీ అండగా ఉన్నా.. ఏదో ఆశించి జనసేనలో చేరారు. తొలుత తూర్పు టికెట్‌ కన్ఫర్మ్‌ అని చెప్పి.. తర్వాత.. దక్షిణ.. భీమిలి.. గాజువాక ఇస్తామని ఎప్పటికప్పుడు మాట మార్చుతుండటంతో వంశీ ఆలోచనలో పడ్డారు. నగర అధ్యక్షుడిగా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన వంశీ వెంట ఒక్క సీనియర్‌ నాయకుడు కూడా వెళ్లకపోవడంతో ఆయన సామర్థ్యమేంటో పవన్‌కి తెలిసిందనీ.. అందుకే దూరం పెడుతున్నట్లు సమాచారం.

‘దాడి’కి రిక్త హస్తాలు
ఎన్నికల వేళ టీడీపీలోకి వెళ్లిన జంప్‌ జిలానీలు పరిస్థితి చూస్తే అందరికీ జాలి కలుగుతోంది. సొంత కుటుంబంలా చూసుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కాదని.. ఏరు దాటాక తెప్ప తగలేసే చంద్రబాబు, ఆయన్ని అంటకాగుతున్న పవన్‌ కల్యాణ్‌ పార్టీలో చేరిన వారంతా ఇప్పుడు డైలమాలో పడిపోయారు. సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ సముచిత స్థానాన్ని కల్పించింది. ఈ ఎన్నికల్లో కూడా మంచి పదవులు ఇవ్వాలని భావించినా.. తొందరపడి చంద్రబాబు పంచన చేరారు. అమరావతి గ్రాఫిక్స్‌ మాదిరిగా.. వారికి భరోసా ఇస్తానంటూ సినిమా చూపించిన బాబు.. అనకాపల్లి టికెట్‌ని జనసేనకు అప్పగించేశారు. 

దీంతో దాడి కుటుంబం అయోమయంలో పడిపోయింది. పోనీ ఎంపీ స్థానమైనా ఇస్తారా అంటే.. అది కూడా జనసేన ఖాతాలోకే పంపించాలని బాబు వ్యూహం పన్నారు. దీంతో తమకు రిక్త హస్తాలు చూపించారంటూ అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలి జాబితాలో పేరు లేకపోవడంతో కుటుంబమంతా మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఫస్ట్‌ లిస్ట్‌ కంటే ముందు లోకేష్‌ అనకాపల్లిలో శంఖారావం నిర్వహించగా.. అన్నీ తామే అన్నట్లుగా సభలో దాడి ఫ్యామిలీ వ్యవహరించింది. అయితే వారి గురించి లోకేష్‌ పల్లెత్తు మాట కూడా అనకపోవడంతో అవమానంగా భావించినట్లు సమాచారం. జగనే మేలు చెప్పినట్లే చేస్తారు.. ఈయన చెప్పిన మాట ఒకటి.. చేసిన పని ఒకటి.. ఇప్పుడు ఎటూ చెందకుండా అయిపోయామంటూ సన్నిహితుల వద్ద ఆక్రోశం వెళ్లగక్కినట్లు తెలుస్తోంది. తమ రాజకీయ భవిష్యత్‌ ఏమిటనేది ఎటూ తేల్చుకోలేక.. అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారైందని దాడి అండ్‌ కో మదనపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement