మాజీ ఎమ్మెల్యే పీలాకు టికెట్ ఇవ్వనందుకు కశింకోటలో నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులు
అనకాపల్లి (యలమంచిలి రూరల్)/కశింకోట/అనకాపల్లి: టీడీపీ–జనసేన పార్టీల తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితా అనకాపల్లి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లలో తీవ్ర అసంతృప్తి రగిల్చింది. పదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను కాదని జనసేనకు టికెట్ కేటాయించడం గందరగోళానికి దారితీసింది. ఇప్పటి వరకూ చంద్రబాబే తమకు ఇంద్రుడు, చంద్రుడు అని మాట్లాడినవారు ఇప్పుడు ఏకంగా పార్టీ అధినేత వైఖరినే తప్పుబడుతున్నారు. జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు పార్టీ టికెట్ వస్తుందని ఆయన అనుచరగణం, టీడీపీ శ్రేణులు భావించాయి.
కాని అనూహ్యంగా ఈ సీటు ను పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించడంతో ఆదివారం కశింకోట, అనకాపల్లి పట్టణాలలో తెలుగు తమ్ముళ్ల నిరసనలు పెల్లుబుకాయి. చంద్రబాబు తీరుపై ఆ పార్టీ నేతలే తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. నెల రోజుల కిందట జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాలను ఉమ్మడి అభ్యర్థిగా బరిలో నిలపడం సరికాదంటున్నారు. ఈ మేరకు ఆదివారం కశింకోట మండల టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. తామంతా పీలా వెంటే ఉంటామని, ఆయనకు టికెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామని అధినేతకు హెచ్చరికలు పంపారు.
అనకాపల్లిలో కూడా టీడీపీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఇలాంటి పొత్తుల వల్ల పార్టీకి నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని, పార్టీకి అనుకూలంగా వున్న సీటును జనసేనకు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. నమ్మకాన్ని వమ్ము చేయడమే చంద్రబాబు నైజమని సొంత పార్టీ నేతలే విమర్శిస్తూ మీడియా సమావేశాలు నిర్వహించడం, సామాజిక మాధ్యమాల్లో వీడియోలను పోస్టు చేయడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యాన్ని తెచ్చింది. చంద్రబాబుకు మాటపై నిలబడే తత్వం లేదని, ఆయన మాటలకు, చేతలకు పొంతన లేదని నియోజకవర్గ టీడీపీ ముఖ్యనాయకులు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు.
మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం
మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు టీడీపీ టికెట్ ఇవ్వకుంటే మూకుమ్మడిగా రాజీనా మా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కశింకోట మండల టీడీపీ శ్రేణులు హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం కశింకోటలోని గౌరమ్మ ఆలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో తీవ్ర నిరసన తెలిపారు. అనకాపల్లి పార్లమెంటు తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఉగ్గిన రమణమూర్తి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా కష్టపడి నియోజక వర్గంలో కార్యకర్తలను నిరంతరం ఉత్తేజపరిచి పార్టీని నిలబెట్టుకుంటూ పటిష్టవంతం చేసిన పీలా వంటి వ్యక్తికి సీటు ఇవ్వకుండా తీవ్ర అన్యా యం చేశారని విమర్శించారు. పార్టీ శ్రేణులకు తెలియకుండా జనసేనకు టికెట్ కేటాయించడం శోచనీయమన్నారు. అధిష్టానం పునరాలోచించాలని కోరారు. పొత్తులో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు కేటాయిస్తే పనిచేస్తామన్నారు. అయితే ఎమ్మెల్యే సీటు మాత్రం పీలాకు ఇవ్వాలన్నారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పెంటకోట రాము, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు వేగి గోపీకృష్ణ, డీసీసీబీ డైరెక్టర్ సిదిరెడ్డి శ్రీనివాసరావు, కొత్తపల్లి మాజీ సర్పంచ్ బుదిరెడ్డి గంగయ్య పాల్గొన్నారు.
గెలవలేని పార్టీతో మనకెందుకు పొత్తు
గెలవలేని జనసేన పార్టీతో టీడీపీకి పొత్తు ఎందుకని, అన్ని స్థానాలకు టీడీపీ అభ్యర్థులను నిలబెట్టాలని టీడీపీ సీనియర్ నాయకుడు బొద్దపు ప్రసాద్ డిమాండ్ చేశారు. అనకాపల్లి గవరపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొత్తు కారణంగా టీడీపీ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని, అధిష్టానం పునరాలోచించాలని కోరారు. ఇలాంటి నిర్ణయాల వల్ల వైఎస్సార్‌సీపీకి విజయావకాశాలు పెరుగుతాయన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని, చంద్రబాబు, లోకేష్‌లు అనకాపల్లి వచ్చినప్పుడు పార్టీ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశామని పేర్కొన్నారు. ఇటీవల మునగపాక మండలం నాగులాపల్లిలో జరిగిన శంఖారావం సభలో అనకాపల్లి టికెట్ పీలాకే ఇస్తామని లోకేష్ పార్టీ శ్రేణులకు చెప్పిన విషయం గుర్తు చేశారు. తొలి నుంచి జనసేన నిర్మాణంలో పాల్గొన్న పరుచూరి భాస్కరరావుకు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన కొణతాలకు టికెట్ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. పార్టీ నేతలు మళ్ల సురేంద్ర, కాయల ప్రసన్నలక్ష్మి, అధికసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment