కొచ్చిలో స్థానికులను చిన్నపాటి పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం
తిరువనంతపురం/కొచ్చి/న్యూఢిల్లీ: కనీవినీ ఎరుగని తీవ్ర విపత్తుతో కేరళ అతలాకుతలమైంది. వర్ష సంబంధ ఘటనల్లో గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారం రోజుల్లో మృతుల సంఖ్య 97కు పెరిగింది. వేల సంఖ్యలో ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. రైలు, విమాన సేవలకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న 14 జిల్లాల్లోని 13 జిల్లాల్లో హైఅలర్ట్ హెచ్చరికలు కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సుమారు లక్షన్నర మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనూ నేవీ.. త్రిసూర్, అలువా, మువాత్తుపుజాలో వరదల్లో చిక్కుకున్న బాధితులను విమానాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రధాని మోదీ సూచనల మేరకు సహాయక చర్యలను వేగవంతం చేయడానికి రక్షణశాఖ కేరళకు మిలిటరీ బృందాలను పంపింది. 35 అదనపు ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలను పంపాలని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్‌సీఎంసీ) నిర్ణయించింది. వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న బాధితులు సోషల్ మీడియా ద్వారా సాయం కోసం అభ్యర్థిస్తున్నారు.
విజయన్‌కు మోదీ హామీ..
ప్రధాని మోదీ గురువారం ఉదయం కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో మాట్లాడి వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం తరఫున పూర్తి సాయంచేస్తామని హామీ ఇచ్చారు. ‘కేరళలో వరద పరిస్థితి గురించి ముఖ్యమంత్రి విజయన్‌తో చర్చించా. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రక్షణ శాఖను కోరాను. కేరళ ప్రజల సంక్షేమం, భద్రత కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నా’నని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉందని, సహాయక చర్యలకు కేంద్ర సాయం పెంచాలని ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కోరినట్లు సీఎం విజయన్ వెల్లడించారు.
‘ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ తలెత్తలేదు. ఎప్పుడూ వరదలకు లోనుకాని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరదల నియంత్రణకు చేయాల్సినదంతా చేస్తున్నాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు భయాందోళనలకు గురికావల్సిన అవసరం లేదు. అయినా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి’ అని విజయన్ సూచించారు. పెరియార్, చాలకుడి నదుల్లో నీటి మట్టాలు పెరుగుతున్న దృష్ట్యా, వాటికి సమీపంలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.
ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్ అప్రమత్తం..
ప్రధాని మోదీ సూచన మేరకు కేరళలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వంలో జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్‌సీఎంసీ) సమావేశమైంది. కేరళకు సుమారు వేయి మందితో కూడిన 35 ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలను అదనంగా పంపాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే 18 ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సహాయకచర్యలను ముమ్మరం చేసేందుకు అదనపు మానవ వనరులు, పడవలు, హెలికాప్టర్లను సమకూర్చుకోవాలని ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వరద బాధితులకు నీరు, ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు తెలిపింది. ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటి మట్టం పెరుగుదలను కేంద్ర జలసంఘం కమిషన్ చైర్మన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
విరాళాలకు రాహుల్ విన్నపం..
కేరళలో వరద పరిస్థితిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం, కేరళ ఇంతటి కష్టకాలాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలిచ్చి వరద బాధితులకు అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘కేరళ తీవ్ర ఇక్కట్లలో ఉంది. ప్రధానితో మాట్లాడి ఆర్మీ, నేవీ దళాలు మోహరించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశా’ అని పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులు సోషల్ మీడియా వేదికగా సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. తామెక్కడ ఉన్నామో, ఆ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా బంధువులకు చేరవేస్తున్నారు. సాయం కోసం విజ్ఞప్తిచేస్తున్న ప్రజల ఫొటోలు బుధవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. పలు వార్తా చానెళ్లు కూడా బాధితులు, వారి కుటుంబాలను కలిపేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించాయి.
ఏడు రోజులు ఉచిత కాల్, డేటా సేవలు
వరద ప్రభావిత కేరళ ప్రజలకు టెలికాం కంపెనీలు వారంరోజుల పాటు ఉచిత కాల్, డేటా సేవల్ని ప్రకటించాయి. రిలయన్స్ జియో, ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌లు తమ కస్టమర్లందరూ ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించగా, ఎయిర్‌టెయిల్, వొడాఫోన్, ఐడియాలు..తమ ప్రీపెయిడ్ కస్టమర్లు లిమిటెడ్ బ్యాలెన్స్‌తో కాల్స్ చేసుకునే వెసులుబాటు కల్పించాయి. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు గడువును పొడిగించాయి. ఈ ఐదు కంపెనీలు వినియోగదారులందరికీ వారంపాటు ఉచితంగా డేటా సేవలను అందిస్తున్నట్లు తెలిపాయి. బీఎస్‌ఎన్‌ఎల్ మినహా మిగతా సంస్థలు ఉచిత డేటాకు 1 గిగాబైట్ పరిమితి విధించాయి.
నేడు కేరళకు మోదీ..
ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ చెప్పారు. శుక్రవారం వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిసిన తరువాత మోదీ కొచ్చి బయల్దేరుతారని వెల్లడించారు. రాత్రి అక్కడే బసచేసి శనివారం ఏరియల్ సర్వే చేపడతారని తెలిపారు.
వరద బాధితులకు చేయూత
పెరంబూరు(చెన్నై): కేరళ ప్రజలను ఆదుకోవడానికి తమిళ సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ గురువారం కేరళ సీఎం సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. కేరళ సీఎంను కలసి నటుడు కార్తీ రూ.10 లక్షల చెక్కు ఇచ్చారు. నటులు కమల్‌హాసన్, సూర్య, కార్తీ, శ్రీప్రియ, రోహిణి తదితరులు ఇప్పటికే విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
రైలు, మెట్రోలకు అంతరాయం
రాజధాని తిరువనంతపురం నుంచి రైలు సేవలు, కొచ్చి మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. త్రిసూర్, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడినట్లు వార్తలొచ్చాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడం వల్ల ముళ్లపెరియార్, ఇడుక్కి, ఇదమలాయర్, చెరుతోని గేట్లు ఎత్తేయడంతో, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఎర్నాకుళం, అలప్పుజా, పత్తినంతిట్టా జిల్లాల్లో వరదల విధ్వంసం సృష్టించింది. రన్‌వేపై చేరిన నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో ఆగస్టు 26 వరకు అన్ని సేవలను నిలిపేస్తున్నట్లు కొచ్చి విమానాశ్రయం ప్రకటించింది.
ముత్తం యార్డులో నీటి మట్టాలు పెరగడంతో గురువారం కొన్ని గంటలపాటు కొచ్చి మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. సుమారు 25 రైళ్లను రద్దు లేదా రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ రైల్వే పేర్కొంది. అలువా పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, అప్పుడే పుట్టిన శిశువులను ఇతర ప్రాంతాలకు తరలించారు. మువత్తుపుజాలోని ఓ ఆసుపత్రిలోకి వరద నీరు చేరడంతో అందులో సుమారు 200 మంది రోగులు చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి.
మురింగూర్‌లోని ఓ చర్చిలో చిక్కుకున్న సుమారు 1500 మందికి ఆహారం, నీరు అందించాలని మత గురువు పంపిన వీడియో పలు చానెళ్లలో ప్రసారమైంది. కొచ్చి సమీపంలోని శంకరాచార్య సంస్కృత కళాశాలలో వందల కొద్ది విద్యార్థులు చిక్కుకున్నట్లు తెలిసింది. భుజాలపై చంటిబిడ్డలను మోస్తూ కొందరు ఛాతీ లోతున్న నీటిని దాటుదున్న చిత్రాలు టీవీల్లో ప్రత్యక్షమయ్యాయి. రోడ్లు, బ్రిడ్జీలు కుప్పకూలడం, కొన్నిచోట్ల బీటలువారడంతో సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. రాష్ట్ర కేబినెట్ సమావేశమై సహాయక చర్యలకు అదనపు వనరులు సమకూర్చుకునేందుకు నవంబర్ 30 వరకు మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని నిర్ణయించింది.
ముళ్లపెరియార్‌పై తేల్చండి: సుప్రీం
కేరళను భారీ వర్షాల నేపథ్యంలో ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటిమట్టాన్ని 142 అడుగుల నుంచి 139 అడుగులకు తగ్గించడంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని విపత్తు నిర్వహణ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి తమిళనాడు, కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం సమావేశం నిర్వహించాలని సూచించింది. ఈ సందర్భంగా డ్యామ్‌లో నీటిమట్టం తగ్గింపుపై తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది.
గతంలో జరిగిన అంశాలను ఇప్పుడు ప్రస్తావనకు తీసుకురావద్దనీ, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. డ్యామ్‌పై నీటిమట్టంపై అత్యవసర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. డ్యామ్ నీటిమట్టం పెరగడంపై దిగువన ఉన్న ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొనిఉన్నాయనీ, దీన్ని తొలగించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశమై డ్యామ్ నీటిమట్టాన్ని 3 అడుగులు తగ్గించడంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కమిటీని ఆదేశించింది. అలాగే భారీ వర్షాలు, వరద కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం నాటికి 97 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో తాగునీరు, వ్యవసాయం కోసం పెరియార్ నదిపై ఈ డ్యామ్‌ను 122 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ రాజు(కేరళ)తో మద్రాస్(తమిళనాడు) ప్రెసిడెన్సీ కార్యదర్శి 1895లో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం ఈ డ్యామ్‌లోని నీటితో పాటు నిర్వహణ, ఇతర అధికారాలు తమిళనాడు ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. కాగా, డ్యామ్ కేరళలో ఉన్నందున అక్కడి ప్రభుత్వానికి కొంతమొత్తం అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు.
కొచ్చిలో వరద నీటిలో మునిగిపోతున్న యువకుడిని కాపాడుతున్న వ్యక్తి
వరద నీటిలోనే ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం
పెరియార్ డ్యామ్
Comments
Please login to add a commentAdd a comment