అంచనాలు మించిన దక్షిణ మధ్య రైల్వే ఆదాయం
హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) ఆదాయం 18.5 శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్-అక్టోబర్ మధ్య కాలంలో రూ. 6,915 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇది రూ. 5,835 కోట్లు. హుద్‌హుద్ తుపాను కారణంగా అక్టోబర్ రెండో వారంలో కార్యకలాపాలకు ఆటంకం కలిగినప్పటికీ తాజాగా రైల్వే బోర్డు నిర్దేశించిన రూ. 6,589 కోట్ల లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని ఆర్జించినట్లు ఎస్‌సీఆర్ తెలిపింది.
కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్లో సరకు రవాణా భారీగా ఎగియడం, రైలు సర్వీసులను సమర్ధమంతంగా నిర్వహించడం తదితర అంశాల కారణంగా ఇది సాధ్యపడినట్లు వివరించింది. ఈ వ్యవధిలో దాదాపు 21 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసినట్లు, 65.4 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిపినట్లు తెలిపింది. కొత్తగా భారతి సిమెంట్స్, మైహోమ్ సిమెంట్స్ తదితర సంస్థల సిమెంటు రవాణా జరిపినట్లు ఎస్‌సీఆర్ పేర్కొంది. మొత్తం మీద ప్రధానమైన సరకు రవాణా విభాగం ద్వారా రూ. 4,810 కోట్లు, ప్రయాణికుల విభాగం నుంచి రూ. 1,784 కోట్ల ఆదాయం వచ్చినట్లు వివరించింది.