అభ్యర్థుల ప్రకటన లేకపోవడంతో మదనపడుతున్న తెలుగు తమ్ముళ్లు
తూర్పు, పశ్చిమ మినహా ఏ స్థానానికి అభ్యర్థులను డిసైడ్ చేయని టీడీపీ
పొత్తుల కారణంగా నష్టపోతున్నామన్న ఆందోళనలో కార్యకర్తలు
జనసేనకి కేటాయిస్తారేమోనన్న భయంలో శ్రేణులు
కలిసి ప్రచారానికి వెళ్లేందుకు ఆసక్తి చూపని తెలుగుదేశం ద్వితీయశ్రేణి నేతలు
సాక్షి, విశాఖపట్నం: 'సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్సార్ సీపీ దూకుడుగా వ్యవహరిస్తుంటే.. టీడీపీ మాత్రం పొత్తు చిక్కుముడిని విప్పేందుకు నానా యాతన పడుతోంది. జిల్లాలో కేవలం రెండు నియోజకవర్గాలకు మాత్రమే అభ్యర్థులు ఖరారు చేయడంతో మిగిలిన ప్రాంతాల్లో తమకు సీటు వస్తుందా.. లేదా జనసేన ఖాతాలోకి చేరిపోతుందా అంటూ కలవరపడుతున్నారు. ఒకవేళ జనసేనకు తమ నియోజకవర్గంలో టికెట్ ఇస్తే.. కలిసి ప్రచారం చేసే ప్రసక్తే లేదని ద్వితీయ శ్రేణి క్యాడర్, కార్యకర్తలు ఇన్‌చార్జిలకు స్పష్టం చేస్తున్నారు.'
ఈ నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ సమరానికి సిద్ధం అంటూ దూసుకుపోతోంది. ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. వారితో మమేకమవుతున్నారు. ఇక టీడీపీ, జనసేన విషయానికొస్తే.. పొత్తులతో క్యాడర్ చిత్తవుతున్నారు. ఎవరికి సీటొస్తుందో.. ఎవరు ఎప్పుడు ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలీని సంకట స్థితిలో ఉంది. విశాఖ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు మాత్రమే తొలి జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది.
దీంతో మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఆందోళనలో ఉండటంతో దిగువ క్యాడర్ కూడా అయోమయానికి గురవుతోంది. ఉన్న వారికి సీటివ్వొద్దంటూ కొత్తవారు తెరపైకి రావడంతో.. ఎవరి వెనుక ఉండాలో తేల్చుకోలేక ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. గణబాబుకు పశ్చిమ సీటు కేటాయించినా.. అక్కడ ఉన్న వార్డుల్లో సింహభాగం నాయకులకు మింగుడు పడటం లేదు. దీంతో వారిని బుజ్జగించే పనిలో గణబాబు ఉన్నారే తప్ప.. ప్రజల గురించి ఆలోచించడం మానేశారు. అదేవిధంగా.. తూర్పు నుంచి వెలగపూడికి టికెట్ కేటాయించినా.. అక్కడ కూడా క్యాడర్‌లో నైరాశ్యం నెలకొంది.
తన సొంత మద్యం సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు తప్ప తమని పట్టించుకోలేదన్న కోపంతో క్యాడర్ రగిలిపోతోంది. ఉత్తరంలో గంటా ఉండే అవకాశం లేకపోవడంతో ఎవరికి సీటు వస్తుందో తెలీక టీడీపీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పశ్చిమం, గాజువాక, పెందుర్తిలోనూ అదే పరిస్థితి దాపురించింది. బయటకి రాలేక.. నియోజకవర్గంలో తిరగలేక.. నాయకులు సైతం అందుబాటులో ఉండకపోవడంతో టీడీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారింది.
జనసేనతోనా.. నో చాన్స్!
మరోవైపు జనసేన క్యాడర్ కూడా అదే అయోమయానికి గురవుతున్నారు. ఇన్నాళ్లూ.. పవన్ కల్యాణ్ సీఎం.. సీఎం.. అంటూ అరిచిగోల చేసిన కార్యకర్తలు.. పొత్తు కల్యాణ్‌గా మారి 24 సీట్లకే పరిమితమవ్వడంతో నిస్తేజంలోకి వెళ్లిపోయారు. హడావిడిగా పార్టీలు మారుతూ జనసేన కండువా కప్పుకున్న వారు కూడా బురదలో కూరుకుపోయామన్న భావనలో ఇళ్లు కదలడం లేదు.
చోటా నాయకులుగా ఉన్న వాళ్లు.. గాజు గ్లాసు పట్టుకుని ఎమ్మెల్యే అవుదామని కలలు కంటున్న వారికి పొరపాటున పొత్తులో భాగంగా టికెట్ ఇచ్చేస్తారేమోనన్న అనుమానాలు సైతం టీడీపీలో బలపడుతున్నాయి. ఒకవేళ.. జనసేనకు టికెట్ కేటాయిస్తే.. వారి వెంటనడిచి ప్రచారానికి వెళ్లే పరిస్థితే లేదని టీడీపీ ఇన్‌చార్జులతో తెగేసి చెబుతున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులైతే.. జనసేన ఇన్‌చార్జుల కంటే తమ వెంట నడిచే క్యాడరే ఎక్కువగా ఉంటుందంటున్నారు.
అలాంటి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. ఎలా ఊరుకుంటామంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసినట్లు సమాచారం. పొరపాటున విశాఖలోని వివిధ నియోజకవర్గాల్లో జనసేనకు టికెట్ ఇస్తే మాత్రం.. పొత్తూ లేదు.. గిత్తూ లేదు.. పార్టీ లేదు.. అని బిచాణా సర్దేసేందుకు కూడా టీడీపీ నాయకులు ‘సిద్ధం’అంటున్నారని తెలుస్తోంది. మొత్తానికి.. టీడీపీ, జనసేన మధ్య పొత్తు పొడిచినా.. అది మునిగిపోయే పడవ మాత్రమేననే భావన తెలుగు తమ్ముళ్లలోనూ, జనసేన కార్యకర్తల్లోనూ బలంగా నాటుకుంది.
Comments
Please login to add a commentAdd a comment