అయ్యో శివశంకరా.. ఎన్నాళ్లీ అవమానాలు? | - | Sakshi
Sakshi News home page

అయ్యో శివశంకరా.. ఎన్నాళ్లీ అవమానాలు?

Published Sat, Feb 17 2024 12:50 AM | Last Updated on Sat, Feb 17 2024 8:08 AM

- - Sakshi

పెందుర్తి: జనసేనకు తొలి నుంచి క్రియాశీలకంగా ఉన్న తమ్మిరెడ్డి శివశంకర్‌ను ఆ పార్టీ అధిష్టానం దూరం పెట్టింది. జనసేన, ఆ పార్టీతో పొత్తులో ఉన్న టీడీపీ కీలక సమావేశాలకు ఆయనకు ఆహ్వానం అందడం లేదు. దీంతో శివశంకర్‌ అనుచరులు గుర్రుగా ఉన్నారు. ‘పెందుర్తి నియోజకవర్గం జనసేన టికెట్‌ను మా శివశంకర్‌కే ఇస్తామని మా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మాటిచ్చారు. కానీ ఇప్పుడు వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చి మా సార్‌ని పక్కన పెడుతున్నారు. మమ్మల్ని ఏ కార్యక్రమానికీ కూడా పిలవట్లేదు.’అంటూ పెందుర్తి నియోజకవర్గంలోని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వారం రోజుల క్రితం సుజాతనగర్‌లో జరిగిన జనసేన నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేత, పెందుర్తి నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఆశీస్తున్న తమ్మిరెడ్డి శివశంకర్‌కు ఆహ్వానం అందలేదు. దీంతో అతని వర్గీయులు తీవ్ర ఆగ్రహానికి గురై వేదిక వద్దే నిరసన వ్యక్తం చేశారు. అయినా పట్టించుకోని జనసేన అగ్ర నాయకత్వం.. శివశంకర్‌ను మరోసారి తీవ్రంగా అవమానించింది.

శనివారం మధ్యాహ్నం వేపగుంటలో జరగనున్న టీడీపీ నేత నారా లోకేష్‌ శంఖారావానికి కూడా శివశంకర్‌తో పాటు అతని వర్గీయులెవ్వరికీ ఆహ్వానం దక్కలేదు. అయితే బండారు చిరకాల ప్రత్యర్థి జనసేన జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుకు లోకేష్‌ సమక్షంలో ప్రసంగించేందుకు ఆహ్వానం అందడం గమనార్హం. ఈ మతలబు ఏంటో అర్థం కాక పెందుర్తి నియోజకవర్గ జనసేన కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement