స్థానికుడైనా అనకాపల్లి ప్రజలకు ఎప్పుడూ దూరమే
కార్యకర్తలకు అందుబాటులో ఉండని నేతగా గుర్తింపు
కొణతాలకు సీటు కేటాయింపుపై టీడీపీ, జనసేన కేడర్‌లో అసంతృప్తి
సాక్షి, అనకాపల్లి: కొణతాల రామకృష్ణ.. ఒకప్పుడు రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు పొందారు. అనకాపల్లి నుంచి గెలిచి నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. రాష్ట్ర మంత్రిగా వెలగబెట్టినా ప్రజలనే కాదు.. కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోరని పేరు. ప్రతి చిన్న విషయానికి పార్టీ అధినాయకత్వంపై అలగడం.. కొన్ని వారాలు, నెలల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం.. సహచర నాయకులు వెళ్లి బుజ్జగించడం.. అప్పట్లో అది నిత్యకృత్యం. 2014లో ఓటమి చవి చూశాక అయిదేళ్ల పాటు బయట కనిపించలేదు. మళ్లీ 2019 ఎన్నికల సమయానికి బయటకు వచ్చి హడావుడి చేయాలని ప్రయత్నించారు.
ఈసారి ఏ ఒక్క పార్టీ ఈ నేతను పట్టించుకోలేదు. దీంతో ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. పాత పార్టీలు పట్టించుకోవని ముందుగానే గ్రహించిన కొణతాల.. ఈసారి ఎటువంటి దశ దిశ లేని జనసేన వైపు అడుగులు వేశారు. రాష్ట్ర స్థాయి నేత అనే భ్రమలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా వెంటనే జనసేన కండువా కప్పేశారు. అలా చేరారో లేదో.. యథావిధిగా కొద్ది రోజులకే అలక బూనారు. టికెట్‌పై స్పష్టత ఇవ్వలేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు విశాఖ పర్యటనకు వస్తున్నా కలవనని చెప్పి ఇంట్లో కూర్చున్నారు. దీంతో నాగబాబు అతని ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ వెనుకే పవన్ కల్యాణ్ కూడా కొణతాల ఇంటికి వెళ్లి అనకాపల్లి టికెట్‌కు హామీ ఇచ్చేశారు.
ఉత్తరాంధ్ర ప్రయోజనాలు తాకట్టు : ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తానని కొణతాల ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితి ప్రారంభించారు. ఇప్పుడు ఎన్నికల్లో టికెట్ కోసం ఈ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే.. న్యాయస్థానాల్లో కేసులు వేయించి అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ప్రస్తుతం ఆయన చేతులు కలుపుతున్నారు. విశాఖ వద్దు.. అమరావతే ముద్దు అంటున్న జనసేన పార్టీలో చేరి, టికెట్ సంపాదించారు. ఉత్తరాంధ్ర పరిరక్షణ సమితిని పాడె ఎక్కించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం వేసిన బీజేపీతో జతకట్టి కూటమిలో చేరారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయకుండా నీరుగారుస్తున్న ఆ పార్టీతో నిస్సిగ్గుగా చేతులు కలిపారు. రాజకీయంగా భూస్థాపితం కావడం వల్లే చంద్రబాబు వద్ద కొణతాల ఉత్తరాంధ్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఈ ప్రాంత ప్రజా నాయకులు, మేధావులు విమర్శిస్తున్నారు.
అనకాపల్లికి ఏం చేశారు? : సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో వివిధ పదవులు నిర్వహించినప్పటికీ సొంత నియోజకవర్గ ప్రజల కోసం కొణతాల చేసిందేమీ లేదన్న విమర్శలున్నాయి.. ప్రజలే కాదు సామాన్య కార్యకర్తలు సైతం ఆయన్ను కలవాలంటే చాలా కష్టమే. తన ప్రాంత ప్రయోజనాల కోసం తాడోపేడో తేల్చుకుందామన్నంత కమిట్‌మెంట్ ఆయనలో ఎప్పుడూ కనిపించదు. అందుకే రాజకీయాల్లో అంత సీనియర్ అయినప్పటికీ తనకంటూ ముద్ర వేసుకోలేకపోయారు.
కొణతాల కోసం జనసేన కనుమరుగు
కొణతాల పుణ్యమాని జనసేన నాయకుడు పరుచూరి భాస్కరరావు వర్గీయులు బీజేపీలో చేరారు. ఇప్పటికీ కూటమి నుంచి పీలా గోవిందు, పరుచూరి, దాడి వీరభద్రరావులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు కొణతాలకు మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ.. అందుకు వారికి మనస్కరించడం లేదు. తాజాగా పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సైతం దాడి, ఆయన తనయుడు డుమ్మాకొట్టారు. చివరకు కొణతాల కోసం జిల్లాలో జనసేన కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment