
కేరళలోని అలువా పట్టణాన్ని చుట్టుముట్టిన భారీ వరద (ఇన్‌సెట్‌లో) ఏరియల్ సర్వే చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం విజయన్
కొచ్చి: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న కేరళలో కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కేరళ అసాధారణమైన వరదలను ఎదుర్కొంటోంది. స్వతంత్ర భారత చరిత్రలో కేరళలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద సంభవించలేదు. వర్షం, వరదల కారణంగా రాష్ట్రంలో పంటలు, మౌలికవసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కేరళకు తక్షణ సాయంగా రూ.100 కోట్లు అందజేస్తున్నాం’ అని రాజ్‌నాథ్ తెలిపారు.
అంతకుముందు ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లో కేంద్ర పర్యాటక సహాయ మంత్రి అల్ఫోన్స్, సీఎం పినరయి విజయన్‌తో కలసి ఏరియల్ సర్వే నిర్వహించిన రాజ్‌నాథ్..కేరళను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వరద బాధితులతో మాట్లాడారు. కాగా, ప్రస్తుత విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు రూ.1,220 కోట్ల తక్షణ సాయం అందజేయాలని సీఎం విజయన్ రాజ్‌నాథ్‌కు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ రూ.8,316 కోట్ల నష్టం సంభవించిందని పేర్కొన్నారు.
ఎలాంటి విపత్కర పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు వీలుగా 14 జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాలను మోహరించినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. కేరళలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకూ 37 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా, ఇడుక్కి, వయనాడ్, కన్నూర్, ఎర్నాకులం, పాలక్కడ్, మలప్పురం జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. కేరళతో పాటు మరో 16 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.