Red allert
-
తెలంగాణలోని 3 జిల్లాల్లో రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వరద బీభత్సం సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి జన జీవనం స్థంభించింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలపడంతో.. తెలంగాణ ప్రభుత్వం అప్రత్తమయ్యింది. తాజాగా ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. కాగా, వరదల వల్ల ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పెద్దవాగులో 9 మంది కార్మికులు చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. -
రెడ్ అలర్ట్: భారీ నుంచి అతి భారీ వర్షాలు
తిరువనంతపురం : కేరళ రాష్ర్ట వ్యాప్తంగా గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఇడుక్కి, వయనాద్, కొజిక్కోడ్, కన్నూరర్లలో 12 -20 సెంటిమీటర్ల వర్షపాతం నమోదుకానుందని అధికారులను హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా అత్యధిక వేగంగా గాలులు వీస్తాయని తెలిపింది. దీని వల్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని. వయనాద్, కొజిక్కోడ్ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇదిలా ఉండగా తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షపాతం నమోదుకావడంతో ప్రాజెక్టుల నీటిమట్టం పెరుగుతుంది. పరివాహక ప్రాంతాల్లోని నదులు పొంగిపొర్లుతున్నాయి. వయనాడ్ జిల్లాలో భారీ వర్షం కారణంగా సమీప ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహం ప్రమాదకరస్థాయికి చేరిందని అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో వయనాద్‌లోని మనంతవాడీలో 15 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో నాలుగైదు రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలని కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ ఇడుక్కి, వయనాద్ జిల్లాల కలెక్టర్లను కోరింది. (మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు) -
నీలగిరిలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్
సాక్షి, చెన్నై: మొన్నటి వరకు తీవ్ర నీటి ఎద్దడితో తల్లడిల్లిన తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పర్యటక ప్రాంతమైన నీలగిరి కొండల్లో భారీ వర్షాలతో.. వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. పిల్లూరు ఆనకట్టకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఉండడంతో.. ఆనకట్ట ప్రమాదకరంగా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్తగా నీలగిరి జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పిల్లూరు ఆనకట్ట దిగవ ప్రాంతంలో పలు గ్రామాలు నీట మునిగాయి. దీంతో ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్స్ సాయంను కోరింది. దానికితోడు ప్రభుత్వ యంత్రాంగమంతా ఎప్పటికప్పడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. సహాయ చర్యలను ముమ్మరం చేస్తోంది. మరోవైపు కావేరి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహాక ప్రాంతాల్లో దండోరా వేసి ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు పడుతుండటంతో హోగెనేకల్‌లో వాగులు, జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. మరోవారం పాటు ఇదే స్థాయిలో వరద కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. -
విమానం హైజాక్ బెదిరింపులు.. రెడ్ అలర్ట్
టీ.నగర్: విమానం హైజాక్ బెదిరింపులు రావడంతో చెన్నై విమానాశ్రయంలో శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించారు. కశ్మీర్ పుల్వామాలో ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇందుకు భారత్ ప్రతిగా భారత వైమానిక దళం పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల శిబిరాలపై బాం బుల వర్షం కురిపించడంతో అనేక మంది మృతి చెందారు. దీంతో తీవ్రవాదులు భారత్‌లో దాడులు జరపవచ్చని హెచ్చరికలు అందాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న విమానాశ్రయాల్లో విమానాలు హైజాక్ చేయనున్నట్లు బెదిరింపులు అందాయి. దీంతో దేశంలోని విమానాశ్రయాలపై దాడులు జరిపేందుకు తీవ్రవాదులు ప్రయత్నించవచ్చని కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ శాఖ హెచ్చరించింది. దీనికి సంబంధించి భారత పౌర విమానయాన శాఖ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో భద్రతను పెంపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో చెన్నై విమానాశ్రయానికి రెడ్ అలర్ట్ భద్రత కల్పించారు. దీంతో తీవ్ర తనిఖీల అనంతరమే ప్రయాణికులను విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు. విమానాశ్రయం లోపలికి సందర్శకులను అనుమతించడం లేదు. తదుపరి ప్రకటన విడుదలయ్యేంత వరకు సందర్శకులను అనుమతించకుండా నిషేధం విధించారు. -
ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే!
తిరువనంతపురం: కేరళలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద తీవ్రత ఇంకా తగ్గలేదు. రాష్ట్రంలో ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే కనబడుతున్నాయి. ఓవైపు ఊళ్లకు ఊళ్లు వరదలో మునిగిపోగా.. వరదనీటిలో మునిగి నాలుగైదురోజులుగా సాయం కోసం ఎదురుచూస్తున్నవారు ఇంకా ఉన్నారు. వీరిని సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రక్షించే పనిలో ఉన్నాయి. మరోవైపు, పునరావాస కేంద్రాల్లో పరిస్థితి దైన్యంగా ఉంది. సరైన వసతుల్లేకపోవడంతోపాటు తమవారికి క్షేమసమాచారం అందించేందుకు ఏర్పాట్లు కూడా లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నాలుగురోజులపాటు కేరళకు వర్షం రాకపోవచ్చన్న వాతావరణ శాఖ సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా రెడ్ అలర్ట్‌ను వెనక్కు తీసుకున్నారు. ఎవరి నోట విన్నా.. ‘మళ్లీ ఈ ప్రపంచాన్ని చూస్తామనుకోలేదు. ఇది పునర్జన్మ. నాలుగురోజులుగా పీకల్లోతు నీళ్లలో తిండి తిప్పల్లేకుండా ఉన్నాం. దేవుని దయతో బయటపడ్డాం’ అనే మాటలే వినబడుతున్నాయి. ఒక్కొక్కరిదీ ఒక్కో అనుభవం. చావును కళ్లముందు చూసిన పరిస్థితులనుంచి బయటపడటంతో చాలా మంది ఇంకా షాక్‌లోనే ఉన్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, వైమానిక, నేవీ బృందాలు పలు ప్రభుత్వ సహాయక బృందాలు వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడడం, పునరావాస కేంద్రాలకు తరలించడంలో బిజీగా ఉన్నాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 5,645 పునరావాస కేంద్రాల్లో 7.24 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మృతుల సంఖ్య 370కి చేరింది. కొనసాగుతున్న సహాయక చర్యలు నాలుగైదు రోజులుగా తినడానికి తిండిలేక.. నీరసించిపోయి మేడలపైనుంచి సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నవారిని హెలికాప్టర్లు, పడవల ద్వారా ఎన్డీఆర్ఎఫ్, నేవీ, వైమానిక, ఆర్మీ బలగాలు కాపాడాయి. అలప్పుజ, త్రిసూర్, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాల్లో ఇంకా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. మొత్తం 370 మంది మృతుల్లో ఒక్క ఇడుక్కి జిల్లా నుంచే 43 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. మలప్పురం జిల్లాలో 28, త్రిసూర్‌లో 27 మంది మృతిచెందినట్లు వెల్లడించారు. ‘ఇది మాకు పునర్జన్మ. నాలుగురోజులుగా తిండి లేదు నీళ్లు లేవు. మెడ వరకు నీళ్లలోనే భయం భయంగానే నిలబడి ఉన్నాం. ఆర్మీ వాళ్లు కాపాడకపోతే పరిస్థితి వేరోలా ఉండేది’ అని పత్తనంతిట్టలోని ఓ పునరావాస కేంద్రంలో ఉన్న ఓ మహిళ ఆ భయానక పరిస్థితులను గుర్తుచేసుకుంది. త్రిసూర్ కకావికలం ఎర్నాకులం జిల్లాలోని పరవూర్‌లో చర్చి కుప్పకూలడంతో అక్కడ తలదాచుకుంటున్న ఆరుగురు చనిపోయినట్లు తెలిసింది. ఒక్క త్రిసూర్ జిల్లాలోనే దాదాపు 2 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ‘త్రిసూర్ జిల్లాలోని కోలే మాగాణి ప్రాంతంలోని 42 గ్రామాలు పూర్తిగా నీటమునిగాయి. కరివన్నూర్ నది ఈ ప్రాంతాన్ని ముంచెత్తింది’ అని కేరళ వ్యవసాయ మంత్రి వీఎస్ సునీల్ కుమార్ వెల్లడించారు. సహాయక కార్యక్రమాలను మరింత వేగవంతం చేసేందుకు కొచ్చిలోని నేవల్ ఎయిర్‌పోర్టును సోమవారం నుంచి తెరవనున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్‌గార్డ్స్ సిబ్బందితోపాటు ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వేల సంఖ్యలో మత్స్యకారులు, స్థానికులు వీరికి సాయం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి చిన్నారులు, మహిళలు, వృద్ధులను ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు కాపాడుతున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. కుంటుంబాన్ని కాపాడి.. తాను బలై త్రిసూర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని రెండ్రోజులక్రితం వరదచుట్టుముట్టింది. ఊరు ఊరంతా మునిగిపోయింది. వరద ఉధృతి గంటగంటకూ పెరగుతుండటంతో ఓ 24 ఏళ్ల యువకుడు తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు నడుంబిగించాడు. ప్రాణాలకు తెగించి తల్లిని, తోబుట్టువులను ఒక్కొక్కరిగా సురక్షిత ప్రాంతాలకు తరలించాడు. తండ్రిని కూడా రక్షించే ప్రయత్నంలో వరద ఉధృతి మరింత పెరిగింది. అతికష్టం మీద తండ్రిని దగ్గరున్న చెట్టును ఎక్కించాడు. కానీ వరదపోటు తీవ్రంగా ఉండటంతో తను కూడా చెట్టునెక్కే ప్రయత్నంలో పట్టుతప్పి నీటిలో కొట్టుకుపోయాడు. కళ్లముందే ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. శనివారం సాయంత్రం ఆ యువకుడి మృతదేహాన్ని ఊరికి సమీపంలోని చెట్ల మధ్య గుర్తించారు. కేరళ వరద బీభత్సంలో ఇలాంటి హృదయవిదారక దృశ్యాలెన్నో ఉన్నాయి. క్షేమంగానే ఉన్నాం కానీ.. సరైన సమయంలో ఎన్డీఆర్ఎఫ్, ఇతర ప్రభుత్వ బృందాలు రావడంతో ప్రాణాలతో బయటపడగలిగామని బాధితులు చెప్పారు. అయితే పునరావాస కేంద్రాల్లో కనీస ఏర్పాట్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్నాకులం జిల్లా అలువాలోని యూసీ కాలేజీలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో పడుకునేందుకు చాపలు కూడా లేవని వాపోయారు. వయోసమస్యలతో బాధపడుతున్న చాలా మంది వృద్ధులు.. చాపల్లేకుండా చల్లని నేలపై పడుకోవడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు లేకపోవడంతో మొబైళ్లకు చార్జింగ్ లేక.. తమవాళ్లకు క్షేమసమాచారం తెలపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లినా ఇక్కడున్న ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు. చేరుకుంటున్న ‘సాయం’ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారితోపాటు.. వరదల్లో చిక్కుకుపోయిన వారికి అందించాల్సిన ఆహారం, పాలు, ఔషధాలు ఒక్కొక్క రాష్ట్రం నుంచి కేరళ చేరుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న మొదటి విడత సాయంలో భాగంగా 129 మెట్రిక్ టన్నుల బియ్యం, 30 మెట్రిక్ టన్నుల పాలపొడి ఇప్పటికే కొచ్చికి రవాణా అయ్యాయి. మరోవైపు, తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్.. ప్రభావిత ప్రాంతాలకు అత్యవసర మందులను పంపించింది. దీంతోపాటుగా పలు స్వచ్ఛంద సంస్థలు 150 ట్రక్కుల లోడ్‌లో బియ్యం ఇతర ధాన్యాలను పంపించాయి. మరోవైపు, పంజాబ్‌లోని పటియాలా, జలంధర్‌ల నుంచి బిస్కట్లు, రస్క్‌లు, తాగునీటి ప్యాకెట్లు విమానం ద్వారా కేరళకు చేరుకున్నాయి. కర్ణాటకలోనూ వరదలు కర్ణాటకలోని కొడగు జిల్లాలోనూ భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతిచెందినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు.. వరదల్లో చిక్కుకున్న 3500 మందిని కాపాడాయి. మక్కందూరులో ఓ మహిళ, ఆమె రెండు నెలల చిన్నారిని హెలికాప్టర్ సాయంతో కాపాడారు. అంకెల్లో కేరళ వరద.. మృతులు (జూన్ నుంచి) 370 గత పది రోజుల్లో మృతులు 210 వరద నష్టం అంచనా రూ. 19,512 కోట్లు పంట నష్టం 9,06,400 హెక్టార్లు గేట్లు ఎత్తిన డ్యాములు 35 (మొత్తం డ్యాములు 39) సహాయక శిబిరాలు 5,645 శిబిరాల్లో ఉన్నవారు 7,24,649 బలగాలు రక్షించిన వారు 33,000 కూలిన వంతెనలు, ధ్వంసమైన రోడ్లు 134 సహాయక చర్యల్లో.. ఆర్మీ 10 కాలమ్స్ నేవీ టీమ్స్ 82 కోస్ట్‌గార్డ్ టీమ్స్ 42 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 57 వాడిన హెలికాప్టర్లు 38 రవాణా విమానాలు 20 కేంద్రం పంపినవి బియ్యం 129 మెట్రిక్ టన్నులు పాలపొడి 30 మెట్రిక్ టన్నులు వరద నీటిలో చిన్నారులను భుజాలపై మోసుకెళ్తున్న ఆర్మీ సిబ్బంది అలప్పుజాలో మహిళను రక్షిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ నిత్యావసర సరుకుల కోసం మహిళ వేడుకోలు చెంగనూరులో తన వస్తువులతో సహా వరద నీటిని దాటుతున్న వ్యక్తి అందుకోండి సాయం :చెంగనూరులో వరద బాధితులకు హెలికాప్టర్ నుంచి ఆహారపొట్లాలను జారవిడుస్తున్న వైమానిక దళ సిబ్బంది -
వరద ప్రళయం
తిరువనంతపురం/కొచ్చి/న్యూఢిల్లీ: కనీవినీ ఎరుగని తీవ్ర విపత్తుతో కేరళ అతలాకుతలమైంది. వర్ష సంబంధ ఘటనల్లో గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారం రోజుల్లో మృతుల సంఖ్య 97కు పెరిగింది. వేల సంఖ్యలో ఇళ్లు, రోడ్లు దెబ్బతిన్నాయి. రైలు, విమాన సేవలకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో ఉన్న 14 జిల్లాల్లోని 13 జిల్లాల్లో హైఅలర్ట్ హెచ్చరికలు కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సుమారు లక్షన్నర మంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనూ నేవీ.. త్రిసూర్, అలువా, మువాత్తుపుజాలో వరదల్లో చిక్కుకున్న బాధితులను విమానాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ప్రధాని మోదీ సూచనల మేరకు సహాయక చర్యలను వేగవంతం చేయడానికి రక్షణశాఖ కేరళకు మిలిటరీ బృందాలను పంపింది. 35 అదనపు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను పంపాలని జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్సీఎంసీ) నిర్ణయించింది. వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న బాధితులు సోషల్ మీడియా ద్వారా సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. విజయన్‌కు మోదీ హామీ.. ప్రధాని మోదీ గురువారం ఉదయం కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో మాట్లాడి వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్రం తరఫున పూర్తి సాయంచేస్తామని హామీ ఇచ్చారు. ‘కేరళలో వరద పరిస్థితి గురించి ముఖ్యమంత్రి విజయన్‌తో చర్చించా. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని రక్షణ శాఖను కోరాను. కేరళ ప్రజల సంక్షేమం, భద్రత కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నా’నని మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉందని, సహాయక చర్యలకు కేంద్ర సాయం పెంచాలని ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కోరినట్లు సీఎం విజయన్ వెల్లడించారు. ‘ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఎప్పుడూ తలెత్తలేదు. ఎప్పుడూ వరదలకు లోనుకాని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. వరదల నియంత్రణకు చేయాల్సినదంతా చేస్తున్నాం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు భయాందోళనలకు గురికావల్సిన అవసరం లేదు. అయినా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి’ అని విజయన్ సూచించారు. పెరియార్, చాలకుడి నదుల్లో నీటి మట్టాలు పెరుగుతున్న దృష్ట్యా, వాటికి సమీపంలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్ అప్రమత్తం.. ప్రధాని మోదీ సూచన మేరకు కేరళలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా నేతృత్వంలో జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్సీఎంసీ) సమావేశమైంది. కేరళకు సుమారు వేయి మందితో కూడిన 35 ఎన్డీఆర్ఎఫ్ బలగాలను అదనంగా పంపాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే 18 ఎన్డీఆర్ఎఫ్ దళాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సహాయకచర్యలను ముమ్మరం చేసేందుకు అదనపు మానవ వనరులు, పడవలు, హెలికాప్టర్లను సమకూర్చుకోవాలని ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. వరద బాధితులకు నీరు, ఆహార పొట్లాలను పంపిస్తున్నట్లు తెలిపింది. ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటి మట్టం పెరుగుదలను కేంద్ర జలసంఘం కమిషన్ చైర్మన్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. విరాళాలకు రాహుల్ విన్నపం.. కేరళలో వరద పరిస్థితిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం, కేరళ ఇంతటి కష్టకాలాన్ని ఎప్పుడూ ఎదుర్కోలేదని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలిచ్చి వరద బాధితులకు అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘కేరళ తీవ్ర ఇక్కట్లలో ఉంది. ప్రధానితో మాట్లాడి ఆర్మీ, నేవీ దళాలు మోహరించి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని విజ్ఞప్తి చేశా’ అని పేర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న బాధితులు సోషల్ మీడియా వేదికగా సాయం కోసం అభ్యర్థిస్తున్నారు. తామెక్కడ ఉన్నామో, ఆ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా బంధువులకు చేరవేస్తున్నారు. సాయం కోసం విజ్ఞప్తిచేస్తున్న ప్రజల ఫొటోలు బుధవారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించాయి. పలు వార్తా చానెళ్లు కూడా బాధితులు, వారి కుటుంబాలను కలిపేందుకు హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించాయి. ఏడు రోజులు ఉచిత కాల్, డేటా సేవలు వరద ప్రభావిత కేరళ ప్రజలకు టెలికాం కంపెనీలు వారంరోజుల పాటు ఉచిత కాల్, డేటా సేవల్ని ప్రకటించాయి. రిలయన్స్ జియో, ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్లు తమ కస్టమర్లందరూ ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించగా, ఎయిర్‌టెయిల్, వొడాఫోన్, ఐడియాలు..తమ ప్రీపెయిడ్ కస్టమర్లు లిమిటెడ్ బ్యాలెన్స్‌తో కాల్స్ చేసుకునే వెసులుబాటు కల్పించాయి. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు బిల్లులు చెల్లించేందుకు గడువును పొడిగించాయి. ఈ ఐదు కంపెనీలు వినియోగదారులందరికీ వారంపాటు ఉచితంగా డేటా సేవలను అందిస్తున్నట్లు తెలిపాయి. బీఎస్ఎన్ఎల్ మినహా మిగతా సంస్థలు ఉచిత డేటాకు 1 గిగాబైట్ పరిమితి విధించాయి. నేడు కేరళకు మోదీ.. ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారని కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్ చెప్పారు. శుక్రవారం వాజ్‌పేయి అంత్యక్రియలు ముగిసిన తరువాత మోదీ కొచ్చి బయల్దేరుతారని వెల్లడించారు. రాత్రి అక్కడే బసచేసి శనివారం ఏరియల్ సర్వే చేపడతారని తెలిపారు. వరద బాధితులకు చేయూత పెరంబూరు(చెన్నై): కేరళ ప్రజలను ఆదుకోవడానికి తమిళ సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ గురువారం కేరళ సీఎం సహాయ నిధికి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. కేరళ సీఎంను కలసి నటుడు కార్తీ రూ.10 లక్షల చెక్కు ఇచ్చారు. నటులు కమల్‌హాసన్, సూర్య, కార్తీ, శ్రీప్రియ, రోహిణి తదితరులు ఇప్పటికే విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రైలు, మెట్రోలకు అంతరాయం రాజధాని తిరువనంతపురం నుంచి రైలు సేవలు, కొచ్చి మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. త్రిసూర్, కన్నూర్, కోజికోడ్ జిల్లాల్లో కొండచరియలు విరిగిపడినట్లు వార్తలొచ్చాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడం వల్ల ముళ్లపెరియార్, ఇడుక్కి, ఇదమలాయర్, చెరుతోని గేట్లు ఎత్తేయడంతో, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఎర్నాకుళం, అలప్పుజా, పత్తినంతిట్టా జిల్లాల్లో వరదల విధ్వంసం సృష్టించింది. రన్‌వేపై చేరిన నీరు తగ్గుముఖం పట్టకపోవడంతో ఆగస్టు 26 వరకు అన్ని సేవలను నిలిపేస్తున్నట్లు కొచ్చి విమానాశ్రయం ప్రకటించింది. ముత్తం యార్డులో నీటి మట్టాలు పెరగడంతో గురువారం కొన్ని గంటలపాటు కొచ్చి మెట్రో రైలు సేవలు నిలిచిపోయాయి. సుమారు 25 రైళ్లను రద్దు లేదా రీషెడ్యూల్ చేసినట్లు దక్షిణ రైల్వే పేర్కొంది. అలువా పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులు, అప్పుడే పుట్టిన శిశువులను ఇతర ప్రాంతాలకు తరలించారు. మువత్తుపుజాలోని ఓ ఆసుపత్రిలోకి వరద నీరు చేరడంతో అందులో సుమారు 200 మంది రోగులు చిక్కుకున్నట్లు వార్తలొచ్చాయి. మురింగూర్‌లోని ఓ చర్చిలో చిక్కుకున్న సుమారు 1500 మందికి ఆహారం, నీరు అందించాలని మత గురువు పంపిన వీడియో పలు చానెళ్లలో ప్రసారమైంది. కొచ్చి సమీపంలోని శంకరాచార్య సంస్కృత కళాశాలలో వందల కొద్ది విద్యార్థులు చిక్కుకున్నట్లు తెలిసింది. భుజాలపై చంటిబిడ్డలను మోస్తూ కొందరు ఛాతీ లోతున్న నీటిని దాటుదున్న చిత్రాలు టీవీల్లో ప్రత్యక్షమయ్యాయి. రోడ్లు, బ్రిడ్జీలు కుప్పకూలడం, కొన్నిచోట్ల బీటలువారడంతో సహాయక చర్యలు కష్టతరమవుతున్నాయి. రాష్ట్ర కేబినెట్ సమావేశమై సహాయక చర్యలకు అదనపు వనరులు సమకూర్చుకునేందుకు నవంబర్ 30 వరకు మద్యంపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని నిర్ణయించింది. ముళ్లపెరియార్పై తేల్చండి: సుప్రీం కేరళను భారీ వర్షాల నేపథ్యంలో ముళ్లపెరియార్ డ్యామ్‌లో నీటిమట్టాన్ని 142 అడుగుల నుంచి 139 అడుగులకు తగ్గించడంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని విపత్తు నిర్వహణ కమిటీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి తమిళనాడు, కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో శుక్రవారం సమావేశం నిర్వహించాలని సూచించింది. ఈ సందర్భంగా డ్యామ్‌లో నీటిమట్టం తగ్గింపుపై తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో జరిగిన అంశాలను ఇప్పుడు ప్రస్తావనకు తీసుకురావద్దనీ, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. డ్యామ్‌పై నీటిమట్టంపై అత్యవసర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. డ్యామ్ నీటిమట్టం పెరగడంపై దిగువన ఉన్న ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొనిఉన్నాయనీ, దీన్ని తొలగించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశమై డ్యామ్ నీటిమట్టాన్ని 3 అడుగులు తగ్గించడంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కమిటీని ఆదేశించింది. అలాగే భారీ వర్షాలు, వరద కారణంగా నిరాశ్రయులైన ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని సూచించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు గురువారం నాటికి 97 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో తాగునీరు, వ్యవసాయం కోసం పెరియార్ నదిపై ఈ డ్యామ్‌ను 122 ఏళ్ల క్రితం నిర్మించారు. ఈ మేరకు ట్రావెన్కోర్ రాజు(కేరళ)తో మద్రాస్(తమిళనాడు) ప్రెసిడెన్సీ కార్యదర్శి 1895లో ఒప్పందం చేసుకున్నారు. దీని ప్రకారం ఈ డ్యామ్‌లోని నీటితో పాటు నిర్వహణ, ఇతర అధికారాలు తమిళనాడు ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. కాగా, డ్యామ్ కేరళలో ఉన్నందున అక్కడి ప్రభుత్వానికి కొంతమొత్తం అద్దె చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. కొచ్చిలో వరద నీటిలో మునిగిపోతున్న యువకుడిని కాపాడుతున్న వ్యక్తి వరద నీటిలోనే ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యం పెరియార్ డ్యామ్ -
కొచ్చి విమానాశ్రయం మూసివేత
తిరువనంతపురం/కొచ్చి: కేరళపై వరుణ ప్రతాపం కొనసాగుతూనే ఉంది. తాజాగా పెరియార్ నదిపై ఉన్న ఆనకట్ట గేట్లు తెరవడంతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోకి నీరు చేరింది. దీంతో శనివారం మధ్యాహ్నం వరకు ఎయిర్‌పోర్టును మూసివేస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, చిన్న విమానాలను కొచ్చిలోని నౌకాదళ విమానాశ్రయంలో దింపేందుకు అనుమతివ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. కొచ్చికి రావాల్సిన, కొచ్చి నుంచి బయలుదేరే విమానాల్లో సీట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకునేందుకు, ప్రయాణ తేదీల్లో మార్పులు చేసుకునేందుకు ఎలాంటి చార్జీలూ విధించబోమని విమానయాన సంస్థలు ప్రకటించాయి. రాష్ట్రంలో తాజా పరిస్థితిపై విజయన్ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌లతో చర్చించారు. అన్ని రకాలుగా సాయం చేస్తామని ప్రధాని హామీనిచ్చినట్లు విజయన్ చెప్పారు. విద్యుత్తు సరఫరా, సమాచార వ్యవస్థలు, తాగునీటి సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ మొత్తం 14 జిల్లాలకూ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం ఒక్కరోజులోనే వివిధ జిల్లాల్లో కలిపి 25 మంది మరణించారు. వీరిలో 11 మంది మలప్పురం జిల్లాకు చెందిన వారే. కేరళలో వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడటం కారణంగా ఆగస్టు 8 నుంచి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 67కు పెరిగింది. నిరాశ్రయులుగా మారిన ఒకటిన్నర లక్షల మందిని శరణార్థి శిబిరాలకు తరలించారు. అన్ని నదుల్లోనూ వరదే పెరియార్, చాలక్కిడిపుజ, పంపా సహా కేరళ వ్యాప్తంగా నదులన్నీ వరద నీటితో ఉప్పొంగుతున్నాయి. ముళ్లపెరియార్ డ్యాం సహా రాష్ట్రంలోని 35 ఆనకట్టల గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు. మరోవైపు తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, పాదనం దిట్ట, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూ ర్, కొజికోడ్ జిల్లాల్లో గంటలకు 60 కి.మీ. వేగంతో వీచే గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. బుధవారం ఉదయం మలప్పురం జిల్లాలో ఓ ఇంటిపై కొండ చరియలు విరిగిపడి ఆ ఇంట్లోని దంపతులు, వారి ఆరేళ్ల కుమారుడు మరణించారు. ఇడుక్కి జిల్లాలోనూ ఇళ్లపై కొండ చరియలు పడి ఇద్దరు మహిళలు మరణించారు. త్రిస్సూర్‌లో ఓ మత్స్యకారుడు విద్యుదాఘాతంతో చనిపోయాడు. మంగళవారం రాత్రి మున్నార్‌లో ఓ హోటల్‌పై కొండ చరియలు పడటంతో అక్కడ పనిచేస్తున్న తమిళనాడుకు చెందిన కార్మికుడు మరణించారు. రాజధాని సహా పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధనంలోనే ఉన్నాయి. -
భారీ వర్షాలు : హై అలర్ట్‌కు ఆదేశించిన ముఖ్యమంత్రి
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉందనే సమాచారంతో కొడగు, దక్షిణ కన్నడ, హాసన్, చిక్మంగళూరు,శివమెగ్గ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించిన ఆయన సంబంధిత జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. మంత్రులు సైతం ఎప్పటికప్పుడు జిల్లాల్లోని పరిస్థితులను సమీక్షిస్తుండాలని కోరారు. కర్ణాటకలో గత కొద్ది రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. గడిచిన 24గంటల్లో ఉడిపి జిల్లాలో 35.7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో అధికారులు అక్కడ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అరేబియా సముద్ర తీరం వెంట బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. -
భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్
తిరువనంతపురం : కేరళలో వరద బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 37 మంది మరణించగా, ఇప్పటివరకు 35, 874 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వాతావరణ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు పెరియన్ నదికి వరద పోటెత్తుతోంది. ఇడుక్కీ డ్యామ్‌కు వరద మరింత పెరగడంతో గేట్లను పూర్తిగా ఎత్తి దిగువనకు నీళ్లు వదులుతున్నారు. ఇడుక్కీ నుంచి వరద ఉధృతి మరింత పెరగడంతో దిగువను ఉన్న ప్రాంతాలను అధికారులు పునరావాస ప్రాంతాలకు తరలించారు. కేరళ సర్కారుకు తగినన్ని సహాయ నిధులకు విడుదల చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. దేశంలో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకావాలున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) హెచ్చరించింది. -
కేరళ అతలాకుతలం
తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 29 మంది మృతి చెందగా, సుమారు 54వేల మంది నిర్వాసితులు అయ్యారు. వీరిలో 53,501 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు తెలిపారు. మరోవైపు వర్షాల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఏడు ఉత్తర జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అదనంగా మరో 5 ఆర్మీ బృందాలను రంగంలోకి దింపారు. పెరియార్ నది నీటి మట్టం అతివేగంగా పెరుగుతోంది. ఇడుక్కి రిజర్వాయర్ నుంచి మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో ఇడుక్కితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆసియాలో అతిపెద్ద ఆర్చ్ డ్యాం ‘ఇడుక్కి రిజర్వాయర్’ నిండడంతో మరో 3 గేట్లను ఎత్తారు. వరదలపై మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరదల నేపథ్యంలో ఈ నెల 12 వరకు ఆయన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. -
అ‘టెన్షన్’
* మావో అగ్రనేతల ఎన్‌కౌంటర్‌తో పోలీసుల అప్రమత్తం * పల్నాడు, నల్లమల అటవీ ప్రాంతంలో రెడ్ అలర్ట్ * ప్రజాప్రతినిధులకు భద్రత కట్టుదిట్టం సాక్షి, గుంటూరు: పల్నాడుతోపాటు నల్లమల అటవీ ప్రాంత పరిసరాల్లో మళ్లీ అలజడి మొదలైంది. ఆంధ్ర– ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో అనేకమంది మావోయిస్టు అగ్రనేతలు మరణించడం గమనార్హం. గుంటూరు రేంజ్ పరిధిలోని గుంటూరు రూరల్, ప్రకాశం జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉండడంతో ఇది మావోయిస్టు అగ్రనేతలకు గతంలో షెల్టర్ జోన్‌గా ఉండేది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. గుంటూరు రేంజ్ పరిధిలోని నాలుగు పోలీసు జిల్లాల్లో ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వారి పర్యటనలపై ఎప్పటికప్పుడు తమకు ముందస్తు సమాచారం అందించాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఏఎన్ఎస్ బృందాలు కూంబింగ్ ముమ్మరం చేసి మావోయిస్టుల స్థావరాల కోసం వెతుకులాట ప్రారంభించాయి. గతంలో ఉన్న ట్రాక్ రికార్డుల ఆధారంగా మావోయిస్టు సానుభూతిపరులపై నిఘా పెట్టారు. భయాందోళనలో పల్నాడు ప్రజాప్రతినిధులు.. మావో అగ్రనేతల ఎన్కౌంటర్ నేపథ్యంలో పల్నాడులోని నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండే గ్రామాలు, తండాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల్లోని బొల్లాపల్లి, ఈపూరు, కారంపూడి, దుర్గి, వెల్దుర్తి మండలాల్లో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించిఉండడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. 2004కు ముందు మావోల తుపాకి మోతలు, పోలీసుల బూట్ల చప్పుళ్లతో ఈ ప్రాంతం దద్దరిల్లిన విషయం అందరికీ తెలిసిందే. 2014లో గుంటూరు, ప్రకాశం జిల్లాల బోర్డర్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టు నేతలు జానా బాబూరావు, విమలక్క, పద్మక్కలు పోలీస్ ఎన్కౌంటర్లో మృతిచెందిన సమయంలోనూ ఈ ప్రాంతంలో తీవ్ర అలజడి రేగింది. అప్పటినుంచి ప్రశాంతంగా ఉంటున్న నల్లమల సమీప ప్రాంతాల్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్ నిద్రపట్టకుండా చేస్తోంది. తుమృకోటలో ఉద్రిక్తత.. రెంటచింతల: పోలీసు ఎన్కౌంటర్లో మృతిచెందిన పృథ్వి అలియాస్ మున్నా మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) తనయుడే. ఆర్కేది రెంటచింతల మండలం తుమృకోట గ్రామం కావడంతో ఆప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పృథ్వి చాలా ఏళ్ల కిందట పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో ఏర్పాటుచేసిన చారుమజుందార్ స్మారక స్థూపం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల నిమిత్తం అడవి నుంచి బయటకు వచ్చిన సమయంలో గుత్తికొండ వద్ద ఏర్పాటు చేసిన భారీ మావోయిస్టుల సభలో సైతం ఆయన పాల్గొన్నట్లు ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పల్నాడు ప్రాంతవాసులు భయపడుతున్నారు. కొందరు గ్రామం వదిలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.