టెర్రరిజాన్ని దేశ విధానంగా వాడుతున్నారు..
న్యూఢిల్లీః టెర్రరిజాన్ని వ్యతిరేకించడంలో ప్రపంచమంతా ఒక్కతాటిపైకి రావాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. కొన్ని దేశాలు టెర్రరిజాన్ని తమ దేశ విధానంగా ఉపయోగించుకుంటున్నాయని, అటువంటి దేశాలను ఒంటరిని చేయాలని సూచించారు.
రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాకిస్థాన్ పై పరోక్ష విమర్శలు చేశారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసిసి) సమావేశానికి హాజరైన రాజ్ నాథ్ అక్కడి ప్రసంగంలో ప్రత్యేకించి దేశం పేరు చెప్పకపోయినప్పటికీ పాకిస్థాన్ ను ఉద్దేశించి విమర్శించారు. ఆలోచనల్లోనూ, సమస్యలతోనూ కొన్ని దేశాలతో విభేదాలు ఉండొచ్చని, అయితే వాటి పరిష్కారానికి తుపాకీలను ఎక్కు పెట్టడమే పరిష్కారం కాదని ఆయన ఉద్ఘాటించారు. టెర్రరిజాన్ని కూకటి వేళ్ళతో పెకలివేయాలన్న రాజ్ నాథ్.. ప్రస్తుతం ప్రపంచం మొత్తం తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటోందని అన్నారు.